నిర్గమకాండము 4:1-9

నిర్గమకాండము 4:1-9 TELUBSI

అందుకు మోషే–చిత్తగించుము; వారు నన్ను నమ్మరు నా మాట వినరు–యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా యెహోవా–నీ చేతిలోనిది ఏమిటి అని అతని నడిగెను. అందుకతడు–కఱ్ఱ అనెను. అప్పుడాయన–నేలను దాని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా–నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతనిచేతిలో కఱ్ఱ ఆయెను. ఆయన –దానిచేత వారు తమపితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయెనని నమ్ముదురనెను. మరియు యెహోవా–నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొను మనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠముగలదై హిమమువలె తెల్లగా ఆయెను. తరువాత ఆయన–నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్మునుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరమువలె ఆయెను. మరియు ఆయన–వారు నిన్ను నమ్మక, మొదటి సూచననుబట్టి వినకపోయినయెడల రెండవ దానిబట్టి విందురు. వారు ఈ రెండు సూచనలనుబట్టి నమ్మక నీమాట వినకపోయినయెడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి యెండిన నేలమీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలోనుండి తీసిన నీళ్లు పొడినేలమీద రక్తమగుననెను.

నిర్గమకాండము 4:1-9 కోసం వీడియో