ఫిలిప్పీ పత్రిక 1:21-30

ఫిలిప్పీ పత్రిక 1:21-30 TSA

నాకైతే జీవించడం క్రీస్తు కొరకే, మరణమైతే లాభము. ఒకవేళ నేను శరీరంలోనే జీవించాల్సి ఉంటే, ఇది నాకు ఫలభరితమైన ప్రయాసం అవుతుంది. అయినా నేను ఏమి కోరుకోవాలి? నాకు తెలియదు! ఈ రెండింటికీ మధ్య నేను నలిగిపోతున్నాను. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తుతో కూడా ఉండాలని నా ఆశ, అది నాకు చాలా మంచిది. అయితే నేను శరీరంతో ఉండడం మీకు ఎంతో అవసరము. మీరు విశ్వాసంలో వృద్ధి చెంది ఆనందించడానికి, నేను జీవిస్తూ, మీ అందరితో కలసి ఉంటానని నాకు తెలుసు. ఇలాంటి నమ్మకం కలిగి, నేను మరల మీతో కలిసి ఉండడం వల్ల నన్ను బట్టి క్రీస్తు యేసులో మీకున్న ఆనందం అధికమవుతుంది. ఏమి జరిగినా, క్రీస్తు సువార్తకు తగినట్లు మీరు ప్రవర్తించండి. నేను వచ్చి మిమ్మల్ని చూసినా లేదా నేను లేనప్పుడు మీ గురించి వినినా, మిమ్మల్ని వ్యతిరేకించేవారికి మీరు ఏ విధంగాను భయపడక, మీరు ఒకే ఆత్మలో దృఢంగా నిలిచి, సువార్త విశ్వాసం కోసం మీరు ఒకటిగా పోరాడుతున్నారని నేను తెలుసుకుంటాను. వారు నాశనం అవుతారు కాని మీరు రక్షించబడతారు, అది వారికి దేవుడు ఇచ్చే ఒక సూచన. మీరు క్రీస్తులో విశ్వాసం ఉంచడమే కాదు, ఆయన కోసం శ్రమలు కూడా అనుభవించాలని ఆయన తరపున ఇది మీకు ఇవ్వబడింది, నేను ఏ శ్రమలు అనుభవించడం మీరు చూశారో ఇప్పుడు మీరు ఆ శ్రమల గుండానే వెళ్తున్నారు, అయితే నేను కూడా ఇంకా శ్రమలగుండా వెళ్లాల్సి ఉంది.