యెహోషువ 6:6-14

యెహోషువ 6:6-14 TELUBSI

నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి–మీరు నిబంధనమందసమును ఎత్తికొని మోయుడి; ఏడుగురు యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని నడువవలెనని వారితో చెప్పెను. మరియు అతడు–మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు, యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలెననియు ప్రజలతో చెప్పెను. యెహోషువ ప్రజల కాజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు, ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధనమందసమును వారివెంట నడిచెను. యోధులు బూరల నూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలను ఊదుచుండిరి. మరియు యెహోషువ–మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినమువరకు మీరు కేకలువేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటనుండి యే ధ్వనియు రావలదు, నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలెనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని యొకమారు దానిచుట్టు తిరిగిన తరువాత వారు పాళెములో చొచ్చి రాత్రి పాళెములో గడిపిరి. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తికొని మోసిరి. ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని, నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి, యోధులు వారికి ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడివచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలు ఊదుచు వచ్చిరి. అట్లు రెండవదినమున వారొకమారు పట్టణము చుట్టు తిరిగి పాళెమునకు మరల వచ్చిరి. ఆరుదినములువారు ఆలాగు చేయుచువచ్చిరి.