1 సమూయేలు 14:24-52 - Compare All Versions

1 సమూయేలు 14:24-52 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“సాయంత్రం అయ్యేవరకు, నేను నా శత్రువుల మీద పగతీర్చుకునే వరకు ఎవరైనా భోజనం చేస్తే వారు శపించబడతారు” అని సౌలు ప్రజలచేత ప్రమాణం చేయించాడు. కాబట్టి ఆ రోజు ఇశ్రాయేలీయులందరు ఏమీ తినలేదు. సైన్యమంతా అడవిలోకి వచ్చినప్పుడు అక్కడ నేల మీద తేనె కనపడింది. వారు ఆ అడవిలోకి వెళ్లగా తేనె ధారలుగా కారుతూ ఉంది కాని ప్రజలు తాము చేసిన ప్రమాణానికి భయపడి ఒకరు కూడా చేయి నోటిలో పెట్టుకోలేదు. అయితే యోనాతాను తన తండ్రి ప్రజలతో చేయించిన ప్రమాణాన్ని వినలేదు కాబట్టి తన చేతిలో ఉన్న కర్రను చాపి దాని అంచును తేనెతెట్టెలో ముంచి తన చేయి నోటిలో పెట్టుకున్నప్పుడు అతని కళ్లు ప్రకాశించాయి. అప్పుడు ఒక సైనికుడు అతనితో, “ ‘ఈ రోజు భోజనం చేసినవారు శపించబడతారు’ అని మీ తండ్రి సైన్యంతో ఖచ్చితమైన ప్రమాణాన్ని చేయించాడు; అందుకే ప్రజలంతా అలసిపోయి ఉన్నారు” అని చెప్పాడు. అందుకు యోనాతాను, “దేశం కష్టపడడానికి నా తండ్రి కారణమయ్యాడు. నేను ఈ తేనె కొంచెం తినగానే నా కళ్లు ఎంత ప్రకాశిస్తున్నాయో చూడు. ప్రజలు తమ శత్రువుల నుండి దోచుకున్న దానిలో నుండి కొంచెం తిని ఉంటే ఎంత బాగుండేది. అప్పుడు మనం ఇంకా ఎక్కువ మంది ఫిలిష్తీయులను జయించేవారం కదా!” అన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను మిక్మషు నుండి అయ్యాలోను వరకు చంపి చాలా అలసిపోయారు. ప్రజలు దోపుడుసొమ్ము మీద ఎగబడి గొర్రెలను, ఎడ్లను దూడలను తీసుకుని నేల మీద పడవేసి వధించి రక్తంతో కలిపి తిన్నారు. అప్పుడు ఒకడు సౌలుతో, “ప్రజలు రక్తంతో ఉన్న మాంసాన్ని తిని యెహోవా దృష్టిలో పాపం చేస్తున్నారు” అని చెప్పాడు. సౌలు, “మీరు విశ్వాసఘాతకులయ్యారు; ఒక పెద్ద రాయిని నా దగ్గరకు దొర్లించి తీసుకురండి.” తర్వాత అతడు, “మీరు ప్రజల మధ్యకు వెళ్లి, ‘మీలో ప్రతి ఒక్కరు తమ ఎద్దులను గొర్రెలను నా దగ్గరకు తీసుకువచ్చి ఇక్కడే వధించి వాటిని తినాలి. రక్తంతో ఉన్న మాంసం తిని యెహోవా దృష్టిలో పాపం చేయకూడదని వారితో చెప్పండి’ ” అని చెప్పి కొందరిని పంపించాడు. కాబట్టి ప్రజలందరు ఆ రాత్రి తమ ఎద్దులను తీసుకుని వచ్చి అక్కడ వధించారు. అప్పుడు సౌలు యెహోవాకు ఒక బలిపీఠాన్ని కట్టించాడు. అతడు యెహోవాకు కట్టించిన మొదటి బలిపీఠం అదే. ఆ తర్వాత సౌలు, “మనం ఈ రాత్రి ఫిలిష్తీయులను వెంటాడుతూ వెళ్లి తెల్లవారే వరకు వారిని దోచుకొని, వారిలో ఎవరూ ప్రాణాలతో మిగులకుండా చేద్దాం రండి” అన్నాడు. అందుకు వారు, “నీకు ఏది మంచిదనిపిస్తే అది చేయి” అన్నారు. కాని యాజకుడు, “దేవుని దగ్గర విచారణ చేద్దాం” అన్నాడు. సౌలు, “నేను ఫిలిష్తీయుల వెనుక వెంటాడుతూ వెళ్లితే నీవు వారిని ఇశ్రాయేలీయు చేతికి అప్పగిస్తావా?” అని దేవుని అడిగాడు కాని దేవుడు అతనికి ఆ రోజు సమాధానం ఇవ్వలేదు. కాబట్టి సౌలు, “సైన్యాధిపతులు నా దగ్గరకు రండి, ఈ రోజు ఏ పాపం జరిగిందో మనం తెలుసుకుందాము. నా కుమారుడైన యోనాతాను వలన అది జరిగినా సరే వాడు తప్పక మరణించాలని ఇశ్రాయేలీయుల ప్రాణాలను రక్షించు సజీవుడైన యెహోవా పేరిట నేను ప్రమాణం చేస్తున్నాను” అన్నాడు. కాని ప్రజల్లో ఎవరు ఒక్క మాటకూడా మాట్లాడలేదు. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరితో, “మీరందరు ఆ ప్రక్కన నిలబడండి; నేను నా కుమారుడైన యోనాతాను ఈ ప్రక్కన నిలబడతాం” అన్నాడు. అందుకు వారు, “నీకు ఏది మంచిదనిపిస్తే అది చేయి” అన్నారు. అప్పుడు సౌలు, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, ఈ రోజు మీ దాసునికి నీవెందుకు సమాధానం చెప్పలేదు? ఒకవేళ నాలోగాని నా కుమారుడైన యోనాతానులో గాని లోపం ఉంటే ఊరీముతో, ఇశ్రాయేలు ప్రజల్లో దోషం ఉంటే తుమ్మీముతో జవాబు చెప్పండి” అని ప్రార్థించాడు. అప్పుడు సౌలు పేరిట యోనాతాను పేరిట చీటి వచ్చింది, ఇశ్రాయేలు ప్రజలు నిర్దోషులుగా తప్పించుకున్నారు. “నాకు నా కుమారుడైన యోనాతానుకు చీట్లు వేయండి” అని సౌలు ఆజ్ఞ ఇవ్వగా యోనాతాను పేరిట చీటి వచ్చింది. అప్పుడు సౌలు, “నీవు ఏమి చేశావో నాకు చెప్పు” అని యోనాతానుతో అన్నాడు. అందుకు యోనాతాను, “నా చేతికర్ర అంచుతో కొంచెం తేనె రుచి చూశాను. కాబట్టి నేను ఖచ్చితంగా చనిపోవలసిందే” అన్నాడు. అందుకు సౌలు, “యోనాతానూ, నీవు ఖచ్చితంగా చనిపోవాలి లేకపోతే దేవుడు నన్ను తీవ్రంగా శిక్షిస్తారు” అన్నాడు. అయితే ప్రజలు సౌలుతో, “ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప విడుదల ఇచ్చిన యోనాతాను చనిపోవాలా? అలా ఎన్నటికి జరుగకూడదు. దేవుని సహాయంతోనే అతడు ఈ రోజు మనకు విజయాన్ని అందించాడు. సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, అతని తలవెంట్రుకలలో ఒకటి కూడా నేల రాలదు” అని చెప్పి యోనాతాను మరణించకుండా ప్రజలు అతన్ని రక్షించారు. అప్పుడు సౌలు ఫిలిష్తీయులను తరమడం మానివేయగా వారు తమ స్వదేశానికి వెళ్లిపోయారు. సౌలు ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి అధికారం పొందిన తర్వాత, అన్నివైపులా ఉన్న వారి శత్రువులతో అనగా, మోయాబీయులతో అమ్మోనీయులతో ఎదోమీయులతో సోబాదేశపు రాజులతో ఫిలిష్తీయులతో అతడు యుద్ధం చేశాడు. ఎవరి మీదికి అతడు యుద్ధానికి వెళ్లాడో వారినందరిని ఓడించాడు. అతడు ధైర్యంగా పోరాడి అమాలేకీయులను హతం చేసి ఇశ్రాయేలీయులను దోచుకున్నవారి చేతిలో నుండి వారిని విడిపించాడు. సౌలు కుమారుల పేర్లు యోనాతాను, ఇష్వీ, మల్కీ-షూవ. అతని పెద్దకుమార్తె పేరు మేరబు చిన్నదాని పేరు మీకాలు. సౌలు భార్యపేరు అహీనోయము. ఈమె అహిమయస్సు కుమార్తె. సౌలు సేనాధిపతి పేరు అబ్నేరు. అతడు నేరు కుమారుడు. నేరు సౌలు చిన్నాన్న. సౌలు తండ్రి కీషు, అబ్నేరు తండ్రి నేరు ఇద్దరూ అబీయేలు కుమారులు. సౌలు జీవించినంత కాలం ఫిలిష్తీయులతో తీవ్రమైన యుద్ధం జరుగుతూనే ఉంది. సౌలు తాను చూసిన బలవంతులను ధైర్యవంతులను తీసుకువచ్చి తనకు సేవ చేయడానికి పెట్టుకునేవాడు.

షేర్ చేయి
1 సమూయేలు 14 TSA

1 సమూయేలు 14:24-52 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

“నేను నా శత్రువులపై పగ సాధించే వరకూ, సాయంత్రమయ్యే దాకా భోజనం చేసేవాడు శాపానికి గురి అవుతారు” అని సౌలు ప్రజల చేత ఒట్టు పెట్టించాడు. అందుకని ప్రజలు ఏమీ తినకుండా ఉన్నారు. సైన్యం మొత్తం అడవిలోకి వచ్చినప్పుడు ఒకచోట నేలమీద తేనె కనబడింది. వారు ఆ అడవిలోకి వెళ్తున్నప్పుడు తేనె ధారగా కారుతూ ఉంది. తాము చేసిన ప్రమాణానికి లోబడి ఎవ్వరూ ఆ తేనె ముట్టుకోలేదు. అయితే యోనాతానుకు తన తండ్రి ప్రజలచేత చేయించిన ప్రమాణం గురించి తెలియదు. అతడు తన చేతికర్ర చాచి దాని అంచును తేనెపట్టులో ముంచి దాన్ని నోటిలో పెట్టుకోగానే అతని కళ్ళకు వెలుగు వచ్చింది. అక్కడి వారిలో ఒకడు “నీ తండ్రి ప్రజలచేత ఒట్టు పెట్టించి ‘ఈ రోజున ఆహారం తీసుకొనేవాడు కచ్చితంగా శాపానికి గురవుతాడు’ అని ఆజ్ఞాపించాడు. అందుకే ప్రజలు బాగా అలసిపోయారు” అని చెప్పాడు. అందుకు యోనాతాను “నా తండ్రి మనుషులను కష్టపెట్టిన వాడయ్యాడు. నేను ఈ తేనె కొంచెం తినగానే నా కళ్ళు ఎంతగా వెలిగిపోయాయో చూడు. మన మనుషులు శత్రువుల దగ్గర దోచుకున్నది బాగా తిని ఉంటే వారు ఇంకా ఎక్కువగా సంహరించేవాళ్ళు గదా” అన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు వారు ఫిలిష్తీయులను మిక్మషు నుండి అయ్యాలోను వరకూ తరిమి హతం చేసినందువల్ల బాగా అలసిపోయారు. వారు దోపిడీ సొమ్ము మీద ఎగబడి, గొర్రెలను, ఎద్డులను, దూడలను నేలమీద పడవేసి వాటిని వధించి రక్తంతోనే తిన్నారు. “ప్రజలు రక్తంతోనే తిని యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు” అని కొందరు సౌలుకు చెప్పినప్పుడు అతడు “మీరు దేవునికి విశ్వాస ఘాతకులయ్యారు. ఒక పెద్ద రాయి నా దగ్గరకి దొర్లించి తీసుకురండి” అని చెప్పి, “అందరూ తమ తమ ఎద్దులను, గొర్రెలను నా దగ్గరికి తీసుకు వచ్చి ఇక్కడే వధించి వాటిని తినాలి. రక్తంతో కలసిన మాసం తిని యెహోవా దృష్టిలో పాపం చేయవద్దు” అని వారితో చెప్పడానికి అతడు కొంతమందిని పంపించాడు. ప్రజలంతా ఆ రాత్రి తమ తమ ఎద్దులను తెచ్చి అక్కడ వధించారు. అక్కడ సౌలు యెహోవాకు ఒక బలిపీఠం కట్టించాడు. అతడు యెహోవాకు కట్టించిన మొదటి బలిపీఠం అదే. సౌలు “మనం ఈ రాత్రి ఫిలిష్తీయులను తరుముతూ తెల్లవారేదాకా దోచుకుని వాళ్ళలో ఒక్కడు కూడా లేకుండా చేద్దాం రండి” అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారంతా “నీకు ఏది మంచిదని అనిపిస్తే దాన్ని చెయ్యి” అని అన్నారు. అప్పుడు సౌలు “యాజకుడు ఇక్కడే ఉన్నాడు, అతని ద్వారా దేవుని దగ్గర విచారణ చేద్దాం రండి” అని చెప్పాడు. సౌలు “నేను ఫిలిష్తీయులను వెంబడిస్తే వారిని నీవు ఇశ్రాయేలీయుల చేతికి అప్పగిస్తావా” అని దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు ఆ రోజున ఆయన అతనికి ఎలాంటి జవాబు ఇయ్యలేదు. అందుకు సౌలు “ప్రజల పెద్దలు నా దగ్గరకి వచ్చి ఈ రోజు ఎవరి ద్వారా తప్పిదం జరిగిందో దాన్ని కనుక్కోవాలి. అది నా కొడుకు యోనాతాను వల్ల జరిగినా సరే, వాడు తప్పకుండా చనిపోతాడని ఇశ్రాయేలీయులను కాపాడే యెహోవా తోడని నేను ఒట్టు పెడుతున్నాను” అని చెప్పాడు. అయితే అక్కడ ఉన్నవారిలో ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. “మీరంతా ఒక పక్కన ఉండండి, నేనూ, నా కొడుకు యోనాతానూ మరో పక్కన నిలబడతాం” అని సౌలు చెప్పినప్పుడు, వారంతా “నీ మనసుకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి” అన్నారు. అప్పుడు సౌలు “ఇశ్రాయేలీయుల దేవుడవైన యెహోవా, తప్పు చేసినది ఎవరో చూపించు” అని ప్రార్థించినపుడు సౌలు, యోనాతానుల పేరున చీటీ పడింది. ప్రజలు తప్పించుకున్నారు. “నాకూ నా కొడుకు యోనాతానుకూ మధ్య చీటీ వేయండి” అని సౌలు ఆజ్ఞ ఇచ్చినప్పుడు చీటీ యోనాతాను పేరున పడింది. “నువ్వు చేసిన పని ఏమిటో నాకు తెలియజేయి” అని యోనాతానును అడిగినప్పుడు, యోనాతాను “నా చేతికర్ర అంచుతో కొంచెం తేనె తీసుకుని తిన్న విషయం నిజమే, కొంచెం తేనె కోసం నేను చనిపోవలసి వచ్చింది” అని సౌలుతో అన్నాడు. అప్పుడు సౌలు “యోనాతానూ, నీవు తప్పకుండా చనిపోవాలి. అందుకు నేను ఒప్పుకోకపోతే దేవుడు నాకు గొప్ప కీడు కలిగిస్తాడు” అన్నాడు. అయితే ప్రజలు సౌలుతో “మనకు ఇంత గొప్ప విజయం కలిగేలా చేసిన యోనాతాను చనిపోవాలా? అది ఎన్నటికీ జరగకూడదు. దేవుని సహాయంతోనే ఈ రోజు యోనాతాను మనకు జయం లభించేలా చేశాడు. యెహోవా దేవునిపై ఒట్టు. అతని తలవెండ్రుకల్లో ఒక్కటైనా కింద పడకూడదు” అని చెప్పి యోనాతాను మరణించకుండా అతణ్ణి కాపాడారు. తరువాత సౌలు ఫిలిష్తీయులను తరమడం మానివేసి తిరిగి వెళ్లిపోయాడు, ఫిలిష్తీయులు తమ స్వదేశానికి వెళ్ళిపోయారు. ఈ విధంగా సౌలు ఇశ్రాయేలీయులను పాలించడానికి అధికారం పొంది, నలు దిక్కులా ఉన్న శత్రువులైన మోయాబీయులతో, అమ్మోనీయులతో, ఎదోమీయులతో, సోబా దేశపు రాజులతో, ఫిలిష్తీయులతో యుద్ధాలు జరిగించాడు. అతడు ఎవరి మీదకు దండెత్తినా వారందరి పైనా గెలుపు సాధించాడు. అతడు తన సైన్యంతో అమాలేకీయులను హతమార్చి వారు దోచుకుపోయిన ఇశ్రాయేలీయులను వారి చేతిలో నుండి విడిపించాడు. సౌలు కుమారుల పేర్లు యోనాతాను, ఇష్వీ, మెల్కీషూవ. అతని ఇద్దరు కుమార్తెల్లో పెద్దమ్మాయి పేరు మేరబు, రెండవది మీకాలు. సౌలు భార్య అహీనోయము. ఈమె అహిమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి అబ్నేరు, ఇతడు సౌలు చిన్నాన్న నేరు కొడుకు. సౌలు తండ్రి కీషు, అబ్నేరు తండ్రి నేరు, ఇద్దరూ అబీయేలు కుమారులు. సౌలు జీవించిన కాలమంతా ఫిలిష్తీయులతో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. సౌలు తనకు తారసపడ్డ బలాఢ్యులను, వీరులను చేరదీసి తన సైన్యంలో చేర్చుకున్నాడు.

షేర్ చేయి
1 సమూయేలు 14 IRVTEL

1 సమూయేలు 14:24-52 TERV (పవిత్ర బైబిల్)

ఆరోజు సౌలు ఒక పెద్ద తప్పు చేశాడు. ఇశ్రాయేలు సైనికులు ఆకలితో నకనకలాడి పోయారు. దీనికంతటికీ కారణం వారిని సౌలు ఒక ప్రమాణం క్రింద వుంచటమే! “సాయంత్రమయ్యేలోగా గాని, లేక నా శత్రువులను నేను ఓడించక ముందుగాని ఎవ్వరైనా భోజనం చేస్తే వారు శపించబడతారు!” అని వారికి సౌలు ముందుగానే చెప్పాడు. దానితో ఇశ్రాయేలు సైనికులు ఎవ్వరూ ఆహారం ముట్టలేదు. ఆ ప్రాంతంలో ఒక తేనెతుట్ట వుంది. సైనికులు దానివద్దకు వచ్చేసరికి వాళ్ల ప్రమాణం జ్ఞాపకం రావటంతో తేనె ముట్టటానికి భయపడిపోయారు. అయితే సౌలు చేయించిన ఈ ప్రమాణం గురించి యోనాతానుకు తెలియదు. అతను తన చేతికర్రను తేనెతుట్టలోనికి గుచ్చి లాగగానే తేనెవచ్చింది. అతడు దానిని తాగగా అతనికి ఎంతో హాయినిచ్చింది. సైనికులలో ఒకడు యోనాతానుకు “నీ తండ్రి సైనికులతో ప్రమాణము చేయించి, ఆహారము పుచ్చుకొనువాడు శపించబడును అని చెప్పాడు. అందువల్లనే ఏ ఒక్క సైనికుడు కూడా ఆ రోజు ఏమీ తినలేదని అన్నాడు. అందువల్లనే సైనికులంతా విపరీతంగా అలసిపోయారని” చెప్పాడు. “మా తండ్రి దేశానికి లేనిపోని తిప్పలు తెచ్చిపెట్టాడు. చూడండి! ఈ తేనెను నేను కొంచెం రుచిచూస్తేనే నాకు చాలా హాయిగా వుంది! ఈ రోజు శత్రువుల వద్ద తీసుకున్న ఆహారమంతా మన సైనికులు గనుక తినివుంటే, వారు ఎంత హాయిగా ఉండేవారు! ఇంకా చాలా మంది ఫిలిష్తీయులను కూడ చంపి ఉండే వాళ్లు!” అన్నాడు యోనాతాను. ఆ రోజు మిక్మషునుండి అయ్యాలోను వరకూగల ఫిలిష్తీయులనందరినీ ఇశ్రాయేలు సైనికులు ఓడించారు. ఆ తరువాత వారు బాగా నీరసించి పోయారు. వారు ఫిలిష్తీయుల గొర్రెలను, పశువులను, దూడలను పట్టుకొన్నారు. ఆకలికి తట్టుకోలేక వారు ఆ పశువులను నేలమీదే చంపి రక్తంతో నిండిన మాంసాన్నే తినివేశారు. ఒక వ్యక్తి వెళ్లి సౌలుతో, “చూశావా! సైనికులంతా యెహోవా పట్ల పాపం చేస్తున్నారు. రక్తం కలసివున్న మాంసాన్నే వారు తింటున్నారు” అని చెప్పాడు. అది విని సౌలు, “మీరు పాపం చేశారు! ఒక పెద్ద బండను ఇక్కడికి దొర్లించండి” అన్నాడు. “నీవు వెళ్లి ప్రతి ఒక్కడ్నీ తన ఎద్దును, గొర్రెను ఇక్కడికి తీసుకుని రమ్మను. వారు వచ్చి తమ పశువులను ఇక్కడ బండ మీద వధించాలి. దేవుని పట్లపాపం చేయవద్దు. రక్తం కలిసివున్న మాంసాన్ని తినకండి” అన్నాడు సౌలు. ఆ రాత్రి ప్రతి ఒక్కడూ తన పశువులను తెచ్చి అక్కడ వధించాడు. తరువాత సౌలు యెహోవాకు ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. అది సౌలు తానే యెహోవాకి నిర్మించిన మొదటి బలిపీఠం. “పదండి! ఈ రాత్రి ఫిలిష్తీయులను తరుముదాము. వాళ్లనందరినీ చంపివేసి వాళ్ల వస్తువులన్నీ తీసుకుందాము!” అన్నాడు సౌలు. “నీకు ఎలా మంచిదనిపిస్తే అలా చేయి” అని సైనికులు జవాబిచ్చారు. కానీ “మనము దేవుని అడుగు దాము” అని యాజకుడు చెప్పాడు. అందువల్ల సౌలు లేచి, “దేవా! నేను వెళ్లి ఫిలిష్తీయులను తరిమికొట్టనా? మేము వాళ్లను ఓడించేలా సహాయం చేస్తావా?” అని అడిగాడు. కాని ఆ రోజు సౌలుకు యెహోవా సమాధానం ఇవ్వలేదు. “నాయకులందరినీ నా దగ్గరకు తీసుకుని రండి. ఈ వేళ ఎవరు పాపం చేసారో మనము తెలుసు కొందాము. ఇశ్రాయేలును రక్షించే యెహోవా తోడుగా నేను ఈ ప్రమాణం చేస్తున్నాను. ఈ పాపం నా స్వంత కుమారుడు యోనాతాను చేసినా, అతడు చావాల్సిందే” అని చెప్పాడు సౌలు. సైన్యంలో ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. సౌలు ఇశ్రాయేలీయులందరినీ పిలిచి వారందరినీ ఒక పక్కన నిలబెట్టి, తన కుమారునితో కలిసి తానొక పక్కన నిలబడ్డాడు. “మీకు ఎలా మంచిదనిపిస్తే అలా చేయండి” అని సైనికులంతా చెప్పారు. “ఓ ఇశ్రాయేలీయుల దేవుడవై యెహోవా, నీ సేవకుడనైన నా ప్రార్థన ఈ రోజున ఎందుకు ఆలకించలేదు! నేను గాని, నా కుమారుడు యోనాతాను గాని పాపం చేస్తే మాకు ఊరీము పడేలా చేయుము. నీ ప్రజలయిన ఇశ్రాయేలీయులు పాపం చేస్తే, వారికి తుమ్మీము పడేలా చేయము” అని సౌలు ప్రార్థన చేశాడు. సౌలు యోనాతాను పాపం చేసినట్టు ఊరీము పడింది. అందుచేత ప్రజలు నిర్దోషులని తేలటంతో వారు వెళ్లిపోయారు. సౌలు, యోనాతానుల మధ్య మళ్లీ వేస్తే యోనాతాను దోషి అని తేలింది. “ఏమి చేసావో చెప్పు” అని సౌలు యోనాతానును అడిగాడు. “నేను కేవలం నా చేతికర్ర చివరన అంటిన తేనెనురుచి చూసాను. దానికే నేను మరణశిక్ష అనుభవించాలా?” అన్నాడు యోనాతాను. సౌలు “దేవునికి నేను తీవ్రమైన ప్రమాణం చేసాను. నా ప్రమాణాన్ని గనుక నేను నిలబెట్టుకోక పోతే నాకు ఎన్నో దారుణాలు చేయుమని నేను దేవుని అడిగాను. కనుక యోనాతానూ, నీవు మరణించాల్సిందే” అన్నాడు. అయితే సైనికులు, “ఈవేళ ఇశ్రాయేలీయులను మహా విజయానికి నడిపించిన వాడు యోనాతానే. అలాంటప్పుడు యోనాతాను మరణించాలా? వీల్లేదు. సజీవ దేవుని తోడు, యోనాతాను తలమీదనుండి ఒక్క వెంట్రుక నేలరాలదుగాక! ఈ వేళ ఫిలిష్తీయులతో యుద్ధం చేయటానికి దేవుడే యోనాతానుకు సహాయం చేసాడు!” అని సౌలుతో చెప్పారు. అందుచేత సైనికులు యోనాతానును కాపాడారు. అతడు చంపబడలేదు. కనుక ఫిలిష్తీయులను తరమటం సౌలుమానుకున్నాడు. ఫిలిష్తీయులు వారి స్థలానికి వెళ్లి పోయారు. సౌలు పరిపాలన సాగించిన కాలంలో, ఇశ్రాయేలు చుట్టూవున్న దాని శత్రువులందరితో అతడు యుద్ధం చేశాడు. మోయాబీయులతోను అమ్మోనీయులతోను, ఎదోమీయులతోను, సోబాదేశపు రాజులతోను, ఫిలిష్తీయులతోను సౌలు యుద్ధంచేశాడు. సౌలు ఎక్కడికి వెళితే అక్కడ శత్రువులను ఓడించి విజయంసాధించాడు. సౌలు చాలా ధైర్యవంతుడు. అతడు అమాలేకీయులను సహా జయించాడు. ఇశ్రాయేలును కొల్లగొట్టాలని ప్రయత్నించిన దాని శత్రువులందరినీ సౌలు చీల్చి చెండాడి ఇశ్రాయేలును రక్షించాడు. యోనాతాను, ఇష్వీ, మెల్కీషూవ, ఈ ముగ్గురూ సౌలు కుమారులు. సౌలు పెద్ద కుమార్తె పేరు మేరబు. అతని చిన్న కుమార్తె మీకాలు. సౌలు భార్య పేరు అహీనోయము. ఆమె అహిమయస్సు అనే వాని కుమార్తె. సౌలు సైన్యాధికారి పేరు అబ్నేరు. అతడు నేరు అనేవాని కుమారుడు. నేరు సౌలు పినతండ్రి. సౌలు తండ్రి కీషు; అబ్నేరు తండ్రి నేరు-ఇద్దరూ అబీయేలు అనే వాని కుమారులు. సౌలు ధైర్యశాలిగా ఉన్నాడు. ఫిలిష్తీయులతో తీవ్రంగా పోరాడాడు. సౌలు తన రాజ్యంలో ఎప్పుడయినా, ఎక్కడయినా ఒక ధైర్యవంతుని గాని బలశాలిని గాని చూస్తే వానిని తన కోటలోని ప్రత్యేక సైనిక దళంలో చేర్చుకొనేవాడు.

షేర్ చేయి
1 సమూయేలు 14 TERV

1 సమూయేలు 14:24-52 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

–నేను నా శత్రువులమీద పగ తీర్చుకొనకమునుపు, సాయంత్రము కాకమునుపు భోజనము చేయువాడు శపింపబడును అని సౌలు జనులచేత ప్రమాణము చేయించెను, అందువలన జనులు ఏమియు తినకుండిరి. జనులందరు ఒక అడవిలోనికి రాగా అక్కడ నేలమీద తేనె కనబడెను. జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టియుండెనుగాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోటపెట్టలేదు. అయితే యోనాతాను తన తండ్రి జనులచేత చేయించిన ప్రమాణము వినలేదు. గనుక తన చేతికఱ్ఱ చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. జనులలో ఒకడు–నీ తండ్రి జనులచేత ప్రమాణము చేయించి–ఈ దినమున ఆహారము పుచ్చుకొనువాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించియున్నాడు; అందుచేతనే జనులు బహు బడలియున్నారని చెప్పెను. అందుకు యోనాతాను అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టినవాడాయెను; నేను ఈ తేనె కొంచెము పుచ్చుకొన్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి జనులు తాము చిక్కించుకొనిన తమ శత్రువుల దోపుళ్ల వలన బాగుగా భోజనముచేసినయెడల వారు ఫిలిష్తీయులను మరి అధికముగా హతము చేసియుందురనెను. ఆ దినమున జనులు ఫిలిష్తీయులను మిక్మషునుండి అయ్యాలోనువరకు హతముచేయగా జనులు బహు బడలిక నొందిరి. జనులు దోపుడుమీద ఎగబడి, గొఱ్ఱెలను ఎడ్లను పెయ్యలను తీసికొని నేలమీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున –జనులు రక్తముతోనేతిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా అతడు–మీరు విశ్వాసఘాతకులైతిరి; పెద్ద రాయి యొకటి నేడు నా దగ్గరకు దొర్లించి తెండని చెప్పి –మీరు అక్కడక్కడికి జనులమధ్యకు పోయి, అందరు తమ యెద్దులను తమ గొఱ్ఱెలను నాయొద్దకు తీసికొనివచ్చి యిక్కడ వధించి భక్షింపవలెను; రక్తముతో మాంసముతిని యెహోవా దృష్టికి పాపము చేయకుడని వారితో చెప్పుడని కొందరిని పంపెను. కాబట్టి జనులందరు ఆ రాత్రి తమతమ యెద్దులను తీసికొని వచ్చి అక్కడ వధించిరి. మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే. అంతట–మనము రాత్రియందు ఫిలిష్తీయులను తరిమి తెల్లవారువరకు వారిని కలతపెట్టి, శేషించు వాడొకడునులేకుండ చేతము రండి అని సౌలు ఆజ్ఞ ఇయ్యగా జనులు –నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమనిరి. అంతట సౌలు–యాజకుడు ఇక్కడనే యున్నాడు, దేవునియొద్ద విచారణ చేయుదము రండని చెప్పి సౌలు–ఫిలిష్తీయుల వెనుక నేను దిగిపోయినయెడల నీవు ఇశ్రాయేలీయుల చేతికి వారి నప్పగింతువా అని దేవునియొద్ద విచారణ చేయగా, ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరమియ్యక యుండెను. అందువలన సౌలు–జనులలో పెద్దలు నా యొద్దకు వచ్చి నేడు ఎవరివలన ఈ పాపము కలిగెనో అది విచారింపవలెను. నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలీయులను రక్షించు యెహోవా జీవముతోడని నేను ప్రమాణము చేయుచున్నాననెను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరమిచ్చినవాడు ఒకడును లేకపోయెను. –మీరు ఒకతట్టునను నేనును నా కుమారుడగు యోనాతానును ఒకతట్టునను ఉండవలెనని అతడు జనులందరితో చెప్పగా జనులు–నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమని సౌలుతో చెప్పిరి. అప్పుడు సౌలు–ఇశ్రాయేలీయులకు దేవుడవైన యెహోవా, దోషిని కనుపరచుమని ప్రార్థింపగా సౌలు పేరటను యోనాతాను పేరటను చీటిపడెనుగాని జనులు తప్పించుకొనిరి. –నాకును నా కుమారుడైన యోనాతానునకును చీట్లు వేయుడని సౌలు ఆజ్ఞ ఇయ్యగా యోనాతాను పేరట చీటి పడెను. –నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతానుతో అనగా యోనాతాను–నా చేతికఱ్ఱకొనతో కొంచెము తేనె పుచ్చుకొన్న మాట వాస్తవమే; కొంచెము తేనెకై నేను మరణమొందవలసి వచ్చినదని అతనితో అనెను. అందుకు సౌలు–యోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదువు, నేను ఒప్పుకొనని యెడల దేవుడు నాకు గొప్పఅపాయము కలుగజేయునుగాక అనెను. అయితే జనులు సౌలుతో–ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగ జేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికినికూడదు. దేవుని సహాయముచేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను; యెహోవా జీవముతోడు అతని తలవెండ్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండ జనులు అతని రక్షించిరి. అప్పుడు సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని వెళ్లిపోగా ఫిలిష్తీయులు తమ స్థలమునకు వెళ్లిరి. ఈలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధికారము నొందినవాడై నఖముఖాల వారి శత్రువులైన మోయాబీయులతోను అమ్మోనీయులతోను ఎదోమీ యులతోను సోబాదేశపు రాజులతోను ఫిలిష్తీయులతోను యుద్ధము చేసెను. ఎవరిమీదికి అతడు పోయెనో వారినందరిని ఓడించెను. మరియు అతడు దండునుకూర్చి అమాలేకీయులను హతముచేసి ఇశ్రాయేలీయులను కొల్ల సొమ్ముగా పెట్టినవారి చేతిలోనుండి వారిని విడిపించెను. సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా, యోనాతాను ఇష్వీ మెల్కీషూవ; అతని యిద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదానిపేరు మేరబు చిన్న దానిపేరు మీకాలు. సౌలుయొక్క భార్యకు అహీనోయమని పేరు, ఈమె అహిమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు, ఇతడు సౌలునకు పిన తండ్రియైన నేరు కుమారుడు. సౌలు తండ్రియగు కీషును అబ్నేరు తండ్రియగు నేరును అబీయేలు కుమారులు. సౌలు బ్రదికిన దినములన్నియు ఫిలిష్తీయులతో ఘోర యుద్ధము జరుగగా తాను చూచిన బలాఢ్యుల నందరిని పరాక్రమశాలులనందరిని తనయొద్దకు చేర్చుకొనెను.

షేర్ చేయి
1 సమూయేలు 14 TELUBSI