1 రాజులు 12:16-24

1 రాజులు 12:16-24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

రాజు తమ మాట అంగీకరించలేదని తెలుసుకున్న ఇశ్రాయేలీయులంతా రాజుకు ఇలా జవాబిచ్చారు: “దావీదులో మాకేం భాగం ఉంది, యెష్షయి కుమారునిలో మాకేం స్వాస్థ్యం ఉంది? ఇశ్రాయేలీయులారా, మీ గుడారాలకు వెళ్లిపొండి! దావీదూ, నీ సొంత ఇంటి సంగతి చూసుకో!” కాబట్టి ఇశ్రాయేలీయులు తమ గుడారాలకు వెళ్లిపోయారు. కాని యూదా పట్టణాల్లో నివసించే ఇశ్రాయేలీయుల మీద మాత్రం రెహబాము పరిపాలన చేశాడు. రాజైన రెహబాము వెట్టి పనివారి మీద అధికారిగా ఉన్న అదోనిరామును పంపాడు, కాని ఇశ్రాయేలు వారంతా అతన్ని రాళ్లతో కొట్టి చంపారు. అయితే రాజైన రెహబాము తప్పించుకుని తన రథమెక్కి యెరూషలేముకు పారిపోయాడు. కాబట్టి నేటికీ ఇశ్రాయేలీయులు దావీదు వంశం మీద తిరుగబడుతూనే ఉన్నారు. యరొబాము ఈజిప్టు నుండి తిరిగి వచ్చాడని ఇశ్రాయేలీయులంతా విని, వారు సమావేశమై అతన్ని పిలిపించి, అతన్ని ఇశ్రాయేలంతటి మీద రాజుగా నియమించారు. యూదా గోత్రం వారు మాత్రమే దావీదు వంశానికి నమ్మకంగా ఉన్నారు. రెహబాము యెరూషలేము చేరుకొని యూదా బెన్యామీను గోత్రాల వారినందరిని, అనగా 1,80,000 మంది ఉత్తములైన సైనికులను పోగుచేసుకుని, ఇశ్రాయేలు మీద యుద్ధం చేసి, సొలొమోను కుమారుడైన రెహబాముకు రాజ్యాన్ని తిరిగి సంపాదించాలని అనుకున్నాడు. అయితే దైవజనుడైన షెమయాకు దేవుని నుండి ఈ వాక్కు వచ్చింది: “సొలొమోను కుమారుడును యూదా రాజైన రెహబాముతో, యూదా, బెన్యామీను వారందరితో, మిగితా ప్రజలతో, ‘యెహోవా చెప్పే మాట ఇదే: మీరు మీ సోదరులైన ఇశ్రాయేలీయులతో యుద్ధానికి వెళ్లకండి. ఇది నేను చేస్తున్నది కాబట్టి మీరంతా ఇళ్ళకు వెళ్లండి.’ ” కాబట్టి వారు యెహోవా మాట విని, యెహోవా ఆదేశించినట్లు తమ ఇళ్ళకు తిరిగి వెళ్లారు.

1 రాజులు 12:16-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కాబట్టి ఇశ్రాయేలు వారంతా రాజు తమ విన్నపం వినలేదని తెలుసుకుని రాజుకిలా బదులిచ్చారు: “దావీదు వంశంతో మాకేం సంబంధం? యెష్షయి కొడుకుతో మాకు వారసత్వం ఏముంది? ఇశ్రాయేలు ప్రజలారా, మీ మీ గుడారాలకు వెళ్ళండి. దావీదు వంశమా, నీ వంశం సంగతి నువ్వే చూసుకో.” ఇలా చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారాలకు వెళ్లిపోయారు. అయితే యూదా పట్టణాల్లో ఉన్న ఇశ్రాయేలు వారిని రెహబాము పాలించాడు. తరువాత రెహబాము రాజు వెట్టిపనివారి మీద అధికారి అదోరామును ఇశ్రాయేలు వారి దగ్గరికి పంపాడు. ఇశ్రాయేలు వారంతా అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. రెహబాము రాజు తన రథం మీద వెంటనే యెరూషలేము పారిపోయాడు. ఈ విధంగా ఇశ్రాయేలువారు ఇప్పటికీ దావీదు వంశం మీద తిరగబడుతూనే ఉన్నారు. యరొబాము తిరిగి వచ్చాడని ఇశ్రాయేలు వారంతా విని, సమాజంగా కూడి, అతన్ని పిలిపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేశారు. యూదా గోత్రం వాళ్ళు తప్ప దావీదు సంతానాన్ని వెంబడించిన వారెవరూ లేకపోయారు. రెహబాము యెరూషలేము చేరుకున్న తరువాత ఇశ్రాయేలు వారితో యుద్ధం చేశాడు. రాజ్యం సొలొమోను కొడుకు రెహబాము అనే తనకు మళ్ళీ వచ్చేలా చేయడానికి అతడు యూదా వారందరిలో నుండి, బెన్యామీను గోత్రికుల్లోనుండి యుద్ధ ప్రవీణులైన 1, 80,000 మందిని సమకూర్చాడు. కానీ దేవుడు షెమయా ప్రవక్తతో ఇలా చెప్పాడు. “నీవు సొలొమోను కొడుకు, యూదా రాజు అయిన రెహబాముతో, యూదా గోత్రం వారితో బెన్యామీనీయులందరితో, మిగిలిన ప్రజలందరితో ఇలా చెప్పు, యెహోవా చెప్పేదేమిటంటే, జరిగినది నేనే జరిగించాను. మీరు ఇశ్రాయేలు ప్రజలైన మీ సోదరులతో యుద్ధం చేయడానికి వెళ్లకుండా అందరూ మీ ఇళ్ళకు తిరిగి వెళ్ళిపొండి.” కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి, యుద్ధానికి వెళ్ళకుండా ఆగిపోయారు.

1 రాజులు 12:16-24 పవిత్ర బైబిల్ (TERV)

ఇశ్రాయేలీయులంతా కొత్త రాజు తమ అభ్యర్థన వినలేదని గమనించారు. అందువల్ల ప్రజలు ఇలా అన్నారు: “మనం దావీదు వంశానికి చెందినవారమా? కాదు, యెష్షయి రాజ్యంలో మనకేమైనా వస్తుందా? రాదు! కావున ఇశ్రాయేలు సోదరులారా, మనమంతా మన ఇండ్లకు పోదాం పదండి, దావీదు కుమారుణ్ణి తన ప్రజలను ఏలుకోనీయండి!” తరువాత ఇశ్రాయేలీయులందరూ తమ తమ ఇండ్లకు వెళ్లపోయారు. అయినా రెహబాము యూదా నగరాలలో ఉన్న ఇశ్రాయేలీయులందరినీ ఏలాడు. కూలిపని చేసే వారిపై అదోరాము అనునతడు అధికారిగా వుండేవాడు. రాజైన రెహబాము అదోరామును ప్రజలతో మాట్లాడేటందుకు పంపాడు. కాని ఇశ్రాయేలీయులు వానిని రాళ్లతో కొట్టి చంపేశారు. అది విని రాజైన రెహబాము తన రథమెక్కి యెరూషలేముకు తప్పించుకుపోయాడు. అలా ఇశ్రాయేలీయులు దావీదు వంశంపై తిరుగుబాటు చేశారు. వారు ఈనాటికీ దావీదు వంశానికి వ్యతిరేకులుగానే వున్నారు. యరొబాము తిరిగి వచ్చినట్లు ఇశ్రాయేలీయులు విన్నారు. కావున వారతనిని ఒక సభకు ఆహ్వానించి, ఇశ్రాయేలంతటికీ రాజుగా చేశారు. యూదాగోత్రం వారొక్కరు మాత్రమే దావీదు కుటుంబాన్ని అనుసరించారు. రెహబాము యెరూషలేముకు తిరిగి వెళ్లాడు. అతడు యూదా గోత్రపువారిని బెన్యామీను గోత్రపు వారిని సమావేశపరిచాడు. వారిని ఒక లక్షా ఎనుబదివేల మందిగల ఒక సైన్యంగా తయారు చేశాడు. రెహబాము ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయ సంకల్పించాడు. తన రాజ్యాన్ని తిరిగి సంపాదించాలని అతని కోరిక. కాని యెహోవా ఒక దైవజ్ఞుని (ప్రవక్త) తో మాట్లాడాడు. అతని పేరు షెమయా. యెహోవా ఆ ప్రవక్తతో ఇలా అన్నాడు: “నీవు వెళ్లి సొలొమోను కుమారుడు, యూదా రాజు అయిన రెహబాముతోను, మరియు యూదా బెన్యామీను ప్రజలతోను మాట్లాడు. మీ సోదరుల మీదికి మీరు యుద్ధానికి వెళ్లవద్దని నా మాటగా వారికి చెప్పు ‘మీలో ప్రతి ఒక్కడూ ఇంటికి వెళ్లాలి. ఇవన్నీ జరిగేలా నేనే చేశాను.’ ఈ విషయం యెహోవా మీకు తెలియ చేయమన్నాడని చెప్పు.” ప్రవక్త వెళ్లి చెప్పగా రెహబాము సైన్యంలోని వారంతా విని యెహోవా ఆజ్ఞ శిరసాపహించారు. వారు ఇండ్లకు వెళ్లారు.

1 రాజులు 12:16-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

కాబట్టి ఇశ్రాయేలువారందరును రాజు తమ విన్నపమును వినలేదని తెలిసికొని రాజుకీలాగు ప్రత్యుత్తరమిచ్చిరి– దావీదులో మాకు భాగమేది? యెష్షయి కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు; ఇశ్రాయేలువారలారా, మీమీ గుడారములకు పోవుడి; దావీదు సంతతివారలారా, మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారములకు వెళ్లిపోయిరి. అయితే యూదా పట్ణణములలోనున్న ఇశ్రాయేలువారిని రెహబాము ఏలెను. తరువాత రాజైన రెహబాము వెట్టిపనివారిమీద అధికారియైన అదోరామును పంపగా ఇశ్రాయేలువారందరును రాళ్లతో అతని కొట్టినందున అతడు మరణమాయెను, కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవలెనని తన రథముమీద త్వరగా ఎక్కెను. ఈ ప్రకారము ఇశ్రాయేలువారు నేటివరకు జరుగుచున్నట్లు దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసిరి. మరియు యరొబాము తిరిగి వచ్చెనని ఇశ్రాయేలు వారందరు విని, సమాజముగా కూడి, అతని పిలువనంపించి ఇశ్రాయేలువారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి; యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతివారిని వెంబడించినవా రెవరును లేకపోయిరి. రెహబాము యెరూషలేమునకు వచ్చిన తరువాత ఇశ్రాయేలువారితో యుద్ధముచేసి, రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరల వచ్చునట్లు చేయుటకై యూదావారందరిలోనుండియు బెన్యామీను గోత్రీయులలోనుండియు యుద్ధప్రవీణులైన లక్షయెనుబది వేలమందిని పోగు చేసెను. అంతట దేవుని వాక్కు దైవజనుడగు షెమయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నీవు సొలొమోను కుమారుడును యూదా రాజునైన రెహబాముతోను యూదావారందరితోను బెన్యామీనీయులందరితోను శేషించినవారందరితోను ఇట్లనుము –యెహోవా సెలవిచ్చునదేమనగా–జరిగినది నావలననే జరిగెను; మీరు ఇశ్రాయేలువారగు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్లక, అందరును మీ మీ యిండ్లకు తిరిగి పోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానినిబట్టి యుద్ధమునకు పోక నిలిచిరి.