1 సమూ 14:24-52
1 సమూ 14:24-52 IRVTEL
“నేను నా శత్రువులపై పగ సాధించే వరకూ, సాయంత్రమయ్యే దాకా భోజనం చేసేవాడు శాపానికి గురి అవుతారు” అని సౌలు ప్రజల చేత ఒట్టు పెట్టించాడు. అందుకని ప్రజలు ఏమీ తినకుండా ఉన్నారు. సైన్యం మొత్తం అడవిలోకి వచ్చినప్పుడు ఒకచోట నేలమీద తేనె కనబడింది. వారు ఆ అడవిలోకి వెళ్తున్నప్పుడు తేనె ధారగా కారుతూ ఉంది. తాము చేసిన ప్రమాణానికి లోబడి ఎవ్వరూ ఆ తేనె ముట్టుకోలేదు. అయితే యోనాతానుకు తన తండ్రి ప్రజలచేత చేయించిన ప్రమాణం గురించి తెలియదు. అతడు తన చేతికర్ర చాచి దాని అంచును తేనెపట్టులో ముంచి దాన్ని నోటిలో పెట్టుకోగానే అతని కళ్ళకు వెలుగు వచ్చింది. అక్కడి వారిలో ఒకడు “నీ తండ్రి ప్రజలచేత ఒట్టు పెట్టించి ‘ఈ రోజున ఆహారం తీసుకొనేవాడు కచ్చితంగా శాపానికి గురవుతాడు’ అని ఆజ్ఞాపించాడు. అందుకే ప్రజలు బాగా అలసిపోయారు” అని చెప్పాడు. అందుకు యోనాతాను “నా తండ్రి మనుషులను కష్టపెట్టిన వాడయ్యాడు. నేను ఈ తేనె కొంచెం తినగానే నా కళ్ళు ఎంతగా వెలిగిపోయాయో చూడు. మన మనుషులు శత్రువుల దగ్గర దోచుకున్నది బాగా తిని ఉంటే వారు ఇంకా ఎక్కువగా సంహరించేవాళ్ళు గదా” అన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు వారు ఫిలిష్తీయులను మిక్మషు నుండి అయ్యాలోను వరకూ తరిమి హతం చేసినందువల్ల బాగా అలసిపోయారు. వారు దోపిడీ సొమ్ము మీద ఎగబడి, గొర్రెలను, ఎద్డులను, దూడలను నేలమీద పడవేసి వాటిని వధించి రక్తంతోనే తిన్నారు. “ప్రజలు రక్తంతోనే తిని యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు” అని కొందరు సౌలుకు చెప్పినప్పుడు అతడు “మీరు దేవునికి విశ్వాస ఘాతకులయ్యారు. ఒక పెద్ద రాయి నా దగ్గరకి దొర్లించి తీసుకురండి” అని చెప్పి, “అందరూ తమ తమ ఎద్దులను, గొర్రెలను నా దగ్గరికి తీసుకు వచ్చి ఇక్కడే వధించి వాటిని తినాలి. రక్తంతో కలసిన మాసం తిని యెహోవా దృష్టిలో పాపం చేయవద్దు” అని వారితో చెప్పడానికి అతడు కొంతమందిని పంపించాడు. ప్రజలంతా ఆ రాత్రి తమ తమ ఎద్దులను తెచ్చి అక్కడ వధించారు. అక్కడ సౌలు యెహోవాకు ఒక బలిపీఠం కట్టించాడు. అతడు యెహోవాకు కట్టించిన మొదటి బలిపీఠం అదే. సౌలు “మనం ఈ రాత్రి ఫిలిష్తీయులను తరుముతూ తెల్లవారేదాకా దోచుకుని వాళ్ళలో ఒక్కడు కూడా లేకుండా చేద్దాం రండి” అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారంతా “నీకు ఏది మంచిదని అనిపిస్తే దాన్ని చెయ్యి” అని అన్నారు. అప్పుడు సౌలు “యాజకుడు ఇక్కడే ఉన్నాడు, అతని ద్వారా దేవుని దగ్గర విచారణ చేద్దాం రండి” అని చెప్పాడు. సౌలు “నేను ఫిలిష్తీయులను వెంబడిస్తే వారిని నీవు ఇశ్రాయేలీయుల చేతికి అప్పగిస్తావా” అని దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు ఆ రోజున ఆయన అతనికి ఎలాంటి జవాబు ఇయ్యలేదు. అందుకు సౌలు “ప్రజల పెద్దలు నా దగ్గరకి వచ్చి ఈ రోజు ఎవరి ద్వారా తప్పిదం జరిగిందో దాన్ని కనుక్కోవాలి. అది నా కొడుకు యోనాతాను వల్ల జరిగినా సరే, వాడు తప్పకుండా చనిపోతాడని ఇశ్రాయేలీయులను కాపాడే యెహోవా తోడని నేను ఒట్టు పెడుతున్నాను” అని చెప్పాడు. అయితే అక్కడ ఉన్నవారిలో ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. “మీరంతా ఒక పక్కన ఉండండి, నేనూ, నా కొడుకు యోనాతానూ మరో పక్కన నిలబడతాం” అని సౌలు చెప్పినప్పుడు, వారంతా “నీ మనసుకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి” అన్నారు. అప్పుడు సౌలు “ఇశ్రాయేలీయుల దేవుడవైన యెహోవా, తప్పు చేసినది ఎవరో చూపించు” అని ప్రార్థించినపుడు సౌలు, యోనాతానుల పేరున చీటీ పడింది. ప్రజలు తప్పించుకున్నారు. “నాకూ నా కొడుకు యోనాతానుకూ మధ్య చీటీ వేయండి” అని సౌలు ఆజ్ఞ ఇచ్చినప్పుడు చీటీ యోనాతాను పేరున పడింది. “నువ్వు చేసిన పని ఏమిటో నాకు తెలియజేయి” అని యోనాతానును అడిగినప్పుడు, యోనాతాను “నా చేతికర్ర అంచుతో కొంచెం తేనె తీసుకుని తిన్న విషయం నిజమే, కొంచెం తేనె కోసం నేను చనిపోవలసి వచ్చింది” అని సౌలుతో అన్నాడు. అప్పుడు సౌలు “యోనాతానూ, నీవు తప్పకుండా చనిపోవాలి. అందుకు నేను ఒప్పుకోకపోతే దేవుడు నాకు గొప్ప కీడు కలిగిస్తాడు” అన్నాడు. అయితే ప్రజలు సౌలుతో “మనకు ఇంత గొప్ప విజయం కలిగేలా చేసిన యోనాతాను చనిపోవాలా? అది ఎన్నటికీ జరగకూడదు. దేవుని సహాయంతోనే ఈ రోజు యోనాతాను మనకు జయం లభించేలా చేశాడు. యెహోవా దేవునిపై ఒట్టు. అతని తలవెండ్రుకల్లో ఒక్కటైనా కింద పడకూడదు” అని చెప్పి యోనాతాను మరణించకుండా అతణ్ణి కాపాడారు. తరువాత సౌలు ఫిలిష్తీయులను తరమడం మానివేసి తిరిగి వెళ్లిపోయాడు, ఫిలిష్తీయులు తమ స్వదేశానికి వెళ్ళిపోయారు. ఈ విధంగా సౌలు ఇశ్రాయేలీయులను పాలించడానికి అధికారం పొంది, నలు దిక్కులా ఉన్న శత్రువులైన మోయాబీయులతో, అమ్మోనీయులతో, ఎదోమీయులతో, సోబా దేశపు రాజులతో, ఫిలిష్తీయులతో యుద్ధాలు జరిగించాడు. అతడు ఎవరి మీదకు దండెత్తినా వారందరి పైనా గెలుపు సాధించాడు. అతడు తన సైన్యంతో అమాలేకీయులను హతమార్చి వారు దోచుకుపోయిన ఇశ్రాయేలీయులను వారి చేతిలో నుండి విడిపించాడు. సౌలు కుమారుల పేర్లు యోనాతాను, ఇష్వీ, మెల్కీషూవ. అతని ఇద్దరు కుమార్తెల్లో పెద్దమ్మాయి పేరు మేరబు, రెండవది మీకాలు. సౌలు భార్య అహీనోయము. ఈమె అహిమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి అబ్నేరు, ఇతడు సౌలు చిన్నాన్న నేరు కొడుకు. సౌలు తండ్రి కీషు, అబ్నేరు తండ్రి నేరు, ఇద్దరూ అబీయేలు కుమారులు. సౌలు జీవించిన కాలమంతా ఫిలిష్తీయులతో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. సౌలు తనకు తారసపడ్డ బలాఢ్యులను, వీరులను చేరదీసి తన సైన్యంలో చేర్చుకున్నాడు.

