యాకోబు 1:1-26
యాకోబు 1:1-26 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దేవునికి, ప్రభువైన యేసు క్రీస్తుకు సేవకుడనైన యాకోబు, వివిధ దేశాలకు చెదిరిపోయిన పన్నెండు గోత్రాల వారికి వ్రాస్తున్నాను: మీకు శుభాలు. నా సహోదరీ సహోదరులారా, మీ విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షలవల్ల ఓర్పు వస్తుందని మీకు తెలుసు కాబట్టి, మీకు ఎప్పుడైనా ఎలాంటి శోధనలు ఎదురైనా వాటిని బట్టి సంతోషించండి. మీరు పరిణతి చెంది సంపూర్ణులై ఏ విషయంలో కొదువలేనివారై ఉండేలా పట్టుదల తన పనిని చేయనివ్వండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొరతగా ఉంటే దేవున్ని అడగాలి, ఆయన తప్పులను ఎంచకుండా అందరికి ధారాళంగా ఇస్తారు. మీరు అడిగినప్పుడు సందేహించకుండా విశ్వాసంతో అడగండి ఎందుకంటే, సందేహించేవారు గాలికి రేగి ఎగసిపడే సముద్రపు అలల్లాంటివారు; కాబట్టి వారు ప్రభువు నుండి తమకు ఏమైనా దొరుకుతుందని ఆశించకూడదు. అలాంటివారు రెండు రకాల మనస్సులను కలిగి ఉంటారు, తాము చేసేవాటన్నిటిలో అస్థిరంగా ఉంటారు. దీనస్థితిలో ఉన్న విశ్వాసులు తమకు కలిగిన ఉన్నత స్థితిని బట్టి అతిశయించాలి. అయితే ధనవంతులైనవారు తమ దీనస్థితిని బట్టి అతిశయించాలి, ఎందుకంటే వారు గడ్డి పువ్వులా కనుమరుగవుతారు. కాల్చివేసే వేడిమితో సూర్యుడు ఉదయించినప్పుడు గడ్డి వాడిపోతుంది; దాని పువ్వు రాలిపోతుంది, దాని అందం నశించిపోతుంది; ధనవంతుల పట్ల కూడా అలాగే జరుగుతుంది; తమ తీరికలేని జీవితం మధ్యలో వారు వాడిపోతారు. శోధన సహించినవారు ధన్యులు. పరీక్షలో నిలబడినవారు ప్రభువు తాను ప్రేమించినవారికి ఇస్తానని వాగ్దానం చేసిన జీవకిరీటాన్ని పొందుతారు. దేవుడు కీడు చేత శోధించబడడు; ఆయన ఎవరిని శోధించడు కాబట్టి ఎవరికైనా శోధన ఎదురైతే, “నేను దేవుని చేత శోధించబడుతున్నాను” అని అనకూడదు. ఒకరు తమ సొంత కోరికతోనే ఆకర్షించబడి వాటి ద్వారా ప్రలోభాలకు గురై శోధించబడతారు. చెడు కోరిక గర్భాన్ని ధరించి పాపానికి జన్మనిస్తుంది, ఆ పాపం పండి మరణానికి జన్మనిస్తుంది. నా ప్రియ సహోదరీ సహోదరులారా, మోసపోకండి. పైనుండి వచ్చే ప్రతీ శ్రేష్ఠమైన సంపూర్ణమైన బహుమానం వెలుగును కలిగించిన తండ్రి దగ్గర నుండి క్రిందకు వస్తున్నాయి, ఆయన ఒకచోట నిలబడని నీడల్లా ఎన్నడు మారరు. ఆయన సృష్టంతటిలో మనం మొదటి ఫలాలుగా ఉండాలని, సత్యవాక్యం చేత మనకు జన్మనివ్వడానికి ఎంచుకున్నారు. నా ప్రియ సహోదరీ సహోదరులారా, మీరు దీనిని గ్రహించాలి: ప్రతి ఒక్కరు వినడానికి తొందరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, అలాగే తొందరపడి కోపపడవద్దు; ఎందుకంటే మీ కోపం దేవుని నీతిని జరిగించదు. కాబట్టి మీ జీవితాల్లోని సమస్త మలినాన్ని చెడును వదిలిపెట్టి, దేవుడు మీ హృదయాల్లో నాటిన వాక్యాన్ని వినయంతో అంగీకరించండి, ఎందుకంటే మీ ఆత్మలను రక్షించే శక్తి దానికే ఉంది. మీరు వాక్యాన్ని వినేవారిగా మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. వాక్యం చెప్పేది చేయండి. ఎవరైతే వాక్యాన్ని విని అది చెప్పిన ప్రకారం చేయరో, వారు తమ ముఖాన్ని అద్దంలో చూసుకునే వారిలా ఉంటారు; వారు తమను చూసుకొని ప్రక్కకు వెళ్లిన వెంటనే తాము ఎలా ఉన్నారో మరచిపోతారు. అయితే స్వాతంత్ర్యాన్ని ఇచ్చే సంపూర్ణమైన ధర్మశాస్త్రంలోనికి పరిశీలనగా చూసి దానిలో కొనసాగేవారు, విని మరచేవారిగా ఉండకుండా అది చెప్పిన ప్రకారం చేస్తారు; వారు తాము చేసిన దానిలో దీవించబడతారు. తాము భక్తిపరులమని భావిస్తూ తమ నాలుకను అదుపులో పెట్టుకోనివారు తమ హృదయాలను తామే మోసం చేసుకుంటారు. అలాంటివారి భక్తి విలువలేనిది.
యాకోబు 1:1-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవునికి, ప్రభువైన యేసు క్రీస్తుకు దాసుడైన యాకోబు, చెదరిపోయిన పన్నెండు గోత్రాల వారికి అభినందనలు. నా సోదరులారా, మీ విశ్వాసానికి వచ్చే పరీక్ష మీకు ఓర్పు కలిగిస్తుందని తెలుసుకుని రక రకాల పరీక్షలకు మీరు లోనైనప్పుడు, దాన్ని ఆనందంగా భావించండి. ఓర్పు తన కార్యాన్ని సంపూర్ణం చేయనివ్వండి. అప్పుడు మీరు పూర్తిగా పరిణతి చెంది ఏ కొదువా లేకుండా ఉంటారు. మీలో ఎవరికైనా జ్ఞానం కావలిస్తే, దాన్ని ఇచ్చే దేవుణ్ణి అడగండి. అడిగినందుకు దేవుడు ఎవరినీ గద్దించడు. అడిగిన వారందరికీ ధారాళంగా ఇస్తాడు. కాని, దేవుణ్ణి అడిగేటప్పుడు అనుమానం లేకుండా విశ్వాసంతో అడగాలి. అనుమానంతో ఉన్నవాడు, సముద్రం మీద గాలికి రేగి ఎగిసిపడే అలలాంటి వాడు. అలాటివాడు తన విన్నపాలకు జవాబుగా ప్రభువు నుంచి తనకు ఏమైనా దొరుకుతుందని అనుకోకూడదు. అలాటి వాడు చంచలమైన మనసు గలవాడు. తన విషయాలన్నిటిలోనూ నిలకడ లేనివాడు. దీనస్థితిలో ఉన్న సోదరుడు తనకు కలిగిన ఉన్నత స్థితిని బట్టి సంతోషించాలి. ధనవంతుడైన సోదరుడు, తాను కూడా గడ్డి పువ్వులా రాలిపోతానని తెలిసి, తన దీనస్థితిని బట్టి సంతోషించాలి. సూర్యుడు ఉదయించిన తరువాత మండే ఎండకు మొక్క ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది. దాని అందం అంతా పోతుంది. అదేవిధంగా ధనవంతులు కూడా తమ కార్యకలాపాల్లో ఉండగానే వాడిపోతారు. పరీక్షను ఓర్పుతో భరించేవాడు ధన్యుడు. ఆ పరీక్షలో గెలుపొందిన తరవాత దేవుణ్ణి ప్రేమించిన వారికి వాగ్దానంగా ఇచ్చే జీవ కిరీటం అతడు పొందుతాడు. చెడు ప్రేరేపణ కలిగినప్పుడు, “ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది,” అని ఎవరూ అనకూడదు. ఎందుకంటే, చెడు విషయంలో దేవుడు ఎప్పుడూ శోధనకు గురి కాడు, ఎవరినీ చెడు ప్రేరణకు గురి చేయడు కూడా. ప్రతివాడూ తన సొంత దురాశల వల్ల కలిగిన చెడు ప్రేరేపణ బట్టి చెడు కోరికకు గురై నాశనం అవుతాడు. చెడు కోరిక గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపం పండి మరణాన్ని ఇస్తుంది. నా ప్రియ సోదరులారా, మోసపోకండి. ప్రతి మంచి బహుమానం, పరిపూర్ణమైన ప్రతి వరం పైనుంచి వస్తాయి. వెలుగుకు కర్త అయిన తండ్రి నుంచి వస్తాయి. ఆయన కదిలే నీడలా ఉండడు. ఆయన మార్పు లేనివాడు. దేవుడు, తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలాలుగా ఉండాలని సత్యవాక్యం ద్వారా మనకు జీవం ఇవ్వడానికి మనలను కలగజేశాడు. నా ప్రియ సోదరులారా, ప్రతివాడూ వినడానికి తొందరపడాలి. మాట్లాడడానికీ, కోపానికీ నిదానించాలి. ఇది మీకు తెలుసు. ఎందుకంటే, మనిషి కోపం, దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి, సమస్త పాపపు రోతనూ, దుష్టత్వాన్నీ వదిలి మీలో నాటుకుని ఉన్న దేవుని వాక్కును సాధు గుణంతో స్వీకరించండి. దానికి మీ ఆత్మలను రక్షించే సామర్ధ్యం ఉంది. వాక్కు ప్రకారం నడుచుకునే వారుగా ఉండండి. వాక్కు వినేవారిగా మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. ఎవరైనా వాక్కు విని, దాని ప్రకారం చేయకపోతే, అలాటివాడు అద్దంలో తన సహజ ముఖాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూసుకునే వాడిలా ఉంటాడు. అతడు తన మొహం పరిశీలనగా చూసుకుని, బయటకు వెళ్ళిన తరువాత వెంటనే తాను ఎలా ఉంటాడో మరిచిపోతాడు. కానీ ఎవరైతే స్వాతంత్రాన్ని ఇచ్చే పరిపూర్ణ ధర్మశాస్త్రాన్ని పరిశీలనగా చూస్తూ, దాని ప్రకారం చేస్తూ, విని మరిచి పోకుండా ఉంటే వాడు తాను చేస్తున్న దాన్ని బట్టి దీవెన పొందుతాడు. తాను భక్తిపరుణ్ణి అనుకుంటూ తన నాలుకను అదుపులో పెట్టుకోనివాడు తన హృదయాన్ని తానే మోసం చేసుకుంటాడు. అతని భక్తి వ్యర్థం.
యాకోబు 1:1-26 పవిత్ర బైబిల్ (TERV)
దేవునికి, యేసుక్రీస్తు ప్రభువుకు సేవకుడైన యాకోబునైన నేను, చెదరిపోయి, పలు ప్రాంతాలలో నివసిస్తున్న పన్నెండు గోత్రాల వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వ్రాయునదేమనగా: నా సోదరులారా! మీకు పరీక్షలు కలిగినప్పుడు పరమానందంగా భావించండి. విశ్వాసం పరీక్షింపబడటం వల్ల సహనం కలుగుతుందని మీకు తెలుసు. మీరు చేసే పనిలో పూర్తిగా సహనం చూపండి. అలా చేస్తే మీరు బాగా అభివృద్ధి చెంది పరిపూర్ణత పొందుతారు. అప్పుడు మీలో ఏ లోపం ఉండదు. మీలో జ్ఞానం లేనివాడు ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. దేవుడు కోపగించుకోకుండా అందరికీ ధారాళంగా యిస్తాడు. కనుక మీకు కూడా యిస్తాడు. కాని దేవుణ్ణి అడిగినప్పుడు సంశయించకుండా విశ్వాసంతో అడగండి. సంశయించేవాడు గాలికి ఎగిరి కొట్టుకొను సముద్రం మీది తరంగంతో సమానము. అలాంటివాడు ప్రభువు నుండి తనకు ఏదైనా లభిస్తుందని ఆశించకూడదు. అలాంటివాడు ద్వంద్వాలోచనలు చేస్తూ అన్ని విషయాల్లో చంచలంగా ఉంటాడు. దీనస్థితిలో ఉన్న సోదరుడు తనకు గొప్ప స్థానం లభించినందుకు గర్వించాలి. ధనవంతుడు తాను కూడా గడ్డిపువ్వులా రాలిపోవలసినవాడే కనుక తనకు దీనస్థితి కలిగినందుకు ఆనందించాలి. ఎందుకంటే, సూర్యుడు ఉదయిస్తాడు. మండుటెండకు గడ్డి ఎండిపోతుంది. దాని పువ్వులు రాలి దాని అందం చెడిపోతుంది. అదే విధంగా ధనవంతుడు తన వ్యాపారం సాగిస్తుండగానే మరణిస్తాడు. పరీక్షా సమయంలో సహనం కలవాడు ధన్యుడు. ఆ విధంగా పరీక్షింపబడినవాడు జీవకిరీటాన్ని పొందుతాడు. అంటే దేవుడు తనను ప్రేమించినవాళ్ళకు చేసిన వాగ్దానం అతడు పొందుతాడన్నమాట. ఒకడు శోధింపబడినప్పుడు, దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదు. ఎందుకంటే దేవుడు చెడుద్వారా శోధింపడు. ఆయన ఎవర్నీ శోధించడు. దురాశలకు లోనై ఆశల్లో చిక్కుకు పోయినప్పుడు నీతికి దూరమై చెడును చెయ్యాలనే బుద్ధి పుడుతుంది. దురాశ గర్భం దాల్చి పాపాన్ని ప్రసవిస్తుంది. ఆ పాపం పండి మరణాన్ని కంటుంది. నా ప్రియమైన సోదరులారా! మోసపోకండి. ప్రతి మంచి వరానికి, ప్రతి శ్రేష్ఠమైన వరానికి పరలోకం మూలం. వెలుగును సృష్టించిన తండ్రి ఈ వరాలిస్తాడు. ఆ వరాలిచ్చే తండ్రి మార్పుచెందడు. ఆయన ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు. దేవుడు తన సృష్టిలో మనము ప్రథమ ఫలాలుగా ఉండాలని సత్యవాక్యం ద్వారా మనకు జన్మనివ్వటానికి సంకల్పించాడు. నా ప్రియమైన సోదరులారా! ఈ విషయాల్ని తెలుసుకోండి: ప్రతి మనిషి వినటానికి సిద్ధంగా ఉండాలి. మాట్లాడే ముందు ఆలోచించాలి. కోపాన్ని అణచుకోవాలి. ఎందుకంటే కోపం ద్వారా దేవుడు ఆశించే నీతి కలుగదు. అందువల్ల దుర్మార్గాల్ని, అవినీతిని పూర్తిగా వదిలివెయ్యండి. మీలో నాటుకుపోయిన దైవసందేశాన్ని విధేయతతో ఆచరించండి. అది మీ ఆత్మల్ని రక్షించగలదు. దైవసందేశం చెప్పినట్లు చెయ్యండి. దాన్ని విని కూడా మీరు ఏమీ చెయ్యలేకపోతే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొన్న వాళ్ళవుతారు. దైవసందేశం విని అది చెప్పినట్లు చెయ్యని వాడు అద్దంలో తన ముఖం చూసుకొని తానేవిధంగా కనిపించాడో వెంటనే మరచిపోయే వ్యక్తిలాంటివాడు. స్వేచ్ఛను కలిగించే పరిపూర్ణమైన ధర్మశాస్త్రాన్ని పరిశీలిస్తూ దాని ప్రకారం జీవించేవాడు క్రియచేస్తున్న వానిగా పరిగణింపబడతాడు. అలాంటివాడు విని మరచిపోయే రకం కాదు. అతడు చేస్తున్న ప్రతీ కార్యము ఫలించాలని దేవుడు అతణ్ణి దీవిస్తాడు. తానొక విశ్వాసినని తలంచి తన నాలుకకు కళ్ళెం వేసుకోకపోతె తనకు తాను మోసం చేసుకొన్నవాడౌతాడు. అతని విశ్వాసం నిష్ప్రయోజనమౌతుంది.
యాకోబు 1:1-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవునియొక్కయు ప్రభువైన యేసుక్రీస్తుయొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదిరియున్న పండ్రెండు గోత్రములవారికి శుభమని చెప్పి వ్రాయునది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి. మీరు సంపూర్ణులును, అనూ నాంగులును, ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచు కొనరాదు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను. ఏలయనగా ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును. సూర్యుడు దయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును; ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు–నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేప్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనా గమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యమువలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతిమనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. ఎవ డైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా అయితే స్వాతంత్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును. ఎవ డైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనినయెడల వాని భక్తి వ్యర్థమే.