అపొస్తలుల కార్యములు 7:23-30 - Compare All Versions

అపొస్తలుల కార్యములు 7:23-30 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“మోషేకు నలభై సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు అతడు ఇశ్రాయేలీయులైన తన సొంత ప్రజలను చూడాలని నిర్ణయించుకొన్నాడు. అతడు తన జాతివారిలోని ఒకడిని ఒక ఐగుప్తీయుడు దౌర్జన్యంగా కొట్టడం చూసి, వానిని కాపాడి ఆ ఈజిప్టువాన్ని చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. తన ద్వారా తన సొంత జాతి ప్రజలను దేవుడు విడుదల చేస్తున్నాడనే సంగతిని తన ప్రజలు తెలుసుకుంటారని మోషే అనుకున్నాడు కాని వారు గ్రహించలేదు. మరుసటిరోజు, పోట్లాడుకుంటున్న ఇద్దరు ఇశ్రాయేలీయుల దగ్గరకు మోషే వచ్చి వారిని సమాధానపరచాలని ప్రయత్నిస్తూ ‘అయ్యా, మీరిద్దరు సహోదరులు కదా, మీరెందుకు ఒకరిని ఒకరు గాయపరచుకొంటున్నారు?’ అని అడిగాడు. “అయితే గాయపరుస్తున్న వాడు మోషేను ప్రక్కకు త్రోసి, ‘మామీద అధికారిగా న్యాయాధిపతిగా నిన్ను ఎవరు నియమించారు? ఆ ఈజిప్టువాన్ని చంపినట్లు నన్ను కూడా చంపాలని అనుకుంటున్నావా?’ అన్నాడు. మోషే ఆ మాట విని మిద్యాను దేశానికి పారిపోయి, అక్కడ ఒక పరదేశిగా జీవించి ఇద్దరు కుమారులను కన్నాడు. “నలభై సంవత్సరాలు గడిచిన తర్వాత, ఒక రోజు సీనాయి పర్వతం దగ్గర అరణ్యంలో ఒక మండుతున్న పొదలో నుండి వస్తున్న అగ్నిజ్వాలల్లో ఒక దేవదూత మోషేకు ప్రత్యక్షమయ్యాడు.

అపొస్తలుల కార్యములు 7:23-30 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అతనికి సుమారు నలభై ఏళ్ళ వయసప్పుడు ఇశ్రాయేలీయులైన తన స్వంత ప్రజలను చూడాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడు వారిలో ఒకడు అన్యాయానికి గురి కావడం చూసి, అతనిని కాపాడి అతడి పక్షాన ఆ ఐగుప్తు వాణ్ణి చంపి ప్రతీకారం చేశాడు. తన ద్వారా తన ప్రజను దేవుడు విడుదల చేస్తున్నాడనే సంగతి తన ప్రజలు గ్రహిస్తారని అతడనుకున్నాడు గాని వారు గ్రహించలేదు. “ఆ తరువాత రోజు ఇద్దరు పోట్లాడుకుంటుంటే అతడు వారిని చూసి, ‘అయ్యలారా, మీరు సోదరులు. మీరెందుకు ఒకరికొకరు అన్యాయం చేసుకుంటున్నారు’ అని వారికి సర్ది చెప్పాలని చూశాడు. అయితే తన పొరుగువాడికి అన్యాయం చేసినవాడు, ‘మామీద అధికారిగా, న్యాయనిర్ణేతగా నిన్నెవరు నియమించారు? నిన్న ఐగుప్తు వాణ్ణి చంపినట్టు నన్నూ చంపాలనుకుంటున్నావా?’ అని చెప్పి అతణ్ణి నెట్టేశాడు. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో విదేశీయుడుగా ఉంటూ, అక్కడే ఇద్దరు కొడుకులను కన్నాడు. నలభై ఏళ్ళయిన తరువాత సీనాయి పర్వతారణ్యంలో, ఒక పొదలోని మంటల్లో దేవదూత అతనికి కనిపించాడు.

అపొస్తలుల కార్యములు 7:23-30 TERV (పవిత్ర బైబిల్)

“మోషేకు నలభై సంవత్సరాలు రాగానే అతడు తన తోటి ఇశ్రాయేలు ప్రజల్ని కలుసుకొన్నాడు. ఒకసారి, మోషే ఈజిప్టు దేశస్థుడు ఇశ్రాయేలు వానితో అన్యాయంగా ప్రవర్తించటం చూసి ఇశ్రాయేలువానికి సహాయం చెయ్యాలనే ఉద్దేశ్యంతో, అతణ్ణి రక్షించటానికి వెళ్ళాడు. ఈజిప్టు దేశస్థుణ్ణి చంపి ఇశ్రాయేలు వాని పక్షాన పగ తీర్చుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించటానికి దేవుడు తనను ఉపయోగిస్తున్న విషయం వాళ్ళు తెలుసుకొంటారని మోషే ఆశించాడు. కాని వాళ్ళకది అర్థం కాలేదు. “మరుసటి రోజు మోషే యిద్దరు ఇశ్రాయేలీయులు పోట్లాడటం చూసి, వాళ్ళను శాంత పరచాలనే ఉద్దేశ్యంతో, ‘అయ్యా! మీరు సోదరులు! పరస్పరం ఎందుకు పోట్లాడుతున్నారు?’ అని అడిగాడు. ఏ ఇశ్రాయేలు వాడు తోటివాడికి అన్యాయం చేశాడో వాడు, మోషేను ప్రక్కకు త్రోసి, ‘మా మీద తీర్పు చెప్పటానికి, మమ్మల్ని పాలించటానికి నిన్నెవరు నియమించారు? ఈజిప్టు దేశస్థుణ్ణి నిన్న చంపినట్లు నన్ను కూడా చంపాలని చూస్తున్నావా?’ అని అన్నాడు. ఈ విమర్శ విని మోషే ఈజిప్టు దేశాన్ని వదిలి, మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ పరదేశీయునిగా స్థిరపడ్డాడు. అక్కడ అతనికి యిద్దరు కుమారులు కలిగారు. “నలభై సంవత్సరాలు గడిచాయి. ఒక రోజు సీనాయి పర్వతంపై మండుతున్న పొదలో మోషేకు ఒక దేవదూత కనిపించాడు.

అపొస్తలుల కార్యములు 7:23-30 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అతనికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయము ననుభవించుట అతడు చూచి, వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతికారముచేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలం చెను గాని వారు గ్రహింపరైరి. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి–అయ్యలారా, మీరు సహోదరులు; మీరెందుకు ఒకనికొకడు అన్యా యము చేసికొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచ జూచెను. అయినను తన పొరుగువానికి అన్యాయము చేసినవాడు–మా మీద అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడు? నీవు నిన్న ఐగుప్తీయుని చంపినట్టు నన్నును చంపదలచియున్నావా అని అతనిని త్రోసివేసెను. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశియైయుండి, అక్కడ ఇద్దరు కుమారులను కనెను. నలువది ఏండ్లయిన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికగపడెను.