1 రాజులు 11:26-43

1 రాజులు 11:26-43 TELUBSI

మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజుమీదికి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయీమీయుడైన నెబాతు కుమారుడు, ఇతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు. ఇతడు రాజుమీదికి లేచుటకు హేతువేమనగా, సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రియైన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగుచేయుచుండెను. అయితే యరొబాము అను ఇతడు మహా బలాఢ్యుడైయుండగా యౌవనుడగు ఇతడు పనియందు శ్రద్ధగలవాడని సొలొమోను తెలిసికొని, యోసేపు సంతతివారు చేయవలసిన భారమైన పనిమీద అతనిని అధికారిగా నిర్ణయించెను. అంతట యరొబాము యెరూషలేములోనుండి బయలు వెడలిపోగా షిలోనీయుడును ప్రవక్తయునగు అహీయా అతనిని మార్గమందు కను గొనెను; అహీయా క్రొత్తవస్త్రము ధరించుకొని యుండెను, వారిద్దరు తప్ప పొలములో మరి యెవడును లేకపోయెను. అంతట అహీయా తాను ధరించుకొని యున్న క్రొత్త వస్త్రమును పట్టుకొని పండ్రెండు తున కలుగా చింపి యరొబాముతో ఇట్లనెను–ఈ పది తునకలను నీవు తీసికొనుము; ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా–జనులు నన్ను విడిచి పెట్టి అష్తారోతు అను సీదోనీయుల దేవతకును కెమోషు అను మోయాబీయుల దేవతకును మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మ్రొక్కి, సొలొమోను తండ్రియైన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరచిన మార్గములలో నడవకయు నున్నారు గనుక సొలొమోను చేతిలోనుండి రాజ్యమును కొట్టివేసి పది గోత్రములను నీకిచ్చెదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును, నేను యెరూషలేము పట్టణమును కోరుకొనినందునను ఇశ్రాయేలీయుల గోత్రములలోనుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును. రాజ్యము వానిచేతిలోనుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకము చేసికొని అతని దినములన్నియు అతనిని అధికారిగా ఉండనిత్తును. అయితే అతని కుమారుని చేతిలోనుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు పది గోత్రముల నిచ్చెదను; నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా యెదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడు నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చెదను. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక యంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలువారిమీద రాజవై యుందువు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని, నా మార్గముల ననుసరించి నడచుచు, నా దృష్టికి అనుకూలమైనదానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనినయెడల, నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరచినట్లు నిన్నును స్థిరపరచి ఇశ్రాయేలువారిని నీకు అప్పగించెదను. వారు చేసిన క్రియలనుబట్టి నేను దావీదు సంతతివారిని బాధ పరచుదునుగాని నిత్యము బాధింపను. జరిగినదానిని విని సొలొమోను యరొబామును చంప చూడగా యరొబాము లేచి ఐగుప్తుదేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషకునొద్ద చేరి సొలొమోను మరణమగువరకు ఐగుప్తులోనే యుండెను. సొలొమోను చేసిన యితర కార్యములనుగూర్చియు అతడు చేసినదంతటిని గూర్చియు, అతని జ్ఞానమునుగూర్చియు, సొలొమోను కార్యములనుగూర్చిన గ్రంథమందు వ్రాయబడి యున్నది. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరిని ఏలిన కాలము నలువది సంవత్సరములు. అంతట సొలొమోను తన పితరులతోకూడ నిద్రించి, తన తండ్రియైన దావీదు పురమందు సమాధిచేయబడెను; తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయెను.