యోబు 19:23-29

యోబు 19:23-29 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

“నా మాటలు ఒక గ్రంథపుచుట్టలో, వ్రాయబడి ఉంటే బాగుండేది! అవి నిత్యం ఉండేలా ఇనుపగంటతో రాతి మీద చెక్కి సీసంతో నింపితే బాగుండేది! నా విమోచకుడు సజీవుడని, తుదకు ఆయన భూమి మీద నిలబడతారని నాకు తెలుసు. నా చర్మం నాశనమైపోయిన తర్వాత నా శరీరంతో నేను దేవుని చూస్తాను. మరొకరు కాదు, నేనే నా కళ్ళతో స్వయంగా దేవుని చూస్తాను. నా హృదయం నాలో ఎంత ఆరాటపడుతుంది! “ఒకవేళ మీరు, ‘దీనికంతటికి మూలకారణం అతనిలోనే ఉంది, అతన్ని మనమెలా వేటాడాలి’ అని అనుకుంటే, మీరు ఖడ్గానికి భయపడాలి; ఎందుకంటే కోపమనే ఖడ్గం శిక్షను విధిస్తుంది, అప్పుడు మీరు తీర్పు ఉందని తెలుసుకుంటారు.”

షేర్ చేయి
చదువండి యోబు 19

యోబు 19:23-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నా మాటలన్నీ ఒక పుస్తకంలో రాసి పెట్టి ఉంచాలని నేను ఆశిస్తున్నాను. నా మాటలు నిరంతరం నిలిచి ఉండేలా శిలాక్షరాలై, ఇనుప గంటంతో చెక్కబడి, సీసం కరిగించి పోసి ఉంటే ఎంత బాగుంటుంది! నా విమోచకుడు శాశ్వతంగా ఉండే వాడనీ, అంతంలో ఆయన నా పక్షంగా నిలబడతాడనీ నాకు తెలుసు. ఈ విధంగా నా చర్మం చీకి చీలికలైపోయినా నా శరీరంతో నేను దేవుణ్ణి చూస్తాను. మరెవరో కాదు, నేనే నా కళ్ళతో స్వయంగా చూస్తాను. నా లోపలి భాగాలు కృశించిపోయాయి. దీనంతటికీ మూల కారణం నాలోనే ఉన్నదన్న తప్పు భావంతో మీరు నన్ను ఎలా హింసిద్దామా అనుకుంటూ ఉండవచ్చు. అయితే మీరు ఖడ్గానికి భయపడాలి. దేవుడు పంపిన ఆగ్రహం అనే ఖడ్గం దోషులను శిక్షిస్తుంది. అప్పుడు దేవుని తీర్పు ఉంటుందని మీరు తెలుసుకుంటారు.

షేర్ చేయి
చదువండి యోబు 19

యోబు 19:23-29 పవిత్ర బైబిల్ (TERV)

“నేను (యోబు) చెప్పేది ఎవరో ఒకరు జ్ఞాపకం ఉంచుకొని, ఒక గ్రంథంలో వ్రాస్తే బాగుంటుందని నా ఆశ. నేను చెప్పే మాటలు ఒక గ్రంథపు చుట్టలో వ్రాయబడాలని నా ఆశ. నేను చెప్పే మాటలు శాశ్వతంగా ఉండేటట్టు సీసంమీద ఇనుప పోగరతో చెక్కబడాలని లేదా ఒక బండమీద వ్రాయబడాలని నా ఆశ. నన్ను ఆదుకొనేవారు ఎవరో ఒకరు ఉన్నారని నాకు తెలుసు. అంతంలో ఆయన నా పక్షంగా నిలబడతాడని నాకు తెలుసు. నేను ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత నా చర్మం పాడైపోయిన తర్వాత కూడా నేను దేవుణ్ణి చూస్తానని నాకు తెలుసు. నా స్వంత కళ్లతో నేను దేవుణ్ణి చూస్తాను. సాక్షాత్తూ దేవుణ్ణే, ఇంకెవరినీ కాదు. నాలో నా హృదయం బలహీనం అవుతోంది. “ఒకవేళ మీరు, ‘మనం యోబును ఇబ్బంది పెడ్దాం, అతణ్ణి నిందించటానికి ఏదైనా కారణం వెదుకుదాం’ అనుకొవచ్చును. కానీ మీ మట్టుకు మీరే ఖడ్గానికి భయపడాలి. ఎందుకంటే, పాపంమీద దేవుని కోపం శిక్షను రప్పిస్తుంది. మిమ్మల్ని శిక్షించేందుకు యెహోవా ఖడ్గం ప్రయోగిస్తాడు. అప్పుడు తీర్పు ఉంది అని మీరు తెలుసుకొంటారు.”

షేర్ చేయి
చదువండి యోబు 19

యోబు 19:23-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతో కోరు చున్నాను. అవి గ్రంథములో వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అవి యినుపపోగరతో బండమీద చెక్కబడి సీస ముతో నింపబడి నిత్యము నిలువవలెనని నేనెంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీర ముతో నేను దేవుని చూచెదను. నామట్టుకు నేనే చూచెదను. మరి ఎవరును కాదు నేనే కన్నులార ఆయనను చూచెదను నాలో నా అంతరింద్రియములు కృశించియున్నవి జరిగినదాని కారణము నాలోనే ఉన్నదనుకొని మీరు–మేము వానిని ఎట్లు తరిమెదమా అని తలంచినయెడల మీరు ఖడ్గమునకు భయపడుడి తీర్పుకలుగునని మీరు తెలిసికొనునట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును.

షేర్ చేయి
చదువండి యోబు 19