1 రాజులు 12:16-24

1 రాజులు 12:16-24 TELUBSI

కాబట్టి ఇశ్రాయేలువారందరును రాజు తమ విన్నపమును వినలేదని తెలిసికొని రాజుకీలాగు ప్రత్యుత్తరమిచ్చిరి– దావీదులో మాకు భాగమేది? యెష్షయి కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు; ఇశ్రాయేలువారలారా, మీమీ గుడారములకు పోవుడి; దావీదు సంతతివారలారా, మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారములకు వెళ్లిపోయిరి. అయితే యూదా పట్ణణములలోనున్న ఇశ్రాయేలువారిని రెహబాము ఏలెను. తరువాత రాజైన రెహబాము వెట్టిపనివారిమీద అధికారియైన అదోరామును పంపగా ఇశ్రాయేలువారందరును రాళ్లతో అతని కొట్టినందున అతడు మరణమాయెను, కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవలెనని తన రథముమీద త్వరగా ఎక్కెను. ఈ ప్రకారము ఇశ్రాయేలువారు నేటివరకు జరుగుచున్నట్లు దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసిరి. మరియు యరొబాము తిరిగి వచ్చెనని ఇశ్రాయేలు వారందరు విని, సమాజముగా కూడి, అతని పిలువనంపించి ఇశ్రాయేలువారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి; యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతివారిని వెంబడించినవా రెవరును లేకపోయిరి. రెహబాము యెరూషలేమునకు వచ్చిన తరువాత ఇశ్రాయేలువారితో యుద్ధముచేసి, రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరల వచ్చునట్లు చేయుటకై యూదావారందరిలోనుండియు బెన్యామీను గోత్రీయులలోనుండియు యుద్ధప్రవీణులైన లక్షయెనుబది వేలమందిని పోగు చేసెను. అంతట దేవుని వాక్కు దైవజనుడగు షెమయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నీవు సొలొమోను కుమారుడును యూదా రాజునైన రెహబాముతోను యూదావారందరితోను బెన్యామీనీయులందరితోను శేషించినవారందరితోను ఇట్లనుము –యెహోవా సెలవిచ్చునదేమనగా–జరిగినది నావలననే జరిగెను; మీరు ఇశ్రాయేలువారగు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్లక, అందరును మీ మీ యిండ్లకు తిరిగి పోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానినిబట్టి యుద్ధమునకు పోక నిలిచిరి.