మత్తయి 21:23-27

మత్తయి 21:23-27 TELUBSI

ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధానయాజకులును ప్రజల పెద్దలును ఆయనయొద్దకు వచ్చి ఏ అధికారమువలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారమెవడు నీకిచ్చెనని అడుగగా – యేసు నేనును మిమ్ము నొక మాట అడుగుదును; అది మీరు నాతో చెప్పినయెడల, నేనును ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడనుండి కలిగినది? పరలోకమునుండి కలిగినదా, మనుష్యులనుండి కలిగినదా? అని వారినడిగెను. వారు–మనము పరలోకము నుండి అని చెప్పితిమా, ఆయన–ఆలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలనడుగును; మనుష్యులవలననని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము; అందరు యోహానును ప్రవక్త అని యెంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని–మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి అందుకాయన ఏ అధికారమువలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను.