నెహెమ్యా 12:27-43
నెహెమ్యా 12:27-43 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెరూషలేము గోడ ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు కృతజ్ఞతా స్తుతి గీతాలతో తాళాలు, వీణలు సితారలు వాయిస్తూ సంతోషంగా చేసుకోవడానికి అన్ని ప్రాంతాల నుండి లేవీయులను యెరూషలేముకు తీసుకువచ్చే పని మొదలుపెట్టారు. సంగీతకారులను యెరూషలేము చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి, నెటోపాతీయుల గ్రామాల నుండి తీసుకువచ్చారు. యెరూషలేము చుట్టూ సంగీతకారులు తమ కోసం గ్రామాలు నిర్మించుకున్నారు కాబట్టి బేత్-గిల్గాలు నుండి, గెబా అజ్మావెతు ప్రాంతాల నుండి వచ్చారు. యాజకులు, లేవీయులు తమను తాము పవిత్రపరచుకున్న తర్వాత ప్రజలను, గుమ్మాలను, గోడను పవిత్రపరిచారు. నేను యూదా నాయకులను గోడ మీదికి తీసుకువచ్చాను. కృతజ్ఞతలు చెల్లించడానికి రెండు పెద్ద గాయక బృందాలను నియమించాను. వాటిలో ఒక బృందం గోడ మీద కుడి వైపుగా పెంట ద్వారం వైపు నడిచారు. హోషయా, యూదా నాయకుల్లో సగం మంది వారితో పాటు వెళ్లారు. వారితో అజర్యా, ఎజ్రా, మెషుల్లాము, యూదా, బెన్యామీను, షెమయా, యిర్మీయా అనేవారు వెళ్లారు. అలాగే బూరలు ఊదుతూ కొంతమంది యాజకులు వెళ్లారు. ఆసాపు కుమారుడైన జక్కూరుకు పుట్టిన మీకాయా కుమారుడైన మత్తన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానుకు పుట్టిన జెకర్యా, అతని సహాయకులైన షెమయా, అజరేలు, మిలలై, గిలలై, మాయి, నెతనేలు, యూదా, హనానీ అనేవారు దేవుని సేవకుడైన దావీదు నిర్దేశించిన సంగీత వాయిద్యాలు వాయిస్తూ వెళ్లారు. ధర్మశాస్త్ర శాస్త్రియైన ఎజ్రా వారిని నడిపించాడు. ఊట గుమ్మం దగ్గర వారు నేరుగా దావీదు పట్టణం గోడ మెట్ల మీదుగా దావీదు ఇంటిని దాటి తూర్పున ఉన్న నీటిగుమ్మం దగ్గరకు వెళ్లారు. కృతజ్ఞతాగీతాలు పాడే గాయకుల రెండవ బృందం వారికి ఎదురుగా వెళ్లారు. మిగిలిన సగం మంది ప్రజలతో పాటు కలిసి నేను అగ్ని గుండాల గోపురం అవతల నుండి వెడల్పు గోడ వరకు వెళ్లాము. వారు ఎఫ్రాయిం ద్వారం మీదగా వెళ్లి, యెషానా గుమ్మాన్ని, చేప గుమ్మాన్ని, హనానేలు గోపురాన్ని, వందవ గోపురాన్ని దాటి గొర్రెల గుమ్మం వరకు వెళ్లి కాపలా గుమ్మం దగ్గర ఆగారు. అప్పుడు కృతజ్ఞతాగీతాలు పాడే గాయకుల రెండు బృందాలు, నేను, నాతో పాటు ఉన్న అధికారులలో సగం మంది దేవుని మందిరంలో నిలబడ్డాము. అలాగే యాజకులైన ఎల్యాకీము, మయశేయా, మిన్యామీను, మీకాయా, ఎల్యోయేనై, జెకర్యా, హనన్యాలు తమ బూరలు పట్టుకుని ఉన్నారు. మయశేయా, షెమయా, ఎలియాజరు, ఉజ్జీ, యెహోహనాను, మల్కీయా, ఏలాము, ఏజెరులు అక్కడే ఉన్నారు. ఇజ్రహయా సారథ్యంలో గాయకులు గట్టిగా పాటలు పాడారు. ఆ రోజు దేవుడు తమకు గొప్ప ఆనందాన్ని ఇచ్చినందుకు వారు గొప్ప బలులు అర్పించి సంతోషించారు. స్త్రీలు పిల్లలు కూడా సంతోషించారు. యెరూషలేములోని ఈ సంతోష ధ్వనులు చాలా దూరం వరకు వినిపించాయి.
నెహెమ్యా 12:27-43 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెరూషలేం సరిహద్దు గోడల ప్రతిష్ట సమయంలో వీళ్ళు ఆ కార్యక్రమం స్తుతి గీతాలతో, పాటలతో, తంతి వాయిద్యాలతో మేళతాళాలతో ఆర్భాటంగా జరిగించడానికి అన్ని పరిసర గ్రామాల నుండి లేవీయులను యెరూషలేంకు రప్పించే పని చేపట్టారు. అప్పుడు గాయకుల వంశాల సంతానం యెరూషలేం చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి, నెటోపాతీయుల గ్రామాల్లో నుండి సమకూడి వచ్చారు. యెరూషలేం చుట్టూ గాయకులు తమ గ్రామాలు కట్టుకుని ఉండడం వల్ల గిల్గాలు కుటుంబం నుండి, గెబ, అజ్మావెతు ప్రాంతాల నుండి ప్రజలు తరలి వచ్చారు. యాజకులు, లేవీయులు మొదటగా తమను తాము పవిత్రం చేసుకున్నారు. తరువాత ప్రజలను, ద్వారాలను, గోడలను శుద్ధి చేశారు. తరువాత నేను యూదుల ప్రముఖులను గోడ మీదికి ఎక్కించాను. స్తుతి గీతాలు పాడేవారిని రెండు పెద్ద గుంపులుగా విభజించాను. ఒక గుంపు చెత్త ద్వారం కుడివైపు గోడ మీద నిలబడ్డారు. వారితోపాటు హోషయా, యూదుల ప్రముఖుల్లో సగం మంది వెళ్ళారు. ఇంకా అజర్యా, ఎజ్రా, మెషుల్లాము, యూదా, బెన్యామీను, షెమయాయు, యిర్మీయా అనేవాళ్ళు కూడా గోడ ఎక్కారు. షెమయా మనవడు, యోనాతాను కొడుకు జెకర్యాతో కలసి కొందరు యాజకుల కొడుకులు బాకాలు ఊదుతూ వెళ్ళారు. ఆసాపు కొడుకు జక్కూరు, జక్కూరు కొడుకు మీకాయా, మీకాయా కొడుకు మత్తన్యా. మత్తన్యా కొడుకు షెమయా. షెమయా, అజరేలు, మిలలై, గిలలై, మాయి, నెతనేలు, యూదా, హనానీ అనేవాళ్ళు అతని బంధువులు. వీళ్ళు దైవ సేవకుడు దావీదు నియమించిన వాయిద్యాలు మోగిస్తూ వెళ్ళారు. ఆచార్యుడైన ఎజ్రా వారికి ముందుగా నడిచాడు. వాళ్ళు తమకు ఎదురుగా ఉన్న ఊట ద్వారం దగ్గర దావీదు పట్టణం మెట్లపై నుండి ఆ పట్టణం దాటి గోడ వెంట తూర్పు దిశగా నీటి ద్వారం దాకా వెళ్ళారు. కృతజ్ఞతాస్తుతి గీతాలు పాడేవాళ్ళ రెండవ గుంపు వారికి ఎదురుగా బయలుదేరింది. గోడపై ఉన్న సగం మంది అగ్నిగుండాల గోపురం అవతల నుండి వెడల్పు గోడ దాకా వెళ్ళారు. వారితో కలసి నేను కూడా వెళ్లాను. ఆ గుంపు వాళ్ళు ఎఫ్రాయీం ద్వారం మీదగా వెళ్లి, పాత ద్వారాన్ని, మత్స్యపు ద్వారాన్ని, హనన్యేలు గోపురాన్ని, మేయా గోపురాన్ని దాటి వెళ్ళి, గొర్రెల ద్వారం వరకూ ఎక్కి బందీ గృహం ద్వారం దగ్గర నిలిచారు. ఆ విధంగా దేవుని ఆలయంలో కృతజ్ఞతా గీతాలు పాడేవాళ్ళ రెండు గుంపులు, నేనూ నాతోపాటు ఉన్న అధికారుల్లో సగం మంది నిలబడి ఉన్నాం. యాజకులు ఎల్యాకీము, మయశేయా, మిన్యామీను, మీకాయా, ఎల్యోయేనై, జెకర్యా, హనన్యా బాకాలు చేతబట్టుకుని ఉన్నారు. ఇజ్రహయా అనే వాడి ఆధ్వరంలో గాయకులు మయశేయా, షెమయా, ఎలియాజరు, ఉజ్జీ, యెహోహానాను, మల్కీయా, ఏలాము, ఏజెరులు పెద్ద స్వరంతో పాటలు పాడారు. వాళ్ళు తమ భార్యా బిడ్డలతో కలసి దేవుడు తమకు అమితమైన సంతోషం కలిగించినందుకు ఆ రోజు విలువైన హోమాలు అర్పించి ఆనందించారు. యెరూషలేంలో వాళ్ళు చేసిన ఆనంద ధ్వనులు చాలా దూరం వినిపించాయి.
నెహెమ్యా 12:27-43 పవిత్ర బైబిల్ (TERV)
ప్రజలు యెరూషలేము ప్రాకారాన్ని ప్రతిష్ఠించారు. వాళ్లు లేవీయులందర్నీ యెరూషలేముకి తీసుకువచ్చారు. ఆ లేవీయులు తాము నివసించే ఆయా పట్టణాలనుంచి వచ్చారు. వాళ్లు యెరూషలేముకి ప్రాకారం ప్రతిష్ఠించటం కోసం వచ్చారు. లేవీయులు దైవ స్తోత్రాలు పాడేందుకూ, కీర్తనలు పాడేందుకూ వచ్చారు. వాళ్లు స్వరమండల సితారలు, తాళాలు వాయించారు. తంబురలు మోగించారు. గాయకులందరూ కూడా యెరుషలేముకి వచ్చారు. ఆ గాయకులు యెరూషలేము చుట్టూవున్న పట్టణాల నుంచి వచ్చారు. వాళ్లు నెటోపా పట్టణం నుంచి, బేత్‌గిల్గాలు, గెబ, అజ్‌మావెతుల నుంచి వచ్చారు. ఆ గాయకులు యెరూషలేము చుట్టుప్రక్కల ప్రాంతాల్లో తమకోసం చిన్న చిన్న పట్టణాలు నిర్మించుకున్నారు. యాజకులూ, లేవీయులూ తమని తాము పవిత్రం చేసుకున్నారు. తర్వాత వాళ్లు యెరూషలేము ప్రాకారాలన్నీ ఒక ఆచారములో పవిత్రీకరించారు. అప్పుడు నేను (నెహెమ్యాను) యూదా నాయకులకి పైకెక్కి ప్రాకారం మీద నిలబడమని చెప్పాను. దైవ స్తుతి, కృతజ్ఞత గీతాలు పాడేందుకు రెండు పెద్ద గాయక బృందాలను కూడా ఎంపిక చేశాను. వాటిలో ఒక బృందం కుడివైపున పెంట గుమ్మం దిశగా పోయి ప్రాకారం పైకి ఎక్కాలి. హోషెయా, యూదా నాయకుల్లో సగంమంది ఆ గాయకుల వెంట వెళ్లారు. అజర్యా, ఎజ్రా, మెషుల్లాము, యూదా, బెన్యామీను, షెమయా, యిర్మీయా, మొదలైనవారు కూడా వాళ్లతో వెళ్లారు. యాజకుల్లో కొందరు కూడా బూరలు ఊదుతూ వాళ్లని ప్రాకారం దాకా అనుసరించారు, జెకర్యా కూడా వాళ్ల వెంట నడిచాడు (జెకర్యా యోనాతాను కొడుకు, యోనాతాను షెమయా కొడుకు, షెమయా మత్తనయా కొడుకు, మత్తనయా మీకాయా కొడుకు. మీకాయా జక్కూరు కొడుకు, జక్కూరు అసాఫు కొడుకు). అంతేకాక ఆసాపు సోదరులు కూడా వున్నారు. వాళ్లు: షెమయా, అజరేలు, మిలయి, గిలలయి, మాయి, నెతనేలు, యూదా, హానానీ. వాళ్ల దగ్గర దైవ జనుడయిన దావీదు తయారు చేసిన సంగీత వాద్యాలు వున్నాయి. ఉపదేశకుడైన ఎజ్రా ప్రాకారానికి ప్రతిష్ఠ చేసే బృందానికి అగ్రభాగాన నడిచాడు. వాళ్లు ఊట గుమ్మం దగ్గరికి వెళ్లారు. వాళ్లు మెట్లు ఎక్కి దావీదు నగరం చేరుకున్నారు. వాళ్లు ప్రహరీగోడపైన నిలబడ్డారు. వాళ్లు దావీదు భవనం దాటి, ఊట గుమ్మం దిశగా గోడమీద నడిచి వెళ్లారు. రెండవ గాయక బృందం రెండో దిశకి ఎడమ దిశకి బయల్దేరింది. వాళ్లు గోడపైకి వెళ్తున్నప్పుడు నేను వాళ్లని అనుసరించాను. జనంలో సగంమంది కూడా వాళ్లని అనుసరించారు. వాళ్లు అగ్ని గుండాల శిఖరాన్ని దాటి, వెడల్పు గోడను చేరుకున్నారు. తర్వాత వాళ్లు ఈ క్రింది ద్వారాలు దాటారు: ఎఫ్రాయిము గుమ్మము, పురాతన గుమ్మము, మత్స్య గుమ్మము హనాన్యేలు శిఖరము, శతశిఖరము, గొర్రెల ద్వారం దాటి చివరకు కావలి ద్వారం దగ్గర ఆగారు. అటు తర్వాత, ఆ గాయక బృందాలు రెండూ దేవుని ఆలయంలో తమ తమ స్థానాలకు చేరుకున్నాయి. నేను నా స్థానంలో నిలిచాను. అధికారుల్లో సగంమంది ఆలయంలో తమతమ స్థానాల్లో నిలబడ్డారు. తర్వాత ఈ క్రింది యాజకులు ఎల్యాకీము, మయశేయా, మిన్యామీను, మీకాయ, ఎల్యోయెనై, జెకర్యా, హనన్యా బూరలు పట్టుకుని తమతమ స్థానాల్లో నిలిచారు. తర్వాత, మయశేయా, షెమయా, ఎలియాజరు, ఉజ్జీ, యెహోహానాను, మల్కీయా, ఏలాము, ఏజెరు అనే యాజకులు ఆలయంలో తమతమ స్థానాల్లో నిలబడ్డారు. అప్పుడు రెండు గాయక బృందాలూ ఇజ్రహాయా నాయకత్వాన పాడనారంభించాయి. ఈ విధంగా, ఆ ప్రత్యేక దినాన యాజకులు చాలా బలులు అర్పించారు. ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా వున్నారు. దేవుడే వారందరినీ ఆనందపరవశుల్ని చేశాడు. చివరకు స్త్రీలు, పిల్లలు సైతం మహోత్సాహంతో, ఆనందంలో తేలియాడారు. దూర ప్రాంతాలవారు సైతం యెరూషలేము నుంచి వెలువడే ఆనంద కోలాహలాన్ని వినగలిగారు.
నెహెమ్యా 12:27-43 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్రగీతములతోను పాటలతోను స్వరమండల సితారా చేయి తాళములతోను సంతోషముగా జరిగించునట్లు లేవీయులను తమ సకల స్థలములలోనుండి యెరూషలేమునకు రప్పించుటకు పూను కొనిరి అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టునున్న మైదాన భూమిలోనుండియు నెటోపాతియొక్క గ్రామములలోనుండియు కూడుకొని వచ్చిరి. మరియు గిల్గాలుయొక్క యింటిలోనుండియు, గెబయొక్కయు అజ్మావెతుయొక్కయు పొలములలోనుండియు జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టును గాయకులు తమకు ఊళ్లను కట్టుకొని యుండిరి. యాజకులును లేవీయులును తమ్మును తాము పవిత్రపరచుకొనిన తరువాత జనులను గుమ్మములను ప్రాకారమును పవిత్రపరచిరి. అటుతరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారముమీదికి తోడుకొని వచ్చి స్తోత్రగీతములు పాడువారిని రెండు గొప్ప సమూహములుగా ఏర్పరచితిని. అందులో ఒక సమూహము కుడిప్రక్కను పెంట గుమ్మము వైపున ప్రాకారముమీదను నడిచెను. వారివెంబడి హోషయాయును యూదుల ప్రధానులలో సగముమందియును వెళ్లిరి. మరియు అజర్యాయు ఎజ్రాయు మెషుల్లామును యూదాయు బెన్యామీనును షెమ యాయును యిర్మీయాయు అనువారు పోయిరి. యాజకుల కుమారులలో కొందరు బాకాలు ఊదుచు పోయిరి; వారెవరనగా, ఆసాపు కుమారుడైన జక్కూరునకు పుట్టిన మీకాయా కనిన మత్తన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానునకు పుట్టిన జెకర్యాయు అతని బంధువులగు షెమయా అజరేలు మిలలై గిలలై మాయి నెతనేలు యూదా హనానీ అనువారు. వీరు దైవజనుడగు దావీదుయొక్క వాద్యములను వాయించుచు పోయిరి; వారి ముందర శాస్త్రియగు ఎజ్రాయును నడిచెను. వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మముదగ్గర దావీదుపురముయొక్క మెట్లమీద దావీదు నగరును దాటి ప్రాకారము వెంబడి తూర్పువైపు నీటి గుమ్మమువరకు పోయిరి. స్తోత్రగీతములు పాడువారి రెండవ సమూహము వారికి ఎదురుగా నడిచెను, వారివెంబడి నేనును వెళ్లితిని. ప్రాకారముమీదనున్న సగముమంది కొలుముల గోపురము అవతలనుండి వెడల్పు ప్రాకారమువరకు వెళ్లిరి. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతలనుండియు, పాత గుమ్మము అవతలనుండియు, మత్స్యపు గుమ్మము అవతల నుండియు, హనన్యేలు గోపురమునుండియు, మేయా గోపురమునుండియు, గొఱ్ఱెల గుమ్మమువరకు వెళ్లి బందీ గృహపు గుమ్మములో నిలిచిరి. ఆప్రకారమే దేవుని మందిరములో స్తోత్రగీతములు పాడువారి రెండు సమూహములును నేనును, నాతోకూడ ఉన్న అధికారులలో సగముమందియు నిలిచియుంటిమి. యాజకులగు ఎల్యాకీము మయశేయా మిన్యామీను మీకాయా ఎల్యోయేనై జెకర్యా హనన్యా బాకాలు పట్టుకొనిరి. ఇజ్రహయా అనువాడు నడిపింపగా మయశేయా షెమయా ఎలియాజరు ఉజ్జీ యెహోహానాను మల్కీయా ఏలాము ఏజెరులను గాయకులు బిగ్గరగా పాడిరి. మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసెనని ఆ దినమునవారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడ సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహు దూరమునకు వినబడెను.