1 కొరింథీ పత్రిక 7
7
దాంపత్య జీవితం గురించి
1మీరు వ్రాసిన విషయాల గురించి: “స్త్రీతో లైంగిక సంబంధం లేకపోవడం పురుషునికి మంచిది.” 2అయితే లైంగిక దుర్నీతి జరుగుతుంది కాబట్టి ప్రతి పురుషుడు తన సొంత భార్యతోనే, ప్రతి స్త్రీ తన సొంత భర్తతోనే లైంగిక సంబంధం కలిగి ఉండాలి. 3భర్త తన భార్య పట్ల వైవాహిక బాధ్యతను నెరవేర్చాలి, అదే విధంగా భార్య తన భర్తకు వైవాహిక బాధ్యతను నెరవేర్చాలి. 4భార్య శరీరం మీద ఆమె భర్తకే గాని ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద భార్యకే గాని అతనికి అధికారం లేదు. 5మీరు ఇద్దరు వ్యక్తిగతంగా కొంత సమయం ప్రార్థనలో గడపడానికి పరస్పర అంగీకారంతోనే తప్ప ఒకరిని విడిచి ఒకరు దూరంగా ఉండకండి. మీ మనస్సును మీరు అదుపు చేసుకోలేనప్పుడు సాతాను మిమ్మల్ని శోధించకుండ మీరు తిరిగి కలుసుకోండి. 6ఇది ఒక సలహా మాత్రమే ఆజ్ఞ కాదు. 7మీరందరు నాలా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ, మీలో ప్రతి ఒక్కరికీ దేవుడు ఒక ప్రత్యేకమైన వరాన్ని ఇచ్చారు; ఒకరికి ఒక వరం, ఇంకొకరికి ఇంకొక వరాన్ని ఇచ్చారు.
8ఇప్పుడు నేను పెళ్ళికానివారితో, విధవరాండ్రతో చెప్పేది ఏంటంటే: నాలా వారు కూడ పెళ్ళి చేసుకోకుండా ఉండడం మంచిది. 9అయితే వారు తమను తాము అదుపు చేసుకోలేకపోతే పెళ్ళి చేసుకోవాలి. కామంతో రగిలిపోవడం కంటే పెళ్ళి చేసుకోవడం మేలు.
10పెళ్ళి అయినవారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించేది ఏంటంటే: భార్య భర్తనుండి వేరుగా ఉండకూడదు. 11అయితే ఆమె అలా వేరైతే, ఆమె పెళ్ళి చేసుకోకుండా ఉండిపోవాలి లేదా తన భర్తతో సమాధానపడాలి. అలాగే భర్త తన భార్యను విడిచిపెట్టకూడదు.
12మిగిలిన వారితో ప్రభువు కాదు నేను చెప్పేది ఏంటంటే: ఏ సహోదరునికైనా అవిశ్వాసురాలైన భార్య ఉండి, ఆమె అతనితో కలిసి కాపురం చేయడానికి ఇష్టపడితే, అతడు ఆమెను విడిచిపెట్టకూడదు. 13ఏ స్త్రీకైనా అవిశ్వాసియైన భర్త ఉండి ఆమెతో కాపురం చేయడానికి అతడు ఇష్టపడితే, ఆమె అతన్ని విడిచిపెట్టకూడదు. 14అవిశ్వాసియైన భర్త, భార్య ద్వారా పరిశుద్ధపరచబడతాడు. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్త ద్వారా పవిత్రపరచబడుతుంది. లేకపోతే మీ పిల్లలు అపవిత్రులుగా ఉంటారు, ఇప్పుడైతే వాళ్ళు పవిత్రులు.
15అయితే అవిశ్వాసి విడిచిపెడితే విడిచిపెట్టవచ్చు. అలాంటి సందర్భాలలో ఉన్న విశ్వాసులైన సహోదరుడు లేదా సహోదరి వివాహానికి కట్టుబడి ఉండనవసరం లేదు; సమాధానం కలిగి జీవించడానికి దేవుడు మనల్ని పిలిచారు. 16ఓ భార్యా, నీ భర్తను రక్షించగలవో లేదో నీకు ఎలా తెలుసు? ఓ భర్తా, నీ భార్యను రక్షించగలవో లేదో నీకు ఎలా తెలుసు?
స్థితిలో మార్పు గురించి
17ప్రభువు ప్రతిఒక్కరికి ఏ స్థితి నియమించారో, దేవుడు అందరిని ఏ స్థితిలో పిలిచారో ఆ స్థితిలోనే విశ్వాసిగా జీవించాలి. ఇదే నియమాన్ని అన్ని సంఘాలకు నియమిస్తున్నాను. 18అప్పటికే సున్నతి పొందినవాడు పిలువబడ్డాడా? అతడు సున్నతి పోగొట్టుకోకూడదు. సున్నతి పొందనివాడు పిలువబడ్డాడా? అతడు సున్నతి పొందకూడదు. 19సున్నతి పొందడంలో గాని పొందకపోవడంలో ఏమి లేదు. దేవుని ఆజ్ఞలను పాటించడమే ముఖ్యం. 20ప్రతి ఒక్కరూ దేవుడు ఏ స్థితిలో తమను పిలిచారో ఆ స్థితిలోనే ఉండాలి.
21పిలిచినప్పుడు నీవు దాసునిగా ఉన్నావా? దాని గురించి బాధపడవద్దు; నీవు స్వాతంత్ర్యం పొందుకోగలిగితే స్వాతంత్ర్యం పొందుకో. 22ప్రభువులో విశ్వాసం ఉంచడానికి పిలువబడిన దాసులు, ప్రభువు వలన స్వాతంత్ర్యం పొందినవారు; అదే విధంగా, స్వతంత్రునిగా ఉండి పిలువబడిన వారు క్రీస్తుకు దాసులు. 23మీరు వెలపెట్టి కొనబడ్డారు కాబట్టి మనుష్యులకు దాసులుగా ఉండకండి. 24సహోదరీ సహోదరులారా, ప్రతి ఒక్కరిని దేవుడు ఏ స్థితిలో ఉండగా పిలిచారో ఆ స్థితిలోనే వారు దేవునితో నిలిచి ఉండాలి.
పెళ్ళికానివారు, విధవరాండ్ర గురించి
25కన్యల గురించి ప్రభువు నుండి నాకు ఆజ్ఞ లేదు గాని, ప్రభువు కృప చేత నమ్మకమైన వానిగా నేను ఒక ఆలోచన చెప్తున్నాను. 26ఇప్పటి క్లిష్ట పరిస్థితిని బట్టి పురుషుడు తానున్న స్ధితిలోనే ఉండడం మంచిదని నేను భావిస్తున్నాను. 27మీరు ఒక స్త్రీకి ప్రమాణం చేశారా? దాని నుండి విడుదల కోరవద్దు. మీరు అలాంటి ప్రమాణం నుండి విడుదల పొందారా? భార్య కోసం వెదకవద్దు. 28అయితే, మీరు పెళ్ళి చేసుకుంటే అది పాపం కాదు; కన్య పెళ్ళి చేసుకుంటే అది పాపం కాదు. అయితే పెళ్ళి చేసుకున్న వారికి జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి, అవి మీకు కలుగకూడదని నేను కోరుతున్నాను.
29సహోదరీ సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే, సమయం తక్కువగా ఉన్నది. కాబట్టి ఇకమీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్లు జీవించండి. 30దుఃఖించే వారు ఏడవనట్టు, సంతోషపడేవారు సంతోషపడనట్టు, ఏదైనా కొన్నవారు అది తమది కాదన్నట్టు ఉండాలి. 31ఈ లోక విషయాలతో వ్యవహరించేవారు వాటితో సంబంధం లేనివారిగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకం ఉన్న ప్రస్తుత రూపం గతించిపోతుంది.
32మీరు చింతలేనివారై ఉండాలని నేను కోరుకొంటున్నాను. పెళ్ళికానివారు ప్రభువును ఎలా సంతోషపెట్టగలమా అని ప్రభువు విషయాల గురించి చింతిస్తారు. 33అయితే పెండ్లియైన వారు భార్యను ఎలా సంతోషపెట్టగలనా అని ఈ లోక విషయాల గురించి చింతిస్తున్నారు. 34పెళ్ళైన వారికి పెళ్ళికాని వారికి మధ్య భేదం ఉంది; పెళ్ళికాని స్త్రీ లేదా కన్య తాను శరీరంలో, ఆత్మలో పవిత్రంగా ఉండాలని ప్రభువు కార్యాలను గురించి ఆలోచిస్తుంది. కాని పెళ్ళైన స్త్రీ తన భర్తను ఎలా సంతోషపెట్టగలనా అనే ఈ లోక విషయాల గురించి ఆలోచిస్తుంది. 35ఇది మీ మంచి కోసమే తప్ప మిమ్మల్ని ఆటంకపరచాలని కాదు. అయితే మీరు ఇతర విషయాల మీద ధ్యాస పెట్టకుండా ప్రభువు పైనే దృష్టి నిలిపి సరియైన మార్గంలో జీవించమని చెప్తున్నాను.
36ఎవరైనా తనకు నిశ్చయమైన కన్య పట్ల గౌరవంగా నడుచుకోవడం లేదని బాధపడితే, ఒకవేళ ఆమె వయస్సు పెరిగిపోవడం వలన పెళ్ళి చేయాలని భావిస్తే, అతడు తాను కోరుకున్నట్లే చేయాలి. అతడు పాపం చేయడం లేదు. వారు పెళ్ళి చేసుకోవాలి. 37అయితే ఎవడైనా కన్యను పెళ్ళి చేసుకోకూడదని నిర్ణయించుకొని, దానికి తగిన మనోబలం కలిగి ఉండి తన కోరికలను అదుపులో ఉంచుకునే శక్తి గలవాడైతే అతడు చేసేది కూడా మంచిదే. 38కాబట్టి ఒకడు కన్యను పెళ్ళి చేసుకున్నా మంచిదే, చేసుకోకపోతే ఇంకా మంచిది.
39భార్య తన భర్త బ్రతికి ఉన్నంత వరకు అతనికి కట్టుబడి ఉండాలి. భర్త చనిపోతే ఆమె తనకిష్టమైన వాన్ని పెళ్ళి చేసుకోవడానికి స్వతంత్రురాలే కాని, అతడు దేవునికి చెందినవాడై ఉండాలి. 40అయితే, ఆమె ఉన్న రీతిగానే ఉంటే, అది ఆమెకు సంతోషంగా ఉంటుందని నా అభిప్రాయం. నేనయితే దేవుని ఆత్మను కలిగి ఉన్నాను.
موجودہ انتخاب:
1 కొరింథీ పత్రిక 7: TSA
سرخی
کاپی
موازنہ
شئیر
کیا آپ جاہتے ہیں کہ آپ کی سرکیاں آپ کی devices پر محفوظ ہوں؟ Sign up or sign in
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.