ద్వితీయోపదేశకాండము 30:1-10

ద్వితీయోపదేశకాండము 30:1-10 TERV

“నేను చెప్పిన ఈ సంగతులన్నీ మీకు సంభవిస్తాయి. ఆశీర్వాదాల నుండి మంచి సంగతులు, శాపాలనుండి చెడు సంగతులు మీకు సంభవిస్తాయి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఇతర దేశాలకు పంపించివేస్తాడు. అప్పుడు మీరు ఈ విషయాలను గూర్చి తలుస్తారు. ఆ సమయంలో మీరూ, మీ సంతానం మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి వస్తారు. నేడు నేను మీకు యిచ్చిన ఆయన ఆదేశాలన్నింటికీ పూర్తిగా విధేయులై, మీ హృదయపూర్తిగా మీరు ఆయనను వెంబడిస్తారు. అప్పుడు మీ దేవుడైన యెహోవా మీ మీద దయ చూపిస్తాడు. యెహోవా మిమ్మల్ని మళ్లీ స్వతంత్రుల్ని చేస్తాడు. ఆయన మిమ్మల్ని పంపించిన దేశాలనుండి తిరిగి వెనుకకు తీసుకొనివస్తాడు. ఆయన మిమ్మల్ని చివరి భూదిగంతాలవరకు పంపించినాసరే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమావేశపర్చి, అక్కడనుండి తిరిగి వెనుకకు తీసుకొని వస్తాడు. యెహోవా మిమ్మల్ని మీ పూర్వీకుల దేశానికి తీసుకొనివస్తాడు, ఆ దేశం మీదే అవుతుంది. యెహోవా మీకు మేలు చేస్తాడు. మీ పూర్వీకులకు ఉన్నదానికంటె మీకు ఎక్కువ ఉంటుంది. మీ దేవుడైన యెహోవా మీ యొక్కయు మీ సంతానం యొక్కయు హృదయాలు సున్నతి చేస్తాడు. దాన్ని బట్టే మీ దేవుడైన యెహోవాను మీరు మీ నిండు హృదయంతోను, మీ నిండు మనస్సుతోను ప్రేమించి బతుకుతారు. “మిమ్మల్ని ద్వేషించి. మీకు కష్టం కలిగించే మీ శత్రువుల మీద ఆ శాపాలన్నింటినీ మీ దేవుడైన యెహోవా రప్పిస్తాడు. మరియు మీరు తిరిగి యెహోవాకు విధేయులవుతారు. ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆయన ఆదేశాలన్నింటికీ మీరు విధేయులవుతారు. మీ దేవుడైన యెహోవా మీరు చేసే ప్రతిదీ విజయవంతం చేస్తాడు. ఆయన మీకు చాలా మంది పిల్లల్ని ఇచ్చి ఆశీర్వదిస్తాడు. విస్తారమైన దూడలను ఇచ్చి మీ మందలను, మంచి పంటలతో మీ పొలాలను ఆయన ఆశీర్వదిస్తాడు. యెహోవా మీ యెడల మంచి జరిగిస్తాడు. యెహోవా మీ పూర్వీకులకు మేలు చేసి సంతోషించినట్టు, ఆయన మరల మీకు మేలు చేయటంలో ఆనందిస్తాడు. అయితే మీరు చేయాలని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినవాటిని మీరు చేయాలి. ఈ ధర్మశాస్త్రంలోని వ్రాయబడిన నియమాలు మీరు పాటించాలి, ఆదేశాలకు మీరు విధేయులు కావాలి, మీ నిండు హృదయంతో, మీ ఆత్మతో మీరు మీ దేవుడైన యెహోవా తట్టు తిరగాలి. అప్పుడు ఈ మంచి విషయాలన్నీ మీకు సంభవిస్తాయి.