మత్తయి 21:23-27
మత్తయి 21:23-27 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యేసు దేవాలయ ఆవరణంలో ప్రవేశించి, ఆయన బోధిస్తున్నప్పుడు, ముఖ్య యాజకులు, ప్రజానాయకులు ఆయన దగ్గరకు వచ్చారు. వారు, “నీవు ఏ అధికారంతో ఈ కార్యాలను చేస్తున్నావు? నీకు ఈ అధికారం ఎవరిచ్చారు?” అని అడిగారు. అందుకు యేసు, “నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు సమాధానం చెప్పండి, అప్పుడు ఏ అధికారంతో నేను వీటిని చేస్తున్నానో మీకు చెప్తాను. యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఎక్కడ నుండి కలిగింది, పరలోకం నుండి కలిగిందా? లేదా మానవుల నుండి కలిగిందా?” అని వారిని అడిగారు. వారు తమలో తాము చర్చించుకొంటూ అనుకున్నారు, “ఒకవేళ మనం ‘పరలోకం నుండి కలిగింది’ అని చెప్పితే ‘మరి మీరు ఎందుకు అతన్ని నమ్మలేదు’ అని అడుగుతాడు. ఒకవేళ మనం, ‘మనుష్యుల వలన’ అని చెప్తే, ప్రజలందరు యోహానును ప్రవక్త అని నమ్ముతున్నారు, కాబట్టి మనం వారికి భయపడుతున్నాం” అని తమలో తాము చర్చించుకొన్నారు. అందుకు వారు, “మాకు తెలియదు” అని యేసుకు జవాబిచ్చారు. అందుకు యేసు, “నేను కూడా ఏ అధికారంతో ఈ పనులను చేస్తున్నానో మీతో చెప్పను” అన్నారు.
మత్తయి 21:23-27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి, “ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?” అని అడిగారు. యేసు, “నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?” అని వారిని అడిగాడు. అప్పుడు వారు, “మనం పరలోకం నుండి, అని చెబితే, ‘మీరెందుకు యోహానును నమ్మలేదు?’ అంటాడు. మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది అని తమలో తాము చర్చించుకుని, “మాకు తెలియదు” అన్నారు. అప్పుడాయన “అలాగైతే నేను ఏ అధికారంతో ఇవి చేస్తున్నానో కూడా చెప్పను” అన్నాడు.
మత్తయి 21:23-27 పవిత్ర బైబిల్ (TERV)
యేసు మందిరానికి వెళ్ళి బోధిస్తుండగా ప్రధాన యాజకులు, పెద్దలు వచ్చి, “ఏ అధికారంతో నీవు ఈ పనులు చేస్తున్నావు? నీకి అధికారం ఎవరిచ్చారు?” అని అడిగారు. యేసు సమాధానం చెబుతూ, “నేను కూడా మిమ్మల్నొక ప్రశ్న అడుగుతాను. మీరు దానికి సమాధానం చెబితే నేను ఇది ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెబుతాను. బాప్తిస్మమివ్వమని యోహానును ఎవరు పంపారు? దేవుడా? మానవులా?” అని అడిగాడు. వాళ్ళు, “‘దేవుడు’ అని సమాధానం చెబితే మరి అలాగైతే అతణ్ణి ఎందుకు నమ్మలేదు? అని అంటాడు ‘మానవులు’ అని సమాధానం ఇస్తే ప్రజలందరూ యోహాను ఒక ప్రవక్త అని నమ్మేవాళ్ళు కనుక వాళ్ళు ఏం చేస్తారో” అనే భయంతో పరస్పరం మాట్లాడుకొన్నారు. అందువల్ల వాళ్ళు, “మాకు తెలియదు” అని సమాధానం చెప్పారు. ఆయన, “నేను కూడా ఎవరిచ్చిన అధికారంతో యివి చేస్తున్నానో మీకు చెప్పను” అని అన్నాడు.
మత్తయి 21:23-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధానయాజకులును ప్రజల పెద్దలును ఆయనయొద్దకు వచ్చి ఏ అధికారమువలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారమెవడు నీకిచ్చెనని అడుగగా – యేసు నేనును మిమ్ము నొక మాట అడుగుదును; అది మీరు నాతో చెప్పినయెడల, నేనును ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడనుండి కలిగినది? పరలోకమునుండి కలిగినదా, మనుష్యులనుండి కలిగినదా? అని వారినడిగెను. వారు–మనము పరలోకము నుండి అని చెప్పితిమా, ఆయన–ఆలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలనడుగును; మనుష్యులవలననని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము; అందరు యోహానును ప్రవక్త అని యెంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని–మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి అందుకాయన ఏ అధికారమువలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను.