యోహాను సువార్త 14
14
యేసు తన శిష్యులను ఆదరించుట
1“మీ హృదయాలను కలవరపడనీయకండి. దేవుని నమ్మండి; నన్ను కూడా నమ్మండి. 2నా తండ్రి ఇంట్లో చాలా నివాసస్థలాలు ఉన్నాయి, ఒకవేళ లేకపోతే, మీ కోసం స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్తున్నానని నేను మీతో చెప్పి ఉండేవాడినా? 3నేను వెళ్లి మీ కోసం నివాస స్థలాన్ని సిద్ధపరచి, మళ్ళీ వచ్చి నాతో పాటు ఉండడానికి నేను ఉండే స్థలానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. 4నేను ఎక్కడికి వెళ్తున్నానో ఆ స్థలానికి మార్గం మీకు తెలుసు” అన్నారు.
తండ్రిని చేరుకునే మార్గం యేసే
5తోమా ఆయనతో, “ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు. అలాంటప్పుడు మాకు ఆ మార్గం ఎలా తెలుస్తుంది?” అన్నాడు.
6అందుకు యేసు ఇలా జవాబిచ్చారు, “నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరకు ఎవరు రాలేరు. 7మీరు నన్ను నిజంగా తెలుసుకుని ఉంటే, మీకు నా తండ్రి కూడా తెలిసి ఉండేవాడు. ఇప్పటినుండి ఆయన మీకు తెలుసు, మీరు ఆయనను చూశారు” అన్నారు.
8అందుకు ఫిలిప్పు, “ప్రభువా, మాకు తండ్రిని చూపించు, మాకది చాలు” అన్నాడు.
9యేసు అతనితో, “ఫిలిప్పూ, నేను ఇంతకాలం మీతో ఉన్నా నేను నీకు తెలియదా? నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టే. అలాంటప్పుడు ‘తండ్రిని చూపించు’ అని ఎలా అడుగుతున్నావు? 10నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నామని నీవు నమ్మడం లేదా? నేను మీతో మాట్లాడే మాటలు నా స్వంత మాటలు కావు, నాలో జీవిస్తూ, తన కార్యాలను చేస్తున్న తండ్రియే మాట్లాడుతున్నాడు. 11నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నామని నేను చెప్పితే నన్ను నమ్మండి; లేదా కనీసం దానికి రుజువుగా ఉన్న అద్భుత కార్యాలను చూసి నమ్మండి. 12నన్ను నమ్మేవారు నేను చేస్తున్న క్రియలు చేయడమే కాదు, వీటికన్నా గొప్ప వాటిని చేస్తారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను. 13మీరు నా పేరిట ఏది అడుగుతారో, తండ్రి కుమారునిలో మహిమ పొందునట్లు నేను దాన్ని చేస్తాను. 14మీరు నా పేరిట ఏమి అడిగినా నేను చేస్తాను.
పరిశుద్ధాత్ముని గురించిన వాగ్దానం
15“మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటిస్తారు. 16మీతో ఎల్లప్పుడు ఉండేలా మరొక ఆదరణకర్తను మీకు ఇవ్వమని, నేను తండ్రిని అడుగుతాను. 17ఆయన సత్యమైన ఆత్మ. ఈ లోకం ఆయనను చూడలేదు తెలుసుకోలేదు, కాబట్టి ఆయనను అంగీకరించదు. కానీ మీకు ఆయన తెలుసు, ఎందుకంటే ఆయన మీలో జీవిస్తున్నాడు మీలో ఉంటాడు. 18నేను మీ దగ్గరకు వస్తాను, మిమ్మల్ని అనాధలుగా విడిచిపెట్టను. 19కొంత కాలమైన తర్వాత ఈ లోకం ఇక నన్ను చూడదు, కాని మీరు నన్ను చూస్తారు. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు జీవిస్తారు. 20నేను నా తండ్రిలో, మీరు నాలో, నేను మీలో ఉన్నామని మీరు ఆ రోజు గుర్తిస్తారు. 21నా ఆజ్ఞలను పాటించేవారు నన్ను ప్రేమించేవారు. నన్ను ప్రేమించేవారిని నా తండ్రి ప్రేమిస్తాడు, నేను కూడ వారిని ప్రేమించి నన్ను నేను వారికి ప్రత్యక్షం చేసుకుంటాను” అన్నారు.
22యూదా ఇస్కరియోతు కాదు, మరొక యూదా యేసుతో, “కానీ ప్రభువా, నీవు ఈ లోకానికి కాకుండా మాకే ఎందుకు కనుపరచుకోవాలని అనుకుంటున్నావు?” అని అడిగాడు.
23అందుకు యేసు, “ఎవరైనా నన్ను ప్రేమిస్తే వారు నా బోధను పాటిస్తారు. కాబట్టి నా తండ్రి వానిని ప్రేమిస్తాడు మేము వారి దగ్గరకు వచ్చి వారితో నివాసం చేస్తాము. 24నన్ను ప్రేమించనివారు నా బోధలను పాటించరు. మీరు వింటున్న ఈ మాటలు నా సొంతం కాదు; అవి నన్ను పంపిన తండ్రి మాటలు.
25“నేను మీ మధ్య ఉన్నప్పుడే ఈ సంగతులను మీతో చెప్పాను. 26కానీ నా పేరిట తండ్రి పంపించు ఆదరణకర్తయైన పరిశుద్ధాత్మ, మీకు అన్ని విషయాలను బోధిస్తూ నేను మీకు చెప్పిన వాటినన్నింటిని మీకు జ్ఞాపకం చేస్తాడు. 27నా సమాధానాన్ని మీతో వదిలి వెళ్తున్నాను; నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను. నేను ఈ లోకం ఇచ్చినట్టుగా ఇవ్వడం లేదు మీ హృదయాలను కలవరపడనీయకండి, భయపడకండి.
28“ ‘నేను వెళ్లి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను’ అని నేను చెప్పిన మాటను మీరు విని ఉన్నారు. అయితే మీరు నన్ను ప్రేమిస్తే, నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నానని సంతోషించేవారు, ఎందుకంటే తండ్రి నాకన్నా గొప్పవాడు. 29అది జరిగినప్పుడు మీరు నమ్మాలని, అది జరుగక ముందే ఇప్పుడే మీకు చెప్పాను. 30నేను మీతో ఇంతకంటే ఎక్కువ చెప్పను, ఎందుకంటే ఈ లోకాధికారి వస్తున్నాడు. కానీ అతనికి నా మీద అధికారం లేదు. 31అయితే నేను తండ్రిని ప్రేమిస్తున్నానని, తండ్రి నాకు ఆజ్ఞాపించిన వాటిని మాత్రమే నేను చేస్తున్నానని ఈ లోకం తెలుసుకోవాలనే అతడు వస్తాడు.
“లేవండి, ఇక్కడినుండి వెళ్దాము.
موجودہ انتخاب:
యోహాను సువార్త 14: TSA
سرخی
کاپی
موازنہ
شئیر
کیا آپ جاہتے ہیں کہ آپ کی سرکیاں آپ کی devices پر محفوظ ہوں؟ Sign up or sign in
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.