సంఖ్యాకాండము 24:2-17

సంఖ్యాకాండము 24:2-17 TELUBSI

బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమతమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతనిమీదికి వచ్చెను గనుక అతడు ఉపమానరీతిగా ఇట్లనెను– బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరచినవానికి వచ్చిన దేవోక్తి. దేవవాక్కులను వినినవాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను. యాకోబూ, నీ గుడారములు ఇశ్రాయేలూ, నీ నివాసస్థలములు ఎంతో రమ్యమైనవి. వాగులవలె అవి వ్యాపించియున్నవి నదీతీరమందలి తోటలవలెను యెహోవా నాటిన అగరు చెట్లవలెను నీళ్లయొద్దనున్న దేవదారు వృక్షములవలెను అవి యున్నవి. నీళ్లు అతని బొక్కెనలనుండి కారును అతని సంతతి బహు జలములయొద్ద నివసించును అతనిరాజు అగగుకంటె గొప్పవాడగును అతని రాజ్యము అధికమైనదగును. దేవుడు ఐగుప్తులోనుండి అతని రప్పించెను గురుపోతు వేగమువంటి వేగము అతనికి కలదు అతడు తన శత్రువులైన జనులను భక్షించునువారి యెముకలను విరుచును తన బాణములతో వారిని గుచ్చును. సింహమువలెను ఆడుసింహమువలెను అతడు క్రుంగి పండుకొనెను అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును నిన్ను శపించువాడు శపింపబడును. అప్పుడు బాలాకు కోపము బిలాముమీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో–నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని కాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్లుము. నేను నిన్ను మిక్కిలి ఘనపరచెదనని చెప్పితినిగాని యెహోవా నీవు ఘనత పొందకుండ ఆటంకపరచెననెను. అందుకు బిలాము బాలాకుతో–బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను నా యిష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. యెహోవా యేమి సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నాయొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? చిత్తగించుము; నేను నా జనులయొద్దకు వెళ్లుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విశదపరచెదను రమ్మని చెప్పి ఉపమానరీతిగా ఇట్లనెను– బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి. కన్నులు తెరచినవానికి వచ్చిన దేవోక్తి. దేవవాక్కులను వినిన వాని వార్త మహోన్నతుని విద్య నెరిగినవాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నానుగాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నానుగాని సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరిని నాశనము చేయును.