అపొస్తలుల కార్యములు 7:23-30
అపొస్తలుల కార్యములు 7:23-30 IRVTEL
అతనికి సుమారు నలభై ఏళ్ళ వయసప్పుడు ఇశ్రాయేలీయులైన తన స్వంత ప్రజలను చూడాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడు వారిలో ఒకడు అన్యాయానికి గురి కావడం చూసి, అతనిని కాపాడి అతడి పక్షాన ఆ ఐగుప్తు వాణ్ణి చంపి ప్రతీకారం చేశాడు. తన ద్వారా తన ప్రజను దేవుడు విడుదల చేస్తున్నాడనే సంగతి తన ప్రజలు గ్రహిస్తారని అతడనుకున్నాడు గాని వారు గ్రహించలేదు. “ఆ తరువాత రోజు ఇద్దరు పోట్లాడుకుంటుంటే అతడు వారిని చూసి, ‘అయ్యలారా, మీరు సోదరులు. మీరెందుకు ఒకరికొకరు అన్యాయం చేసుకుంటున్నారు’ అని వారికి సర్ది చెప్పాలని చూశాడు. అయితే తన పొరుగువాడికి అన్యాయం చేసినవాడు, ‘మామీద అధికారిగా, న్యాయనిర్ణేతగా నిన్నెవరు నియమించారు? నిన్న ఐగుప్తు వాణ్ణి చంపినట్టు నన్నూ చంపాలనుకుంటున్నావా?’ అని చెప్పి అతణ్ణి నెట్టేశాడు. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో విదేశీయుడుగా ఉంటూ, అక్కడే ఇద్దరు కొడుకులను కన్నాడు. నలభై ఏళ్ళయిన తరువాత సీనాయి పర్వతారణ్యంలో, ఒక పొదలోని మంటల్లో దేవదూత అతనికి కనిపించాడు.

