కీర్తనలు 63:1-5 - Compare All Versions
కీర్తనలు 63:1-5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేవా, మీరు నా దేవుడు, నేను ఆశగా మిమ్మల్ని వెదకుతున్నాను; నీరు లేక ఎండిపోయి పొడిగా ఉన్న దేశంలో, నేను మీ కోసం దప్పిగొన్నాను, నా శరీరమంతా మీ కోసం ఆశపడుతుంది. పరిశుద్ధాలయంలో నేను మిమ్మల్ని చూశాను. మీ ఘనతా మహిమను తేరి చూశాను మీ మారని ప్రేమ జీవం కంటే ఉత్తమం నా పెదవులు మిమ్మల్ని స్తుతిస్తాయి. నా జీవితకాలమంతా నేను మిమ్మల్ని స్తుతిస్తాను. మీ పేరును బట్టి నా చేతులు ఎత్తుతాను. శ్రేష్ఠమైన ఆహారం దొరికినట్లు నేను సంతృప్తి పొందుతాను; సంతోషించే పెదవులతో నా నోరు మిమ్మల్ని స్తుతిస్తుంది.
కీర్తనలు 63:1-5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
దేవా, నా దేవుడివి నీవే. మనసారా నిన్ను వెదుకుతాను. నీళ్లు లేక ఎండిపోయిన ప్రాంతంలో నా ప్రాణం నీకోసం దప్పిగొని ఉంది. నిన్ను చూడాలని నా శరీరం ఆత్రుతతో ఎదురు చూస్తున్నది. నీ బలాన్ని, నీ మహిమను చూడాలని పరిశుద్ధ మందిరంలో నీవైపు చూస్తూ కనిపెడుతున్నాను. నీ నిబంధన నమ్మకత్వం జీవం కంటే శ్రేష్టం. నా పెదాలు నిన్ను స్తుతిస్తాయి. నీ పేరున నా చేతులు పైకెత్తి నా జీవిత కాలమంతా నిన్ను స్తుతిస్తాను. కొవ్వు, మూలుగ తిన్నట్టుగా నా ప్రాణం తృప్తిగా ఉంది. ఆనందించే పెదాలతో నా నోరు నిన్ను కీర్తిస్తుంది.
కీర్తనలు 63:1-5 TERV (పవిత్ర బైబిల్)
దేవా, నీవు నా దేవుడవు. నాకు నీవు ఎంతగానో కావాలి. నా ఆత్మ, నా శరీరం నీళ్లులేక ఎండిపోయిన భూమిలా నీకొరకు దాహంగొని ఉన్నాయి. అవును, నీ ఆలయంలో నేను నిన్ను చూశాను. నీ బలము నీ మహిమలను నేను చూశాను. నీ ప్రేమ జీవం కన్నా గొప్పది. నా పెదాలు నిన్ను స్తుతిస్తున్నాయి. అవును, నా జీవితంలో నేను నిన్ను స్తుతిస్తాను. నీ పేరట నేను నా చేతులెత్తి నీకు ప్రార్థిస్తాను. శ్రేష్ఠమైన ఆహారం భుజించినట్లు నేను తృప్తిపొందుతాను. నా నోరు నిన్ను స్తుతిస్తుంది.
కీర్తనలు 63:1-5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకు దును నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కని పెట్టియున్నాను. నీళ్లులేక యెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది. నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానముచేయుచున్నది