యెషయా 41:1-10

యెషయా 41:1-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ద్వీపాల్లారా, నా ఎదుట మౌనంగా ఉండండి! దేశాలు తమ బలాన్ని నూతన పరచుకోవాలి! వారు ముందుకు వచ్చి మాట్లాడాలి; తీర్పు తీర్చే స్థలం దగ్గర మనం కలుసుకుందాము. “తన సేవ కోసం తూర్పు నుండి ఒకరిని పురికొల్పి నీతిలో పిలిచింది ఎవరు? ఆయన అతనికి దేశాలు అప్పగిస్తారు రాజులను అతని ఎదుట అణచివేస్తారు. అతడు తన ఖడ్గంతో వాటిని ధూళిగా చేస్తాడు, తన విల్లుతో గాలికి ఎగిరే పొట్టులా మారుస్తాడు. అతడు వారిని వెంటాడుతాడు, ఇంతకుముందు తాను వెళ్లని దారైనా క్షేమంగా వెళ్తాడు. ఎవరు దీనిని ఆలోచించి జరిగించారు? మొదటి నుండి తరాలను పిలిచింది ఎవరు? యెహోవానైన నేనే; వారిలో మొదటి వారితో ఉంది నేనే, చివరి వరకు వారితో ఉండేది నేనే.” ద్వీపాలు దానిని చూసి భయపడుతున్నాయి; భూమి అంచులు వణుకుతున్నాయి. వారు వచ్చి చేరుతున్నారు; వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, “ధైర్యంగా ఉండండి!” అని ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. శిల్పి కంసాలివాన్ని ప్రోత్సహిస్తాడు, సుత్తితో నునుపు చేసేవాడు, “అది బాగుంది” అని అతుకు గురించి చెప్తూ దాగిలి మీద కొట్టే వానిని ప్రోత్సహిస్తాడు. ఇంకొకడు విగ్రహం కదలకుండా మేకులతో దానిని బిగిస్తాడు. “అయితే, నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేను ఏర్పరచుకున్న యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము వారసులారా, భూమి అంచుల నుండి నేను మిమ్మల్ని తీసుకువచ్చాను, మారుమూల ప్రాంతాల నుండి పిలుచుకున్నాను. నేను అన్నాను, ‘నీవు నా సేవకుడవు’; నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను త్రోసివేయలేదు. కాబట్టి భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను; దిగులుపడకు, నేను నీ దేవుడను. నేను నిన్ను బలపరచి నీకు సహాయం చేస్తాను; నీతిగల నా కుడిచేతితో నిన్ను ఆదరిస్తాను.

యెషయా 41:1-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

“ద్వీపాల్లారా, నా ఎదుట మౌనంగా ఉండి వినండి. జాతులు వచ్చి నూతన బలం పొందండి. వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడాలి. రండి, మనం కలిసి చర్చించి వివాదం తీర్చుకుందాం. నీతియుతమైన పరిచర్య జరిగించే ఇతణ్ణి తూర్పు నుండి ప్రేరేపించి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి రాజ్యాలను అప్పగిస్తున్నాడు, రాజులను అతనికి లోబరుస్తున్నాడు. అతని ఖడ్గానికి వారిని ధూళిలాగా అప్పగిస్తున్నాడు. అతని విల్లుకి వారిని ఎగిరిపోయే పొట్టులాగా అప్పగిస్తున్నాడు. అతడు వారిని తరుముతున్నాడు. తాను ఇంతకుముందు వెళ్ళని దారైనా సురక్షితంగా దాటిపోతున్నాడు. దీన్ని ఎవడు ఆలోచించి జరిగించాడు? ఆదినుండి మానవ జాతులను పిలిచిన వాడినైన యెహోవా అనే నేనే. నేను మొదటివాడిని, చివరి వారితో ఉండేవాణ్ణి. ద్వీపాలు చూసి దిగులు పడుతున్నాయి. భూదిగంతాలు వణకుతున్నాయి, ప్రజలు వచ్చి చేరుకుంటున్నారు. వారు ఒకడికొకడు సహాయం చేసుకుంటారు. ‘ధైర్యంగా ఉండు’ అని ఒకడితో ఒకడు చెప్పుకుంటారు. ‘అది బాగా ఉంది’ అని చెబుతూ శిల్పి కంసాలిని ప్రోత్సాహపరుస్తాడు. సుత్తెతో నునుపు చేసేవాడు దాగలి మీద కొట్టేవాణ్ణి ప్రోత్సాహపరుస్తాడు ఆ విగ్రహం కదిలిపోకుండా వారు మేకులతో దాన్ని బిగిస్తారు. నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేను ఎన్నుకున్న యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, భూదిగంతాల నుండి నేను నిన్ను తీసుకువచ్చాను. దూరంగా ఉన్న అంచుల నుండి నిన్ను పిలిచాను. నువ్వు నా దాసుడనీ, నిన్ను తోసిపుచ్చకుండా నేను నిన్నే ఎన్నుకున్నాననీ నీతో చెప్పాను. నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు. నేను నీ దేవుణ్ణి. దిగులు పడవద్దు. నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేస్తాను. నీతి అనే నా కుడిచేతితో నిన్ను ఆదుకుంటాను.

యెషయా 41:1-10 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా చెబుతున్నాడు: “దూర దేశాల్లారా, మౌనంగా ఉండి నా దగ్గరకు రండి. దేశాల్లారా, ధైర్యంగా ఉండండి. నా దగ్గరకు వచ్చి మాట్లాడండి. మనం కలిసికొందాం. ఎవరిది సరియైనదో నిర్ణయించేద్దాం. ఈ ప్రశ్నలకు నాకు జవాబు చెప్పండి: తూర్పునుండి వస్తోన్న ఆ మనిషిని మేల్కొలిపింది ఎవరు? మంచితనం నాతో కూడ నడుస్తుంది. అతడు తన ఖడ్గం ఉపయోగించి రాజ్యాలను ఓడిస్తాడు. వారు ధూళి అవుతారు. అతడు తన విల్లును ఉపయోగించి రాజులను జయిస్తాడు. వారు గాలికి కొట్టుకొని పోయే పొట్టులా పారిపోతారు. అతడు సైన్యాలను తరుముతాడు, ఎన్నడూ బాధనొందడు. అతడు అంతకు ముందు ఎన్నడూ వెళ్లని స్థలాలకు వెళ్తాడు. ఈ సంగతులు జరిగేట్టు చేసింది ఎవరు? ఇది ఎవరు చేశారు? ఆదినుండి మనుష్యులందరినీ పిలిచింది ఎవరు? యెహోవాను నేనే ఈ సంగతులను చేశాను. యెహోవాను నేనే మొట్ట మొదటి వాడ్ని ఆరంభానికి ముందే నేను ఇక్కడ ఉన్నాను. అన్నీ ముగింపు అయన తర్వాత కూడ నేను ఇక్కడ ఉంటాను. దూర దూర స్థలాలూ, మీరంతా చూచి భయపడండి. భూమ్మీద దూరంగా ఉన్న స్థలాలూ, మీరంతా భయంతో వణకండి. మీరంతా దగ్గరగా రండి, నా మాటలు వినండి. “పనివాళ్లూ, ఒకరికి ఒకరు సహాయం చేసుకొంటారు. ఒకరిని ఒకరు బలపర్చుకొంటారు. ఒక పనివాడు ఒక విగ్రహం చేసేందుకు కర్ర కోస్తాడు. ఆ వ్యక్తి కంసాలికి ప్రోత్సాహాన్ని ఇస్తాడు. మరో మనిషి సుత్తెతో లోహాన్ని మెత్తగా చేస్తాడు. అప్పుడు ఆ పనివాడు దాగలితో పని చేసేవాడ్ని ప్రోత్సహిస్తాడు. ‘ఈ పని బాగుంది, లోహం ఊడిపోదు’ అంటాడు ఈ చివరి పనివాడు. అందుచేత అతడు ఆ విగ్రహాన్ని ఒక పీటకు మేకులతో బిగిస్తాడు. విగ్రహం పడిపోదు. అది ఎప్పటికీ కదలదు.” యెహోవా చెబుతున్నాడు: “ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడివి యాకోబూ, నిన్ను నేను ఏర్పరచుకొన్నాను. నీవు అబ్రాహాము వంశంవాడివి. అబ్రాహామును నేను ప్రేమించాను. భూమిమీద నీవు చాలా దూరంగా ఉన్నావు. నీవు చాలా దూర దేశంలో ఉన్నావు. అయితే నేను నిన్ను పిలిచి, నీవు నా సేవకుడివి. నేను నిన్ను ఏర్పరచుకొన్నాను. నేను నీకు విరోధంగా తిరుగలేదు అని చెప్పాను. దిగులుపడకు, నేను నీతో ఉన్నాను. భయపడకు, నేను నీ దేవుణ్ణి. నేను నిన్ను బలంగా చేశాను. నేను నీకు సహాయం చేస్తాను. నేను మంచితనపు కుడిహస్తంతో నిన్ను బలపరుస్తాను.

యెషయా 41:1-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ద్వీపములారా, నాయెదుట మౌనముగా నుండుడి . జనములారా, నూతనబలము పొందుడి.వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను వ్యాజ్యెము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువానిని తూర్పు నుండి రేపి పిలిచినవాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు రాజులను లోబరచుచున్నాడు ధూళివలెవారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు ఎగిరిపోవు పొట్టువలె అతని వింటికి వారిని అప్పగించు చున్నాడు. అతడు వారిని తరుముచున్నాడు తాను ఇంతకుముందు వెళ్లనిత్రోవనే సురక్షితముగ దాటిపోవుచున్నాడు. ఎవడు దీని నాలోచించి జరిగించెను? ఆదినుండి మానవ వంశములను పిలిచినవాడనైన యెహోవానగు నేనే నేను మొదటివాడను కడవరివారితోను ఉండువాడను. ద్వీపములు చూచి దిగులుపడుచున్నవి భూదిగంతములు వణకుచున్నవి జనులు వచ్చి చేరుచున్నారు వారు ఒకనికొకడు సహాయము చేసికొందురు ధైర్యము వహించుమని యొకనితో ఒకడు చెప్పు కొందురు. అతుకుటనుగూర్చి –అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును సుత్తెతో నునుపుచేయువాడు దాగలి మీద కొట్టు వానిని ప్రోత్సాహపరచును విగ్రహము కదలకుండ పనివాడు మేకులతో దాని బిగించును. నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.