నిర్గమకాండము 16:14-26
నిర్గమకాండము 16:14-26 TELUBSI
పడిన ఆ మంచు ఇగిరిపోయిన తరువాత నూగుమంచువలె సన్నని కణములు అరణ్యపు భూమిమీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక–ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే–ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించిన దేమనగా–ప్రతివాడును తనవారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరుచొప్పున దాని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములోనున్నవారికొరకు కూర్చుకొనవలెననెను. ఇశ్రాయేలీయులు అట్లుచేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనినవానికి ఎక్కువగా మిగులలేదు తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువకాలేదు. వారు తమతమ యింటివారి భోజనమునకు సరిగా కూర్చుకొనియుండిరి. మరియు మోషే–దీనిలో ఏమియు ఉదయమువరకు ఎవరును మిగుల్చు కొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయమువరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగుపెట్టి కంపుకొట్టెను. మోషే వారిమీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన యింటివారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను. ఆరవదినమునవారు ఒక్కొక్కనికి రెండేసి ఓమెరుల చొప్పున రెండంతలు ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజముయొక్క అధికారులందరు వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకు అతడు–యెహోవా చెప్పినమాట యిది; రేపు విశ్రాంతిదినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతిదినము, మీరు కాల్చుకొన వలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండు కొనుడి, ఉదయమువరకు మిగిలినదంతయు మీకొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను. మోషే ఆజ్ఞాపించి నట్లువారు ఉదయమువరకు దానిని ఉంచుకొనిరి, అది కంపుకొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే–నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతిదినము, నేడు అది బయట దొరకదు. ఆరు దినములు దాని కూర్చుకొనవలెను, విశ్రాంతిదినమున అనగా ఏడవదినమున అది దొరకదనెను.

