నిర్గమకాండము 4:1-9
నిర్గమకాండము 4:1-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అందుకు మోషే, “ఒకవేళ వారు నన్ను నమ్మకుండ లేదా నేను చెప్పేది వినకుండ, ‘యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు’ అని అంటే ఎలా?” అన్నాడు. అప్పుడు యెహోవా అతనితో, “నీ చేతిలో ఉన్నది ఏమిటి?” అని అన్నారు. “ఒక కర్ర” అని అతడు జవాబిచ్చాడు. అందుకు యెహోవా, “దానిని నేలపై పడవేయి” అన్నారు. మోషే దానిని నేల మీద పడవేయగానే అది పాముగా మారింది, అతడు దాని నుండి పారిపోయాడు. అప్పుడు యెహోవా, “నీ చేయి చాచి దాని తోక పట్టుకుని పైకెత్తు” అని అతనితో అన్నారు. మోషే తన చేతిని చాచి ఆ పాము తోక పట్టుకుని పైకెత్తగానే అది తిరిగి అతని చేతిలో కర్రగా మారింది. అప్పుడు యెహోవా, “దీనిని బట్టి వారు, తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమయ్యారని నమ్ముతారు” అని అన్నారు. యెహోవా, “నీ చేతిని నీ ఛాతీ మీద పెట్టు” అన్నారు. మోషే తన చేతిని తన ఛాతీ మీద పెట్టాడు, అతడు దానిని బయటకు తీయగా, అది కుష్ఠురోగంతో మంచులా తెల్లగా మారిపోయింది. “ఇప్పుడు నీ చేయి మరలా నీ ఛాతీ మీద పెట్టు” అని ఆయన అన్నారు. మోషే తన చేతిని మరలా తన ఛాతీ మీద పెట్టాడు, అతడు దానిని బయటకు తీసినప్పుడు, అది తిరిగి మంచిదిగా, మిగితా దేహంలా అది మారింది. అప్పుడు యెహోవా, “వారు నిన్ను నమ్మకపోయినా మొదటి అసాధారణ గుర్తును లక్ష్యపెట్టకపోయినా, రెండవదానిని బట్టి నమ్మవచ్చు. అయితే వారు ఈ రెండు అసాధారణ గుర్తులను కూడా నమ్మకపోయినా లేదా నీ మాట వినకపోయినా, నీవు నైలు నది నుండి కొంచెం నీరు తీసుకుని పొడినేల మీద పోయి. నీవు నది నుండి తీసుకున్న నీరు నేలమీద రక్తంగా మారుతుంది” అని చెప్పారు.
నిర్గమకాండము 4:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు మోషే “వాళ్ళు నన్ను నమ్మరు. నా మాట వినరు. ‘యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు’ అంటారేమో” అని జవాబిచ్చాడు. యెహోవా “నీ చేతిలో ఉన్నది ఏమిటి?” అని మోషేను అడిగాడు. అతడు “కర్ర” అన్నాడు. అప్పుడు దేవుడు “ఆ కర్రను నేల మీద పడవెయ్యి” అన్నాడు. అతడు దాన్ని నేల మీద పడవెయ్యగానే అది పాముగా మారిపోయింది. మోషే భయపడి దూరంగా పరిగెత్తాడు. అప్పుడు యెహోవా “నీ చేత్తో దాని తోక పట్టుకో” అని చెప్పాడు. అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకోగానే అది అతని చేతిలో కర్రగా మారిపోయింది. ఆయన “దీన్ని బట్టి వాళ్ళు తమ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు” అన్నాడు. తరువాత యెహోవా “నీ చెయ్యి నీ అంగీలో పెట్టుకో” అన్నాడు. అతడు తన చెయ్యి అంగీలో ఉంచి బయటికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టురోగం సోకినట్టు మంచులాగా తెల్లగా మారిపోయింది. తరువాత ఆయన “నీ చెయ్యి మళ్ళీ నీ అంగీలో ఉంచుకో” అన్నాడు. అతడు తన చెయ్యి తన అంగీలో ఉంచుకుని బయటికి తీసినప్పుడు అది అతని మిగతా శరీరంలాగా మామూలుగా అయిపోయింది. అప్పుడు దేవుడు “వాళ్ళు నా శక్తిని కనపరిచే మొదటి అద్భుతాన్ని పట్టించుకోకుండా నమ్మకుండా ఉంటే రెండవ దాన్ని బట్టి నమ్ముతారు. ఈ రెండు అద్భుతాలను చూసి కూడా నిన్ను నమ్మకుండా నీ మాట వినకుండా ఉంటే, నువ్వు నదిలోని కొంచెం నీళ్ళు తీసుకుని ఎండిన నేల మీద కుమ్మరించు. నువ్వు నదిలో నుండి తీసి పొడి నేలపై పోసిన నీళ్లు రక్తంలాగా మారిపోతాయి” అన్నాడు.
నిర్గమకాండము 4:1-9 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు మోషే, “నీవు నన్ను పంపించావు అని చెబితే ఇశ్రాయేలు ప్రజలు నమ్మరు గదా! ‘యెహోవా నీకు కనబడనే లేదు అంటారు వాళ్లు’” అన్నాడు దేవునితో. అయితే దేవుడు, “నీ చేతిలోనిది ఏమిటి” అని మోషేను అడిగాడు. “ఇది నా చేతికర్ర” అని మోషే జవాబిచ్చాడు. అప్పుడు దేవుడు, “నీ కర్ర కింద పడవెయ్యి” అన్నాడు. మోషే తన కర్రను నేల మీద పడేసాడు. ఆ కర్ర ఒక పాముగా మారిపోయింది. మోషే భయపడి దాని దగ్గర్నుండి పారిపోయాడు. అయితే యెహోవా మోషేతో, “ముందుకు వెళ్లి ఆ పాము తోక అందుకో” అన్నాడు. మోషే ముందుకు వెళ్లి పాముతోక అందుకొన్నాడు. మోషే అలా చేయగానే ఆ పాము మళ్లీ కర్ర అయిపోయింది. “ఈ కర్రను ఇలా ప్రయోగించు, అప్పుడు మీ పూర్వీకుల దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యెహోవా నీకు ప్రత్యక్షమయ్యాడని నీ ప్రజలు నమ్ముతారు” అన్నాడు దేవుడు. ఆ తర్వాత యెహోవా, “నీకు ఇంకో రుజువు ఇస్తాను. నీ చెయ్యి నీ చొక్కాలోపల పెట్టు” అన్నాడు మోషేతో. కనుక మోషే తన చొక్కా తెరిచి తన చేతిని లోపల పెట్టాడు. మళ్లీ మోషే తన చొక్కాలోనుంచి తన చేతిని బయటికి తీయగానే అది మారిపోయింది. అతని చేతినిండా మంచులాంటి తెల్లని కుష్ఠు మచ్చలు కప్పేసాయి. “నీ చేతిని మళ్లీ నీ చొక్కాలో పెట్టు” అన్నాడు దేవుడు. మోషే తన చేతిని మళ్లీ తన చొక్కాలోపల పెట్టాడు. మోషే అలా పెట్టి మళ్లీ తన చేతిని బయటికి తీయగానే అతని చెయ్యి మారిపోయింది. ఇప్పుడు అతని చెయ్యి బాగైపోయి మళ్లీ మునుపటిలానే ఉంది. “నీకర్రను ఉపయోగించినప్పుడు ప్రజలు నిన్ను నమ్మకపోతే, నీవు ఈ సూచన చూపెట్టినప్పుడు వాళ్లు నిన్ను నమ్ముతారు. నీవు వాళ్లకు ఈ రెండు సూచనలు చూపించాక కూడ వాళ్లు నమ్మటానికి నిరాకరిస్తే, అప్పుడు నైలు నదిలోనుంచి కొన్ని నీళ్లు తీసుకో, ఆ నీళ్లను నేలమీద పొయ్యి. అవి నేలను తాకగానే రక్తం అవుతాయి” అన్నాడు దేవుడు.
నిర్గమకాండము 4:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అందుకు మోషే–చిత్తగించుము; వారు నన్ను నమ్మరు నా మాట వినరు–యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా యెహోవా–నీ చేతిలోనిది ఏమిటి అని అతని నడిగెను. అందుకతడు–కఱ్ఱ అనెను. అప్పుడాయన–నేలను దాని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా–నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతనిచేతిలో కఱ్ఱ ఆయెను. ఆయన –దానిచేత వారు తమపితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయెనని నమ్ముదురనెను. మరియు యెహోవా–నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొను మనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠముగలదై హిమమువలె తెల్లగా ఆయెను. తరువాత ఆయన–నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్మునుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరమువలె ఆయెను. మరియు ఆయన–వారు నిన్ను నమ్మక, మొదటి సూచననుబట్టి వినకపోయినయెడల రెండవ దానిబట్టి విందురు. వారు ఈ రెండు సూచనలనుబట్టి నమ్మక నీమాట వినకపోయినయెడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి యెండిన నేలమీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలోనుండి తీసిన నీళ్లు పొడినేలమీద రక్తమగుననెను.