కీర్తనలు 112:1-9

కీర్తనలు 112:1-9 TSA

యెహోవాను స్తుతించండి. యెహోవాకు భయపడేవారు ధన్యులు, వారు ఆయన ఆజ్ఞలలో అధిక ఆనందాన్ని పొందుతారు. వారి పిల్లలు భూమిపై బలవంతులుగా ఉంటారు; యథార్థవంతుల తరం దీవించబడుతుంది. వారి ఇళ్ళలో ధనం, ఐశ్వర్యం ఉన్నాయి, వారి నీతి నిత్యం నిలిచి ఉంటుంది. దయ కనికరం గలవారికి నీతిమంతులకు, యథార్థవంతులకు చీకట్లో కూడా వెలుగు ఉదయిస్తుంది. దయతో అప్పు ఇచ్చేవారికి, తమ వ్యాపారాన్ని న్యాయంగా నిర్వహించే వారికి మేలు కలుగుతుంది. నీతిమంతులు ఎప్పటికీ కదల్చబడరు; వారు నిత్యం జ్ఞాపకంలో ఉంటారు. దుర్వార్తల వలన వారు భయపడరు; యెహోవా అందలి నమ్మకం చేత వారి హృదయం స్థిరంగా ఉంటుంది. వారి హృదయాలు భద్రంగా ఉన్నాయి, వారికి భయం ఉండదు; చివరికి వారు తమ శత్రువులపై విజయంతో చూస్తారు. వారు ధారాళంగా బహుమానాలను పేదలకు పంచిపెట్టారు, వారి నీతి నిరంతరం నిలిచి ఉంటుంది; వారి కొమ్ము ఘనత పొంది హెచ్చింపబడుతుంది.