యెహోషువ 6:6-14
యెహోషువ 6:6-14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కాబట్టి నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిచి వారితో, “మీరు యెహోవా నిబంధన మందసాన్ని ఎత్తుకుని దాని ముందు ఏడుగురు యాజకులు బూరలు పట్టుకుని నడవాలి” అని ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత అతడు, “పదండి ముందుకు! యెహోవా మందసం ముందు ఆయుధాలు ధరించిన వీరులు నడుస్తుండగా పట్టణం చుట్టూ తిరగాలి” అని ఆజ్ఞ ఇచ్చాడు. యెహోషువ ప్రజలతో మాట్లాడినప్పుడు, ఏడుగురు యాజకులు యెహోవా సన్నిధిని ఏడు బూరలను మోస్తూ, బూరలు పట్టుకుని వాటిని ఊదుతూ ముందుకు సాగుతూ ఉండగా, యెహోవా నిబంధన మందసం వారి వెంట వెళ్లింది. ఆయుధాలు ధరించిన వీరులు బూరలు ఊదుతున్న యాజకుల ముందు నడుస్తుండగా, వెనుక ఉన్న వీరులు మందసం వెనుక నడిచారు. ఆ సమయమంతా యాజకులు బూరలు ఊదుతూనే ఉన్నారు. కానీ యెహోషువ, “యుద్ధపు కేక వేయవద్దు, మీ స్వరాలు ఎత్తవద్దు, నేను మీకు అరవమని చెప్పే రోజు వరకు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. నేను చెప్పినప్పుడు అరవండి!” అని సైన్యానికి ఆజ్ఞ ఇచ్చాడు. అలా అతడు యెహోవా మందసాన్ని మోసుకొని పట్టణం చుట్టూ ఒకసారి తిరిగేలా చూశాడు. తర్వాత సైన్యం శిబిరానికి తిరిగివచ్చి రాత్రి అక్కడ గడిపింది. యెహోషువ మరుసటిరోజు ఉదయాన్నే లేవగా, యాజకులు, యాజకులు యెహోవా మందసాన్ని ఎత్తుకున్నారు. ఆ ఏడుగురు యాజకులు ఏడు బూరలను పట్టుకుని యెహోవా మందసం ముందు నడుస్తూ బూరలు ఊదుతూ ఉన్నారు. బూరధ్వని వినబడుతూ ఉండగా, ఆయుధాలు ధరించిన వీరులు వారికి ముందు వెళ్తుండగా, వెనుక ఉన్న వీరులు యెహోవా మందసం వెనుక వెళ్లారు. రెండవ రోజున కూడా వారు పట్టణం చుట్టూ ఒకసారి తిరిగి, శిబిరానికి తిరిగి వచ్చారు. అలా వారు ఆరు రోజులపాటు చేశారు.
యెహోషువ 6:6-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నూను కుమారుడు యెహోషువ యాజకులను పిలిపించి “మీరు నిబంధన మందసాన్ని ఎత్తుకుని మోయండి. ఏడుగురు యాజకులు యెహోవా మందసానికి ముందుగా ఏడు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని నడవాలి” అని వారితో చెప్పాడు. తరువాత అతడు “మీరు ముందుకు వెళ్ళి పట్టణం చుట్టూ ముట్టడి వేయండి, యోధులు యెహోవా మందసానికి ముందుగా నడవండి” అని ప్రజలతో చెప్పాడు. యెహోషువ ప్రజలకాజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు, ఏడు పొట్టేలు కొమ్ము బూరలు యెహోవా సన్నిధిని పట్టుకుని ముందుకు వెళ్తూ, ఆ బూరలు ఊదుతుండగా యెహోవా నిబంధన మందసం కూడా వారి వెంట నడిచింది. యోధులు బూరలు ఊదుతున్న యాజకులకు ముందుగా నడిచారు. సైన్యం వెనక భాగం మందసం వెంట వచ్చింది. యాజకులు వెళ్తూ బూరలు ఊదుతున్నారు. యెహోషువ “మీరు కేకలు వేయండి అని నేను మీతో చెప్పే రోజు వరకూ మీరు కేకలు వేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటి నుండి ఏ శబ్దమూ రాకూడదు. నేను చెప్పినప్పుడు మాత్రమే మీరు కేకలు వేయాలి” అని ప్రజలకి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ విధంగా యెహోవా మందసం ఆ పట్టణం చుట్టూ ఒకసారి తిరిగిన తరువాత వారు శిబిరంలోకి వెళ్ళి రాత్రి గడిపారు. యెహోషువ ఉదయాన్నే లేచిన వెంటనే యాజకులు యెహోవా మందసాన్ని ఎత్తికుని మోశారు. ఏడుగురు యాజకులు ఏడు పొట్టేలుకొమ్ము బూరలు పట్టుకుని, ఆపకుండా యెహోవా మందసానికి ముందుగా నడుస్తూ బూరలు ఊదుతూ వచ్చారు. యోధులు వారికి ముందు నడిచారు. వెనక ఉన్న సైనికులు యెహోవా మందసాన్ని వెంబడిస్తూ వచ్చారు. యాజకులు వెళ్తూ మానకుండా బూరలు ఊదుతూ వచ్చారు. ఆ విధంగా రెండవ రోజు వారు ఒకసారి పట్టణం చుట్టూ తిరిగి వారి శిబిరానికి మరలి వచ్చారు. ఆరు రోజులు వారు ఆ విధంగా చేస్తూ వచ్చారు.
యెహోషువ 6:6-14 పవిత్ర బైబిల్ (TERV)
కనుక నూను కుమారుడైన యెహోషువ యాజకులందర్నీ సమావేశపర్చాడు. “యెహోవా పవిత్ర పెట్టెను మోయండి. ఏడుగురు యాజకులు బూరలు మోయాలని చెప్పండి. ఆ యాజకులు పవిత్ర పెట్టెకు ముందుగా నడవాలి” అని యెహోషువ వారితో చెప్పాడు. “ఇప్పుడు బయల్దేరండి. పట్టణం చుట్టూ నడవండి. ఆయుధాలు ధరించిన సైనికులు యెహోవా పవిత్ర పెట్టె ఎదుట నడవాలి” అని యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించాడు. యెహోషువ ప్రజలతో మాట్లాడటం ముగించగానే, ఏడుగురు యాజకులు యెహోవా సన్నిధిని నడవటం మొదలుబెట్టారు. ఏడు బూరలను వారు మోసుకొని వెళ్లారు. వారు నడుస్తూ ఉన్నప్పుడు బూరలు ఊదారు. యెహోవా పవిత్ర పెట్టెను మోసే వారు వారి వెనుక నడిచారు. ఆయుధాలు ధరించిన సైనికులు యాజకులకు ముందుగా నడిచారు. పవిత్ర పెట్టె వెనుక నడుస్తున్నవాళ్లు బూరలు ఊదారు. అయితే యుద్ధనాదం చేయవద్దని యెహోషువ ప్రజలతో చెప్పాడు. “కేకలు వేయకండి. నేను మీతో చెప్పే రోజు వరకు ఒక్క మాటకూడ పలుకకండి. తరువాత మీరు కేకలు వేయవచ్చు” అన్నాడు యోహోషువ. కనుక యెహోవా పవిత్ర పెట్టెను పట్టణంచుట్టూ ఒక్కసారి యాజకులచేత యెహోషువ మోయించాడు. తర్వాత వారు వారి బసకు వెళ్లి ఆ రాత్రి అక్కడే గడిపారు. మర్నాటి ఉదయాన్నే యెహోషువ లేచాడు. యాజకులు యెహోవా పవిత్ర పెట్టెను మరలా మోసారు. మరియు యాజకులు ఏడుగురు ఏడు బూరలు మోసారు. యెహోవా పవిత్ర పెట్టె ఎదుట వారు నడుస్తూ బూరలు ఊదారు. ఆయుధాలు ధరించిన సైనికులు వారికి ముందుగా నడిచారు. యెహోవా పవిత్ర పెట్టె వెనుక నడిచే యాజకులు నడుస్తూ, బూరలు ఊదారు. కనుక రెండో రోజున వాళ్లంతా పట్టణం చుట్టూ ఒక మారు ప్రదక్షిణం చేసారు. ఆ తర్వాత వాళ్లు తిరిగి వారి బసకు వెళ్లిపోయారు. ఆరు రోజులపాటు వారు ఇలానే ప్రతిరోజూ చేసారు.
యెహోషువ 6:6-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి–మీరు నిబంధనమందసమును ఎత్తికొని మోయుడి; ఏడుగురు యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని నడువవలెనని వారితో చెప్పెను. మరియు అతడు–మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు, యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలెననియు ప్రజలతో చెప్పెను. యెహోషువ ప్రజల కాజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు, ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధనమందసమును వారివెంట నడిచెను. యోధులు బూరల నూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలను ఊదుచుండిరి. మరియు యెహోషువ–మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినమువరకు మీరు కేకలువేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటనుండి యే ధ్వనియు రావలదు, నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలెనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని యొకమారు దానిచుట్టు తిరిగిన తరువాత వారు పాళెములో చొచ్చి రాత్రి పాళెములో గడిపిరి. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తికొని మోసిరి. ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని, నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి, యోధులు వారికి ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడివచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలు ఊదుచు వచ్చిరి. అట్లు రెండవదినమున వారొకమారు పట్టణము చుట్టు తిరిగి పాళెమునకు మరల వచ్చిరి. ఆరుదినములువారు ఆలాగు చేయుచువచ్చిరి.