మత్తయి సువార్త 17

17
యేసు రూపాంతరం చెందుట
1ఆరు రోజుల తర్వాత యేసు పేతురు, యాకోబు, అతని సహోదరుడైన యోహానును తన వెంట తీసుకుని ఒంటరిగా ఒక ఎత్తైన కొండ మీదికి వెళ్లారు. 2అక్కడ ఆయన వారి ముందు రూపాంతరం పొందారు. అప్పుడు ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించింది, ఆయన వస్త్రాలు వెలుగువలె తెల్లగా మారాయి. 3అప్పుడు మోషే, ఏలీయా యేసుతో మాట్లాడుతూ, వారికి కనబడ్డారు.
4అప్పుడు పేతురు యేసుతో, “ప్రభువా, మనం ఇక్కడే ఉండడం మంచిది. నీకు ఇష్టమైతే, మూడు గుడారాలను వేద్దాం, నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలీయాకు ఒకటి” అని చెప్పాడు.
5అతడు ఇంకా మాట్లాడుతున్నప్పుడు, కాంతివంతమైన ఒక మేఘం వారిని కమ్ముకుని ఆ మేఘంలో నుండి ఒక స్వరం వారితో, “ఇదిగో ఈయన నేను ప్రేమించే నా ప్రియ కుమారుడు, ఈయనలో నేను ఆనందిస్తున్నాను, కాబట్టి ఈయన మాటలను వినండి!” అని చెప్పడం వినిపించింది.
6శిష్యులు ఆ మాటలు విని, భయంతో నేల మీద బోర్లపడిపోయారు. 7కానీ యేసు వారి దగ్గరకు వచ్చి వారిని ముట్టి, “లేవండి, భయపడకండి” అని చెప్పారు. 8వారు లేచి చూసినప్పుడు, అక్కడ వారికి యేసు తప్ప ఇంకెవరు కనబడలేదు.
9వారు కొండ దిగి వస్తున్నప్పుడు, “మనుష్యకుమారుడు చనిపోయి తిరిగి లేచేవరకు మీరు చూసినవాటిని ఎవరితో చెప్పవద్దు” అని యేసు శిష్యులను ఖచ్చితంగా ఆదేశించారు.
10అప్పుడు శిష్యులు, “ఏలీయా ముందుగా రావాలని ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎందుకు చెప్తున్నారు?” అని ఆయనను అడిగారు.
11అందుకు యేసు, “ఏలీయా వచ్చి అన్నిటిని చక్కపెడతాడన్న మాట నిజమే. 12ఏలీయా ముందే వచ్చాడు కాని ఎవరు అతన్ని గుర్తించలేదు, వారు తమకు ఇష్టం వచ్చినట్టుగా అతనికి చేశారు. మనుష్యకుమారుడు కూడ అలాగే వారి చేత హింసను పొందబోతున్నాడని మీతో చెప్తున్నాను” అన్నారు. 13యేసు తమతో చెప్తున్నది బాప్తిస్మమిచ్చే యోహానును గురించి అని శిష్యులు అర్థం చేసుకున్నారు.
యేసు దయ్యము పట్టిన కుమారుని స్వస్థపరచుట
14వారు జనసమూహాన్ని సమీపించినప్పుడు ఒకడు యేసు దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరించి, 15“ప్రభువా, నా కుమారుని కరుణించు. వాడు మూర్ఛ రోగంతో చాలా బాధపడుతున్నాడు. పదే పదే నిప్పులో, నీళ్లలో పడిపోతున్నాడు. 16నేను వీన్ని మీ శిష్యుల దగ్గరకు తీసుకువచ్చాను కానీ వారు బాగు చేయలేకపోయారు” అని చెప్పాడు.
17అందుకు యేసు, “విశ్వాసంలేని మూర్ఖతరమా, నేను మీతో ఎంతకాలం ఉంటాను? ఎంతకాలం మీ అవిశ్వాసాన్ని సహించగలను? ఆ పిల్లవాన్ని నా దగ్గరకు తీసుకురండి” అన్నారు. 18అప్పుడు యేసు ఆ దయ్యాన్ని గద్దించారు, అది వానిని వదిలిపోయింది. ఆ సమయం నుండి వాడు బాగైపోయాడు.
19ఆ తర్వాత శిష్యులు యేసు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి, “మేము ఎందుకు దానిని వెళ్లగొట్టలేకపోయాం” అని అడిగారు.
20అందుకు యేసు, “మీ అల్పవిశ్వాసమే దానికి కారణము. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఈ కొండతో, ‘ఇక్కడినుండి అక్కడికి వెళ్లు’ అంటే అది పోతుంది. ఎందుకంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 21ఇలాంటివి కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే బయటకు వెళ్లిపోతాయి” అని వారికి చెప్పారు.#17:21 కొన్ని ప్రతులలో ఈ వచనాలు ఇక్కడ చేర్చబడలేదు
యేసు రెండవసారి తన మరణాన్ని గురించి ప్రవచించుట
22వారు గలిలయ ప్రాంతంలో ఉన్నప్పుడు యేసు తన శిష్యులతో, “మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడతాడు. 23అప్పుడు వారు ఆయనను చంపుతారు కానీ ఆయన మూడవ రోజున సజీవంగా తిరిగి లేచును” అని శిష్యులతో చెప్పినప్పుడు వారు ఎంతో దుఃఖించారు.
యేసు దేవాలయంలో పన్ను చెల్లించుట
24తర్వాత యేసు తన శిష్యులతో కపెర్నహూము పట్టణానికి చేరినప్పుడు, అర షెకెలు ఆలయ పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరకు వచ్చి, “మీ బోధకుడు ఆలయ పన్ను చెల్లించడా?” అని అడిగారు.
25అందుకు పేతురు, “చెల్లిస్తాడు” అని జవాబిచ్చాడు.
పేతురు ఇంట్లోకి వచ్చినప్పుడు యేసు ముందుగా మాట్లాడుతూ, అతన్ని, “సీమోనూ, నీవేమి అనుకుంటున్నావు? ఈ భూ రాజులు మందిర పన్ను ఎవరి దగ్గర వసూలు చేయాలి? సొంత కుమారుల దగ్గరా లేదా బయటి వారి దగ్గరా?” అని అడిగారు.
26అందుకు పేతురు, “బయటి వారి దగ్గరే” అని చెప్పాడు.
అందుకు యేసు, “అలాగైతే కుమారులు పన్నుకట్టే అవసరం లేదు. 27కాని మనం వారికి అభ్యంతరకరంగా ఉండకూడదు, కాబట్టి నీవు సముద్రానికి వెళ్లి నీ గాలం వేయి. నీవు పట్టిన మొదటి చేపను తీసుకో, దాని నోటిని తెరిస్తే దానిలో నీకు ఒక షెకెలు నాణెము దొరుకుతుంది. అది తీసుకుని నా కోసం నీకోసం పన్ను చెల్లించు” అని చెప్పారు.

سرخی

شئیر

کاپی

None

کیا آپ جاہتے ہیں کہ آپ کی سرکیاں آپ کی devices پر محفوظ ہوں؟ Sign up or sign in

Videos for మత్తయి సువార్త 17