దాని 6
6
సింహాల గుహలో దానియేలు
1రాజైన దర్యావేషు తన రాజ్య పరిపాలన వ్యవహారాలు నిర్వహించేందుకు 120 మంది అధికారులను నియమించాడు. 2ఆ 120 మందిని పర్యవేక్షించడానికి ముగ్గురు ప్రధానమంత్రులను నియమించాడు. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. దేశానికి, రాజుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ అధికారులు ఈ ప్రధానమంత్రులకు ఎప్పటికప్పుడు లెక్కలు అప్పచెప్పాలని ఆజ్ఞ జారీ చేశాడు. 3దానియేలు శ్రేష్ఠమైన జ్ఞాన వివేకాలు కలిగి ఉండి అధికారుల్లో, ప్రధానమంత్రుల్లో ప్రఖ్యాతి పొందాడు, కనుక అతణ్ణి రాజ్యమంతటిలో ముఖ్యుడుగా నియమించాలని రాజు నిర్ణయించుకున్నాడు.
4అందువల్ల ప్రధానమంత్రులు, అధికారులు రాజ్య పరిపాలన వ్యవహారాల్లో దానియేలుపై ఏదైనా ఒక నేరం ఆరోపించడానికి ఏదైనా కారణం కోసం వెదుకుతూ ఉన్నారు. దానియేలు ఎలాంటి తప్పు, పొరపాటు చేయకుండా రాజ్య పరిపాలన విషయంలో నమ్మకంగా పనిచేస్తూ ఉండడంవల్ల అతనిలో ఎలాంటి దోషం కనిపెట్టలేకపోయారు. 5అప్పుడు వాళ్ళు “దానియేలు తన దేవుణ్ణి పూజించే పద్ధతి విషయంలో తప్ప మరి ఏ విషయంలోనైనా అతనిలో దోషం కనిపెట్టలేము” అనుకున్నారు.
6అప్పుడు ఆ ప్రధానమంత్రులు, అధికారులు రాజు దగ్గరికి గుంపుగా వచ్చారు. వాళ్ళు రాజుతో ఇలా చెప్పారు. “రాజువైన దర్యావేషూ, నువ్వు చిరకాలం జీవిస్తావు గాక. 7ఈ దేశంలోని పాలకులు, ప్రముఖులు, అధికారులు, మంత్రులు, సంస్థానాల అధిపతులు అందరూ సమావేశమై రాజు కోసం ఒక కచ్చితమైన చట్టం సిద్ధం చేసి దాన్ని రాజు ఆజ్ఞగా చాటించాలని ఆలోచన చేశారు. అది ఏమిటంటే దేశంలోని ప్రజల్లో ఎవ్వరూ 30 రోజుల దాకా నీకు తప్ప మరి ఏ ఇతర దేవునికీ, ఏ ఇతర మనిషికీ ప్రార్థన చేయకూడదు. ఎవరైనా ఆ విధంగా చేస్తే వాణ్ణి సింహాల గుహలో పడవేయాలి. అందువల్ల రాజా, ఈ ప్రకారంగా రాయించి రాజ శాసనం సిద్ధం చేయండి. 8మాదీయుల, పారసీకుల ఆచారం ప్రకారం అది స్థిరమైన శాసనంగా ఉండేలా దాని మీద రాజముద్ర వేసి, సంతకం చేయండి” అని విన్నవించుకున్నారు. 9అప్పుడు రాజైన దర్యావేషు శాసనం సిద్ధం చేయించి సంతకం చేశాడు.
10ఇలాంటి ఒక ఆజ్ఞ జారీ అయిందని దానియేలుకు తెలిసినప్పటికీ అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారం యెరూషలేము వైపుకు తెరిచి ఉన్న తన ఇంటి పైగది కిటికీల దగ్గర మోకాళ్ళపై ప్రతిరోజూ మూడుసార్లు తన దేవునికి ప్రార్థన చేస్తూ, స్తుతిస్తూ ఉన్నాడు. 11ఆ వ్యక్తులు గుంపుగా వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయడం, ఆయనను వేడుకోవడం చూశారు. 12రాజు సన్నిధికి వచ్చి రాజు నియమించిన శాసనం విషయం ప్రస్తావించారు. “రాజా, 30 రోజుల వరకూ నీకు తప్ప మరి ఏ దేవునికైనా, మానవునికైనా ఎవ్వరూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా అలా చేసినట్టైతే వాడిని సింహాల గుహలో పడవేస్తామని నువ్వు ఆజ్ఞ ఇచ్చావు గదా” అని అడిగారు. రాజు “మాదీయుల, పారసీకుల ఆచారం ప్రకారం అది స్థిరమైన శాసనం. దాన్ని ఎవ్వరూ అతిక్రమించకూడదు” అని చెప్పాడు. 13అప్పుడు వాళ్ళు “బందీలుగా చెరపట్టిన యూదుల్లో ఉన్న ఆ దానియేలు నిన్నూ నువ్వు నియమించిన శాసనాన్నీ నిర్లక్ష్యం చేసి, ప్రతిరోజూ మూడుసార్లు ప్రార్థన చేస్తున్నాడు” అని ఫిర్యాదు చేశారు.
14ఈ మాట విన్న రాజు ఎంతో మధనపడ్డాడు. దానియేలును ఎలాగైనా రక్షించాలని తన మనస్సులో నిర్ణయించుకున్నాడు. పొద్దుపోయే వరకూ అతణ్ణి విడిపించడానికి ప్రయత్నం చేశాడు. 15ఇది గమనించిన ఆ వ్యక్తులు రాజ మందిరానికి గుంపుగా వచ్చి “రాజా, రాజు నియమించిన ఏ శాసనాన్ని గానీ, తీర్మానాన్ని గానీ ఎవ్వరూ రద్దు చేయకూడదు. ఇది మాదీయుల, పారసీకుల ప్రధాన విధి అని మీరు గ్రహించాలి” అని చెప్పారు. 16రాజు ఆజ్ఞ ఇవ్వగా సైనికులు దానియేలును పట్టుకుని సింహాల గుహలో పడవేశారు. అప్పుడు రాజు “నువ్వు ప్రతిరోజూ తప్పకుండా సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు” అని దానియేలుతో చెప్పాడు.
17ఆ వ్యక్తులు ఒక పెద్ద రాయి తీసుకువచ్చి ఆ గుహ ద్వారం ఎదుట వేసి దాన్ని మూసివేశారు. దానియేలు విషయంలో రాజు తన నిర్ణయం మార్చుకుంటాడేమోనని భావించి, గుహ ద్వారానికి రాజముద్రను, అతని రాజ ప్రముఖుల ముద్రలను వేశారు. 18తరువాత రాజు తన భవనానికి వెళ్ళాడు. ఆ రాత్రి ఆహారం తీసుకోకుండా వినోద కాలక్షేపాల్లో పాల్గొనకుండా ఉండిపోయాడు. ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు.
19తెల్లవారగానే రాజు లేచి త్వర త్వరగా సింహాల గుహ దగ్గరికి వెళ్ళాడు. 20అతడు గుహ దగ్గరికి వచ్చి, దుఃఖ స్వరంతో దానియేలును పిలిచాడు. “జీవం గల దేవుని సేవకుడివైన దానియేలూ, నిత్యం నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా?” అని అతణ్ణి అడిగాడు. 21అందుకు దానియేలు “రాజు చిరకాలం జీవించు గాక. 22నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను. కాబట్టి ఆయన తన దూతను పంపాడు. సింహాలు నాకు ఎలాంటి హానీ చేయకుండ వాటి నోళ్లు మూతపడేలా చేశాడు. రాజా, నీ దృష్టిలో నేను ఎలాంటి నేరం చేయలేదు గదా” అని జవాబిచ్చాడు.
23రాజు చాలా సంతోషించాడు. దానియేలును గుహలో నుండి పైకి తీయమని ఆజ్ఞ ఇచ్చాడు. సైనికులు దానియేలును బయటికి తీశారు. అతడు దేవునిపట్ల భయభక్తులు గలవాడు కావడం వల్ల అతనికి ఎలాంటి ఏ హానీ జరగలేదు. 24దానియేలు మీద నింద మోపిన ఆ వ్యక్తులను, వాళ్ళ భార్య పిల్లలను సింహాల గుహలో పడవేయమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. సైనికులు వాళ్ళను తీసుకువచ్చి సింహాల గుహలో పడవేశారు. వాళ్ళు ఇంకా గుహ అడుగు భాగానికి చేరక ముందే సింహాలు వాళ్ళను పట్టుకున్నాయి. ఎముకలు కూడా మిగలకుండా వాళ్ళను చీల్చిచెండాడాయి.
25అప్పుడు రాజైన దర్యావేషు లోకమంతటా నివసించే ప్రజలకూ జాతులకూ వివిధ భాషలు మాట్లాడే వాళ్ళకూ ఈ విధంగా ప్రకటన రాయించాడు. “మీకందరికీ క్షేమం కలుగు గాక. 26నా సమక్షంలో నిర్ణయం జరిగినట్టుగా, నా రాజ్యంలో ఉన్న సమస్త ప్రాంతాల్లో నివసించే ప్రజలంతా దానియేలు సేవించే దేవునికి భయపడుతూ ఆయన సన్నిధిలో వణకుతూ ఉండాలి. ఆయనే సజీవుడైన దేవుడు, ఆయన యుగయుగాలకు ఉండే దేవుడు. ఆయన రాజ్యం నిరంతరం ఉంటుంది. ఆయన పరిపాలనకు అంతం అంటూ ఉండదు. 27ఆయన మనుషులను విడిపించేవాడు, రక్షించేవాడు. ఆకాశంలో, భూమి మీదా ఆయన సూచకక్రియలు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. ఆయనే సింహాల బారి నుండి ఈ దానియేలును రక్షించాడు” అని రాయించాడు.
28ఈ దానియేలు దర్యావేషు పరిపాలన కాలంలో, పారసీకుడైన కోరెషు పరిపాలనలో వృద్ది చెందుతూ వచ్చాడు.
Nu geselecteerd:
దాని 6: IRVTel
Markering
Kopiëren
Vergelijk
Delen
Wil je jouw markerkingen op al je apparaten opslaan? Meld je aan of log in
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.