సంఖ్యాకాండము 24:2-17

సంఖ్యాకాండము 24:2-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఇశ్రాయేలు వారు గోత్రాల ప్రకారం గుడారాలు వేసుకుని ఉండడం బిలాము చూసినప్పుడు, దేవుని ఆత్మ అతని మీదికి వచ్చింది, అతడు ఈ సందేశం ఇచ్చాడు: “బెయోరు కుమారుడైన బిలాము యొక్క ప్రవచనం, స్పష్టంగా చూడగలిగే కన్ను గలవాని ప్రవచనం, దేవుని మాటలు వినే వాని ప్రవచనం, సర్వశక్తిగల దేవుని నుండి దర్శనం చూసేవాడు, సాష్టాంగపడేవాడు, కళ్లు తెరవబడినవాడు: “ఓ యాకోబు, నీ గుడారాలు ఎంత అందంగా ఉన్నాయి, ఓ ఇశ్రాయేలు, నీ నివాస భవనాలు ఎంత రమ్యంగా ఉన్నాయి! “అవి లోయల్లా వ్యాపించాయి, నది ప్రక్కన తోటల్లా ఉన్నాయి, యెహోవా నాటిన అగరు వంటివి, జలాల ప్రక్కన దేవదారు చెట్లలా ఉన్నాయి. వాటి బొక్కెనల నుండి నీళ్లు పారుతున్నాయి; వాటి విత్తనాలకు సమృద్ధిగా నీళ్లుంటాయి. “వారి రాజు అగగు కంటే గొప్పవాడు; వారి రాజ్యం హెచ్చింపబడుతుంది. “దేవుడు ఈజిప్టు నుండి వారిని బయటకు తెచ్చారు; వారు అడవి ఎద్దు బలం కలిగి ఉన్నారు. వారు శత్రు దేశాలను మ్రింగివేస్తారు వారి ఎముకలను తునాతునకలు చేస్తారు; వారి బాణాలతో వారు వారిని గుచ్చుతారు. సింహంలా ఆడు సింహంలా వారు ముడుచుకుని పడుకుంటారు, వారిని ధైర్యంగా ఎవరు లేపగలరు? “ఓ ఇశ్రాయేలు, నిన్ను దీవించే వారు దీవించబడుదురు గాక నిన్ను శపించేవారు శపించబడుదురు గాక!” బిలాము మీద బాలాకుకు కోపం రగులుకుంది. చేతులు చరుస్తూ అతనితో, “నా శత్రువులను శపించమని నిన్ను పిలిపిస్తే, వారిని మూడుసార్లు దీవించావు. ఇప్పుడు ఇక్కడినుండి మీ ఇంటికి పో! నిన్ను ఘనంగా సన్మానిస్తానని నేను అన్నాను కానీ యెహోవా నీకు ఆ సన్మానం లేకుండా చేశారు” అని అన్నాడు. బిలాము బాలాకుతో, “నీవు పంపిన దూతలకు నేను చెప్పలేదా, ‘బాలాకు తన రాజభవనంలో ఉన్న వెండి బంగారం అంతా నాకు ఇచ్చినా సరే, నా సొంతగా నేనేమి చెప్పలేను, మంచిదైనా, చెడ్డదైనా యెహోవా ఆజ్ఞ దాటి ఏమి చెప్పలేను యెహోవా చెప్పిందే నేను చెప్పాలి.’ నేనిప్పుడు నా ప్రజల దగ్గరకు తిరిగి వెళ్తున్నాను. కానీ ముందు ఈ ప్రజలు రాబోయే రోజుల్లో మీ ప్రజలకు ఏమి చేస్తారో చెప్తాను.” అప్పుడు బిలాము ఈ సందేశాన్ని ఇచ్చాడు: “బెయోరు కుమారుడైన బిలాము యొక్క ప్రవచనం, స్పష్టంగా చూడగలిగే కన్ను గలవాని ప్రవచనం, దేవుని మాటలు వినే వాని ప్రవచనం, మహోన్నతుని దగ్గర నుండి తెలివి సంపాదించుకున్నవాడు, సర్వశక్తిగల వాడి నుండి దర్శనం చూసేవాడు, సాష్టాంగపడేవాడు, కళ్లు తెరవబడినవాడు: “అతన్ని చూస్తాను, కానీ ఇప్పుడు కాదు; అతన్ని కనిపెడతాను, కానీ సమీపంగా కాదు. యాకోబు నుండి నక్షత్రం వస్తుంది; ఇశ్రాయేలు నుండి రాజదండం లేస్తుంది. అతడు మోయాబు కణతలను నలగ్గొడతాడు, షేతు ప్రజల కపాలాలను చితకగొడతాడు.

సంఖ్యాకాండము 24:2-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

బిలాము కళ్ళెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రాల ప్రకారం శిబిరంలో ఉండడం చూసినప్పుడు, దేవుని ఆత్మ అతని మీదికి దిగి వచ్చాడు. అతడు ఇలా ప్రవచించాడు. “బెయోరు కొడుకు బిలాముకు పలుకబోతున్నాడు. కళ్ళు బాగా తెరుచుకున్నవాడు పలకబోతున్నాడు. అతడు దేవుని మాటలు మాట్లాడతాడు, దేవుని మాటలు వింటాడు. అతడు సర్వశక్తుని దగ్గర నుంచి వచ్చే దర్శనం చూస్తాడు, ఆయన ఎదుట అతడు తన కళ్ళు తెరిచి వంగి నమస్కరిస్తాడు. యాకోబూ, నీ గుడారాలు ఎంతో అందంగా ఉన్నాయి. ఇశ్రాయేలూ, నీ నివాసస్థలాలు ఎంత రమ్యంగా ఉన్నాయి! అవి లోయలు వ్యాపించినట్టు, నదీతీరంలో తోటల్లా, యెహోవా నాటిన అగరు చెట్లలా నీళ్ళ దగ్గరున్న దేవదారు వృక్షాల్లా ఉన్నాయి. అతడు నీరు తోడుకునే చేదల నుండి నీళ్ళు కారుతాయి. అతడు నాటిన విత్తనానికి సమృద్ధిగా నీళ్ళు అందుతాయి. వారి రాజు అగగు కంటే గొప్పవాడౌతాడు. వారి రాజ్యం ఘనత పొందుతుంది. దేవుడు ఐగుప్తులోనుంచి అతన్ని రప్పించాడు. అతనికి అడవిదున్నకు ఉన్నంత బలం ఉంది. అతడు తనకు విరోధంగా పోరాడే వారిని మింగేస్తాడు. వారి ఎముకలు విరిచేస్తాడు. తన బాణాలతో వారిని చంపేస్తాడు. అతడు సింహంలా, ఆడ సింహంలా పొంచి ఉంటాడు. అతని విశ్రాంతికి భంగం కలిగించేవాడెవడు? అతన్ని దీవించే ప్రతివాడికీ దీవెన వస్తుంది గాక, అతన్ని శపించే ప్రతివాడికీ శాపం వస్తుంది గాక” అన్నాడు. అప్పుడు బాలాకు కోపం బిలాము మీద రగిలింది గనక అతడు తన చేతులు చరిచి బిలాముతో “నా శత్రువులను శపించడానికి నిన్ను పిలిపించాను కాని నీవు ఈ మూడుసార్లు వారిని దీవించావు. కాబట్టి నువ్వు ఇప్పుడు నీ స్థలానికి తొందరగా వెళ్లు. నేను నిన్ను ఎంతో గొప్పవాణ్ణి చేస్తానని చెప్పాను గాని, నీకు అది దక్కకుండా యెహోవా నిన్ను ఆటంకపరిచాడు” అన్నాడు. అందుకు బిలాము బాలాకుతో “బాలాకు తన రాజమందిరమంత వెండి బంగారాలు నాకిచ్చినా నా ఇష్టప్రకారం మేలైనా కీడైనా చెయ్యడానికి యెహోవా చెప్పిన మాట మీరలేను, యెహోవా ఏం చెప్తాడో అదే పలుకుతానని నువ్వు నా దగ్గరికి పంపించిన నీ వర్తమానికులతో నేను చెప్పలేదా? కాబట్టి, చూడు, నేను నా ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. కాని, ముందు రోజుల్లో ఈ ప్రజలు నీ ప్రజలకు ఏం చేస్తారో, ఆ హెచ్చరిక నీకు నేనివ్వాలి” అన్నాడు. బిలాము ప్రవచనం చెప్పాడు. “బెయోరు కొడుకు బిలాము మాట్లాడుతున్నాడు, కనువిప్పు కలిగినవాడు మాట్లాడుతున్నాడు. ఇది దేవుని వాక్కులను విన్నవాడి ప్రవచనం. మహాన్నతుని జ్ఞానం తెలిసినవాడి ప్రవచనం. సర్వశక్తుని దర్శనాలు చూసినవాడి ప్రవచనం. ఆయన ఎదుట తెరిచిన కళ్ళతో అతడు వంగి నమస్కారం చేస్తున్నాడు. నేను ఆయన్ని చూస్తున్నాను, కాని ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు. నేను ఆయన్ని గమనిస్తున్నాను కాని ఆయన ఇప్పుడు సమీపంగా లేడు. ఒక నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది. రాజదండం ఇశ్రాయేలులోనుంచి వస్తుంది. అతడు మోయాబు నాయకులను పడగొడతాడు. అతడు షేతు వంశస్తులందరినీ నాశనం చేస్తాడు.

సంఖ్యాకాండము 24:2-17 పవిత్ర బైబిల్ (TERV)

బిలాము అరణ్యాన్ని చూచి, అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందర్నీ చూసాడు. వారు, వారి కుటుంబాలతో ఆ ప్రదేశాల్లో నివసిస్తున్నారు. అప్పుడు దేవుని ఆత్మ బిలాము మీదికి రాగా బిలాము ఈ విషయాలు చెప్పాడు: “బెయోరు కుమారుడు ఈ విషయాలు చెబుతున్నాడు. నా కళ్లు తేటగా చూస్తున్నాయి కనుక ఈ మాటలు పలుకుతున్నాను. నేను దేవుని మాటలు వింటున్నాను కనుక ఈ మాటలు చెబుతున్నాను. నేను చూడాలని ఆ సర్వశక్తిమంతుడు కోరుతున్న వాటిని నేను చూడ గలుగుతున్నాను. నేను సాగిలపడి తేటగా చూసినవాటిని చెబుతున్నాను. “యాకోబు ప్రజలారా, మీ గుడారాలు చాలా అందంగా ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలారా, మీ నివాసాలు అందంగా ఉన్నాయి. భూమి మీద మీ గుడారాలు లోయల్లా పరచుకొన్నాయి. అవి నదీ తీరంలో తోటలా ఉన్నాయి. యెహోవా నాటిన అది చక్కటి సువాసనగల మొక్కలా ఉంది. అది నీళ్ల దగ్గర పెరిగే అందమైన చెట్లలా ఉంది. మీకు ఎల్లప్పుడూ తాగటానికి కావాల్సినంత నీరు ఉంటుంది. మీ ఆహారం పండించుకోవటానికి కావాల్సినంత నీరు ఎల్లప్పుడూ ఉంటుంది మీకు. ఆ ప్రజల రాజు అగాగుకంటె గొప్పవాడుగా ఉంటాడు. వారి రాజ్యం చాలా గొప్పది అవుతుంది. “ఆ ప్రజలను ఈజిప్టునుండి దేవుడే బయటకు తీసుకొచ్చాడు. వారు అడవి ఆవు అంతటి బలంగలవారు. తమ శత్రువులందర్నీ వారు ఓడిస్తారు. వారి శత్రువుల ఎముకల్ని వారు విరుగగొడ్తారు. వారి బాణాలు వారి శత్రువుల్ని చంపేస్తాయి. తన ఆహారం మీదికి ఎగబడటానికి సిద్ధంగా వున్న సింహంలా ఇశ్రాయేలీయులున్నారు. వారు నిద్రపోతున్న కొదమ సింహంలా ఉన్నారు. దానిని మేల్కొలి పేందుకు ఎవడికి ధైర్యం చాలదు. నిన్ను ఆశీర్వదించే వారు ఆశీర్వాదం పొందుతారు. నిన్ను ఎవరైనా శపిస్తే వారికి గొప్ప కష్టాలు వస్తాయి.” అప్పుడు బాలాకు బిలాముమీద చాల కోపపడ్డాడు. బిలాముతో బాలాకు అన్నాడు: “నిన్ను వచ్చి నా శత్రువులను శపించుమని పిలిచాను. కానీ నీవు వాళ్లను ఆశీర్వదించావు. వాళ్లను మూడు సార్లు నీవు ఆశీర్వదించావు. ఇప్పుడు ఇంటికి వెళ్లిపో. నీకు చాలా ఇస్తానని నేను నీతో చెప్పాను. అయితే నీవు నీ ప్రతిఫలం పోగొట్టుకొనేటట్టు చేసాడు యెహోవా.” బాలాకుతో బిలాము అన్నాడు: “నీవు నా దగ్గరకు మనుష్యుల్ని పంపించావు. నన్ను రమ్మని వాళ్లు అడిగారు. కానీ వారితో నేను, ‘బాలాకు అతి సుందరమైన తన భవనాన్ని వెండి, బంగారాలతో నింపి ఇచ్చినా కానీ నేను మాత్రం నన్ను చెప్పమని యెహోవా నాకు చెప్పిన మాటలే చెబుతాను మంచిగాని చెడుగాని, నా అంతట నేనే ఏదీ చెయలేను. యెహోవా ఆజ్ఞాపించినట్లు నేను చేసి తీరాల్సిందే’ అన్నాను. ఈ సంగతులు నేను నీ మనుష్యులతో చెప్పటం నీకు జ్ఞాపకంలేదా? ఇప్పుడు నేను నా స్వంత ప్రజల దగ్గరకు వెళ్తున్నాను. అయితే నేను నీకు ఒక హెచ్చరిక ఇస్తున్నాను. నీకూ, నీ ప్రజలకూ ఇశ్రాయేలు ప్రజలు ఇక ముందు ఏమి చేస్తారో నేను నీకు చెబుతాను.” అప్పుడు బిలాము ఈ విషయాలు చెప్పాడు: “బెయెరు కుమారుడైన బిలాము మాటలు ఇవి. విషయాలను తేటగా చూడగలవాని మాటలు ఇవి. మాటలను దేవుని దగ్గరనుండి వినగల వాని మాటలు ఇవి. మహోన్నతుడైన దేవుడు నాకు నేర్పినవాటిని నేను నేర్చుకున్నాను. నేను చుడాలని సర్వశక్తుడైన దేవుడు కోరినవాటిని నేను చూసాను. నేను ఆయనకు సాగిల పడుతున్నాను. దేవునికి కావలసినదానిని నేను తేటగా చూడగలను. “యెహోవా రావటం నేను చూస్తున్నాను, కానీ ఇప్పుడే కాదు. ఆయన రాక నేను చూస్తున్నాను, కానీ అది త్వరలోనే జరగదు. యాకోబు వంశంనుండి ఒక నక్షత్రం వస్తుంది. ఇశ్రాయేలు నుండి ఒక కొత్త పాలకుడు వస్తాడు. ఆ పాలకుడు మోయాబు ప్రజల తలలు చితకగొడ్తాడు. షేతు కుమారులందరి తలలు ఆ పాలకుడు చితకగొడ్తాడు.

సంఖ్యాకాండము 24:2-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమతమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతనిమీదికి వచ్చెను గనుక అతడు ఉపమానరీతిగా ఇట్లనెను– బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరచినవానికి వచ్చిన దేవోక్తి. దేవవాక్కులను వినినవాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను. యాకోబూ, నీ గుడారములు ఇశ్రాయేలూ, నీ నివాసస్థలములు ఎంతో రమ్యమైనవి. వాగులవలె అవి వ్యాపించియున్నవి నదీతీరమందలి తోటలవలెను యెహోవా నాటిన అగరు చెట్లవలెను నీళ్లయొద్దనున్న దేవదారు వృక్షములవలెను అవి యున్నవి. నీళ్లు అతని బొక్కెనలనుండి కారును అతని సంతతి బహు జలములయొద్ద నివసించును అతనిరాజు అగగుకంటె గొప్పవాడగును అతని రాజ్యము అధికమైనదగును. దేవుడు ఐగుప్తులోనుండి అతని రప్పించెను గురుపోతు వేగమువంటి వేగము అతనికి కలదు అతడు తన శత్రువులైన జనులను భక్షించునువారి యెముకలను విరుచును తన బాణములతో వారిని గుచ్చును. సింహమువలెను ఆడుసింహమువలెను అతడు క్రుంగి పండుకొనెను అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును నిన్ను శపించువాడు శపింపబడును. అప్పుడు బాలాకు కోపము బిలాముమీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో–నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని కాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్లుము. నేను నిన్ను మిక్కిలి ఘనపరచెదనని చెప్పితినిగాని యెహోవా నీవు ఘనత పొందకుండ ఆటంకపరచెననెను. అందుకు బిలాము బాలాకుతో–బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను నా యిష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. యెహోవా యేమి సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నాయొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? చిత్తగించుము; నేను నా జనులయొద్దకు వెళ్లుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విశదపరచెదను రమ్మని చెప్పి ఉపమానరీతిగా ఇట్లనెను– బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి. కన్నులు తెరచినవానికి వచ్చిన దేవోక్తి. దేవవాక్కులను వినిన వాని వార్త మహోన్నతుని విద్య నెరిగినవాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నానుగాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నానుగాని సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరిని నాశనము చేయును.