నెహెమ్యా 12:27-43
నెహెమ్యా 12:27-43 TELUBSI
యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్రగీతములతోను పాటలతోను స్వరమండల సితారా చేయి తాళములతోను సంతోషముగా జరిగించునట్లు లేవీయులను తమ సకల స్థలములలోనుండి యెరూషలేమునకు రప్పించుటకు పూను కొనిరి అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టునున్న మైదాన భూమిలోనుండియు నెటోపాతియొక్క గ్రామములలోనుండియు కూడుకొని వచ్చిరి. మరియు గిల్గాలుయొక్క యింటిలోనుండియు, గెబయొక్కయు అజ్మావెతుయొక్కయు పొలములలోనుండియు జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టును గాయకులు తమకు ఊళ్లను కట్టుకొని యుండిరి. యాజకులును లేవీయులును తమ్మును తాము పవిత్రపరచుకొనిన తరువాత జనులను గుమ్మములను ప్రాకారమును పవిత్రపరచిరి. అటుతరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారముమీదికి తోడుకొని వచ్చి స్తోత్రగీతములు పాడువారిని రెండు గొప్ప సమూహములుగా ఏర్పరచితిని. అందులో ఒక సమూహము కుడిప్రక్కను పెంట గుమ్మము వైపున ప్రాకారముమీదను నడిచెను. వారివెంబడి హోషయాయును యూదుల ప్రధానులలో సగముమందియును వెళ్లిరి. మరియు అజర్యాయు ఎజ్రాయు మెషుల్లామును యూదాయు బెన్యామీనును షెమ యాయును యిర్మీయాయు అనువారు పోయిరి. యాజకుల కుమారులలో కొందరు బాకాలు ఊదుచు పోయిరి; వారెవరనగా, ఆసాపు కుమారుడైన జక్కూరునకు పుట్టిన మీకాయా కనిన మత్తన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానునకు పుట్టిన జెకర్యాయు అతని బంధువులగు షెమయా అజరేలు మిలలై గిలలై మాయి నెతనేలు యూదా హనానీ అనువారు. వీరు దైవజనుడగు దావీదుయొక్క వాద్యములను వాయించుచు పోయిరి; వారి ముందర శాస్త్రియగు ఎజ్రాయును నడిచెను. వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మముదగ్గర దావీదుపురముయొక్క మెట్లమీద దావీదు నగరును దాటి ప్రాకారము వెంబడి తూర్పువైపు నీటి గుమ్మమువరకు పోయిరి. స్తోత్రగీతములు పాడువారి రెండవ సమూహము వారికి ఎదురుగా నడిచెను, వారివెంబడి నేనును వెళ్లితిని. ప్రాకారముమీదనున్న సగముమంది కొలుముల గోపురము అవతలనుండి వెడల్పు ప్రాకారమువరకు వెళ్లిరి. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతలనుండియు, పాత గుమ్మము అవతలనుండియు, మత్స్యపు గుమ్మము అవతల నుండియు, హనన్యేలు గోపురమునుండియు, మేయా గోపురమునుండియు, గొఱ్ఱెల గుమ్మమువరకు వెళ్లి బందీ గృహపు గుమ్మములో నిలిచిరి. ఆప్రకారమే దేవుని మందిరములో స్తోత్రగీతములు పాడువారి రెండు సమూహములును నేనును, నాతోకూడ ఉన్న అధికారులలో సగముమందియు నిలిచియుంటిమి. యాజకులగు ఎల్యాకీము మయశేయా మిన్యామీను మీకాయా ఎల్యోయేనై జెకర్యా హనన్యా బాకాలు పట్టుకొనిరి. ఇజ్రహయా అనువాడు నడిపింపగా మయశేయా షెమయా ఎలియాజరు ఉజ్జీ యెహోహానాను మల్కీయా ఏలాము ఏజెరులను గాయకులు బిగ్గరగా పాడిరి. మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసెనని ఆ దినమునవారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడ సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహు దూరమునకు వినబడెను.

