ద్వితీయోపదేశకాండము 30:1-10

ద్వితీయోపదేశకాండము 30:1-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

నేను మీ ముందుంచిన ఈ దీవెనలు, శాపాలన్నీ మీ మీదికి వచ్చి, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని చెదరగొట్టిన దేశాల్లో మీరు వాటిని హృదయంలో భద్రం చేసుకుని, మీరు మీ పిల్లలు మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగివచ్చి, ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ప్రతీదాని ప్రకారం మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణ ఆత్మతో ఆయనకు లోబడితే, మీ దేవుడైన యెహోవా మీ భాగ్యాలను పునరుద్ధరిస్తారు, మీపై కనికరం చూపించి ఆయన మిమ్మల్ని చెదరగొట్టిన అన్ని దేశాలన్నిటి నుండి మిమ్మల్ని మళ్ళీ సమకూరుస్తారు. మీరు ఆకాశం క్రింద అత్యంత సుదూర దేశానికి చెదరిపోయినప్పటికి, అక్కడినుండి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమకూర్చి తిరిగి తీసుకువస్తారు. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని మీ పూర్వికులకు చెందిన దేశానికి తీసుకువస్తారు. మీరు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. మీ పూర్వికులకంటే ఆయన మిమ్మల్ని వృద్ధిలోను, సంఖ్యలోను అధికం చేస్తారు. మీ దేవుడైన యెహోవా మీ హృదయాలను, మీ సంతతివారి హృదయాలను సున్నతి చేస్తారు. అప్పుడు మీరు ఆయనను మీ పూర్ణ హృదయం, మీ పూర్ణ ఆత్మతో ప్రేమించి జీవిస్తారు. మీ దేవుడైన యెహోవా ఈ శాపాలన్నింటినీ మిమ్మల్ని ద్వేషించే, మిమ్మల్ని హింసించే మీ శత్రువులపైకి తెస్తారు. మీరు తిరిగివచ్చిన తర్వాత యెహోవాకు లోబడి ఆయన ఆజ్ఞలన్నిటిని పాటిస్తారు. అప్పుడు మీ దేవుడైన యెహోవా మీ చేతిపనులన్నిటిలోను మీ గర్భఫలాల్లో మీ పశువుల పిల్లల్లోను మీ భూమిలోని పంటల్లోను మిమ్మల్ని వర్ధిల్ల చేస్తారు. యెహోవా మీ పూర్వికుల విషయంలో సంతోషించి మిమ్మల్ని అభివృద్ధి చేస్తారు. అయితే, మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయులై ఉండి, ఈ ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను శాసనాలను పాటించి మీ పూర్ణహృదయంతో మీ పూర్ణాత్మతో యెహోవా వైపు తిరగాలి.

ద్వితీయోపదేశకాండము 30:1-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

“నేను మీకు తెలియపరచిన ఈ విషయాలన్నీ అంటే దీవెనలు, శాపాలు మీ మీదికి వచ్చిన తరువాత మీ దేవుడు మిమ్మల్ని వెళ్లగొట్టించిన అన్ని రాజ్యాల్లో వాటిని గుర్తుకు తెచ్చుకుంటారు. అప్పుడు మీరూ, మీ పిల్లలూ మీ దేవుడైన యెహోవా వైపు తిరిగితే, ఈవేళ నేను మీకాజ్ఞాపించే వాటి ప్రకారం మీరు హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో ఆయన మాట వింటే మీ దేవుడైన యెహోవా చెరలో ఉన్న మిమ్మల్ని మళ్ళీ రప్పిస్తాడు. ఆయన మిమ్మల్ని కనికరించి, మీ యెహోవా దేవుడు ఏ ప్రజల్లోకి మిమ్మల్ని చెదరగొట్టాడో వారందరిలో నుంచి మిమ్మల్ని సమకూర్చి ఇక్కడికి తీసుకువస్తాడు. చెదిరిపోయిన మీలో ఎవరైనా భూమి దిగంతాల్లో ఉన్నప్పటికీ అక్కడ నుంచి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమకూర్చి అక్కడ నుంచి తీసుకు వస్తాడు. మీ పూర్వీకులు స్వాధీనం చేసుకున్న దేశానికి మీ యెహోవా దేవుడు మిమ్మల్ని చేరుస్తాడు. మీరు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఆయన మీకు మేలు చేసి మీ పూర్వీకుల కంటే మిమ్మల్ని అసంఖ్యాకంగా చేస్తాడు. మీరు బతకడానికి, హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మీ యెహోవా దేవుని ప్రేమించేలా మీ యెహోవా దేవుడు మీ హృదయానికీ మీ పిల్లల హృదయానికీ సున్నతి చేస్తాడు. మిమ్మల్ని హింసించిన మీ శత్రువుల మీదికీ మిమ్మల్ని ద్వేషించినవారి మీదికీ మీ యెహోవా దేవుడు ఆ శాపాలన్నీ రప్పిస్తాడు. మీరు తిరిగి వచ్చి యెహోవా మాట వింటారు. నేనిప్పుడు మీకాజ్ఞాపించే ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం ప్రవర్తిస్తారు. మీ యెహోవా దేవుడు, మీరు చేతులతో చేసే పనులన్నిటిలో, మీ గర్భఫలం విషయంలో మీ పశువుల గర్భఫలం విషయంలో మీ భూపంట విషయంలో మీకు అభివృద్ధి కలిగిస్తాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాసిన ఆయన ఆజ్ఞలనూ, చట్టాలనూ మీరు పాటిస్తే మీ యెహోవా దేవుని మాట విని, మీ హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మీ యెహోవా దేవుని వైపు తిరిగితే, యెహోవా మీ పూర్వీకుల గురించి సంతోషించినట్టు మీకు మేలు చేయడానికి మీపట్ల మళ్ళీ సంతోషిస్తాడు.

ద్వితీయోపదేశకాండము 30:1-10 పవిత్ర బైబిల్ (TERV)

“నేను చెప్పిన ఈ సంగతులన్నీ మీకు సంభవిస్తాయి. ఆశీర్వాదాల నుండి మంచి సంగతులు, శాపాలనుండి చెడు సంగతులు మీకు సంభవిస్తాయి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఇతర దేశాలకు పంపించివేస్తాడు. అప్పుడు మీరు ఈ విషయాలను గూర్చి తలుస్తారు. ఆ సమయంలో మీరూ, మీ సంతానం మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి వస్తారు. నేడు నేను మీకు యిచ్చిన ఆయన ఆదేశాలన్నింటికీ పూర్తిగా విధేయులై, మీ హృదయపూర్తిగా మీరు ఆయనను వెంబడిస్తారు. అప్పుడు మీ దేవుడైన యెహోవా మీ మీద దయ చూపిస్తాడు. యెహోవా మిమ్మల్ని మళ్లీ స్వతంత్రుల్ని చేస్తాడు. ఆయన మిమ్మల్ని పంపించిన దేశాలనుండి తిరిగి వెనుకకు తీసుకొనివస్తాడు. ఆయన మిమ్మల్ని చివరి భూదిగంతాలవరకు పంపించినాసరే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమావేశపర్చి, అక్కడనుండి తిరిగి వెనుకకు తీసుకొని వస్తాడు. యెహోవా మిమ్మల్ని మీ పూర్వీకుల దేశానికి తీసుకొనివస్తాడు, ఆ దేశం మీదే అవుతుంది. యెహోవా మీకు మేలు చేస్తాడు. మీ పూర్వీకులకు ఉన్నదానికంటె మీకు ఎక్కువ ఉంటుంది. మీ దేవుడైన యెహోవా మీ యొక్కయు మీ సంతానం యొక్కయు హృదయాలు సున్నతి చేస్తాడు. దాన్ని బట్టే మీ దేవుడైన యెహోవాను మీరు మీ నిండు హృదయంతోను, మీ నిండు మనస్సుతోను ప్రేమించి బతుకుతారు. “మిమ్మల్ని ద్వేషించి. మీకు కష్టం కలిగించే మీ శత్రువుల మీద ఆ శాపాలన్నింటినీ మీ దేవుడైన యెహోవా రప్పిస్తాడు. మరియు మీరు తిరిగి యెహోవాకు విధేయులవుతారు. ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆయన ఆదేశాలన్నింటికీ మీరు విధేయులవుతారు. మీ దేవుడైన యెహోవా మీరు చేసే ప్రతిదీ విజయవంతం చేస్తాడు. ఆయన మీకు చాలా మంది పిల్లల్ని ఇచ్చి ఆశీర్వదిస్తాడు. విస్తారమైన దూడలను ఇచ్చి మీ మందలను, మంచి పంటలతో మీ పొలాలను ఆయన ఆశీర్వదిస్తాడు. యెహోవా మీ యెడల మంచి జరిగిస్తాడు. యెహోవా మీ పూర్వీకులకు మేలు చేసి సంతోషించినట్టు, ఆయన మరల మీకు మేలు చేయటంలో ఆనందిస్తాడు. అయితే మీరు చేయాలని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినవాటిని మీరు చేయాలి. ఈ ధర్మశాస్త్రంలోని వ్రాయబడిన నియమాలు మీరు పాటించాలి, ఆదేశాలకు మీరు విధేయులు కావాలి, మీ నిండు హృదయంతో, మీ ఆత్మతో మీరు మీ దేవుడైన యెహోవా తట్టు తిరగాలి. అప్పుడు ఈ మంచి విషయాలన్నీ మీకు సంభవిస్తాయి.

ద్వితీయోపదేశకాండము 30:1-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నేను నీకు వినిపించిన యీ సంగతులన్నియు, అనగా దీవెనయు శాపమును నీమీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్లగొట్టించిన సమస్త జనములమధ్యను వాటిని జ్ఞాపకము చేసికొని, నీ దేవుడైన యెహోవావైపు తిరిగి, నేడు నేను నీ కాజ్ఞాపించు సమస్తమునుబట్టి నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను ఆయన మాట నీవును నీ సంతతివారును వినినయెడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలోనుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. మీలో నెవరైన ఆకాశ దిగంతములకు వెళ్లగొట్టబడినను అక్కడనుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడనుండి రప్పిం చును. నీ పితరులకు స్వాధీన పరచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాని స్వాధీనపరచు కొందువు; ఆయన నీకు మేలుచేసి నీ పితరులకంటె నిన్ను విస్తరింప జేయును. మరియు నీవు బ్రదుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను, నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతివారి హృదయమునకును సున్నతి చేయును. అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువులమీదికిని నిన్ను ద్వేషించినవారిమీదికిని నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను తెప్పిం చును. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని, నేను నేడు నీ కాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని గైకొను చుందువు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని, నీ దేవుడైన యెహోవా మాట విని, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవావైపు మళ్లునప్పుడు యెహోవా నీ పితరులయందు ఆనందించినట్లు నీకు మేలుచేయుటకు నీయందును ఆనందించి నీవైపు మళ్లును.