సంఖ్యా 14:26-45

సంఖ్యా 14:26-45 TSA

యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు: “ఎంతకాలం ఈ చెడు సమాజం నా మీద సణుగుతారు? ఈ సణిగే ఇశ్రాయేలీయుల ఫిర్యాదులు నేను విన్నాను. కాబట్టి వారికి చెప్పండి, ‘నా జీవం తోడు, మీరు సణుగులను నేను విన్న ప్రకారం నేను మీకు చేస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు: ఈ అరణ్యంలో మీ శవాలు రాలిపోతాయి అనగా ఇరవై సంవత్సరాలకు పైబడి జనాభా లెక్కలో నమోదై యుండి, నాకు వ్యతిరేకంగా సణిగిన ప్రతి ఒక్కరు రాలిపోతారు. నేను చేయెత్తి వాగ్దానం చేసిన భూమిలో యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మీలో ఏ ఒక్కరు ప్రవేశించరు. దోచుకోబడతారని నీవు చెప్పిన నీ పిల్లల విషయానికొస్తే, నీవు తిరస్కరించిన భూమిని అనుభవించడానికి నేను వారిని తీసుకువస్తాను. మీ విషయానికొస్తే, మీ శవాలు ఈ అరణ్యంలో రాలిపోతాయి. మీ పిల్లలు ఇక్కడ నలభై సంవత్సరాలు కాపరులుగా ఉంటారు, మీలో చివరి శవం ఈ అరణ్యంలో రాలిపోయే వరకు, మీ నమ్మకద్రోహాన్ని బట్టి మీ వ్యభిచారశిక్షను భరిస్తారు. నలభై సంవత్సరాల వరకు మీరు దేశాన్ని వేగు చూసిన ప్రతి నలభై రోజులకు ఒక సంవత్సరం, మీ దోషశిక్షను మీరు భరించి నేను మీకు వ్యతిరేకంగా ఉంటే ఎలా ఉంటుందో మీరు తెలుసుకుంటారు.’ యెహోవానగు నేనే స్వయంగా చెప్తున్నాను, నాకు వ్యతిరేకంగా పోగయిన ఈ దుష్ట సమాజం మొత్తానికి, నేను ఖచ్చితంగా ఇవి చేస్తాను. ఈ అరణ్యంలో వారు అంతరిస్తారు; ఇక్కడ వారు చస్తారు.” మోషే, ఆ దేశాన్ని పరిశీలించండి, అని పంపిన మనుష్యులు, వెళ్లి తిరిగివచ్చి దాని గురించి తప్పుడు నివేదిక తెచ్చి సమర్పించి, సర్వసమాజం సణుగునట్లు చేశారు తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడానికి బాధ్యులైన వీరు మొత్తబడి, యెహోవా ఎదుట తెగులు ద్వార చనిపోయారు. ఆ దేశాన్ని పరిశీలించిన వారిలో నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు మాత్రమే బ్రతికారు. మోషే ఇశ్రాయేలీయులందరికి ఈ విషయం చెప్పినప్పుడు, వారు చాలా ఏడ్చారు. మరుసటిరోజు ఉదయాన్నే వారు, “నిజంగా మేము పాపం చేశాము. ఇప్పుడు మేము యెహోవా వాగ్దానం చేసిన దేశానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం!” అని అంటూ, కొండసీమ మీదున్న ఎత్తైన ప్రదేశానికి బయలుదేరారు. కానీ మోషే, “ఎందుకు మీరు యెహోవా ఆజ్ఞను మీరుతున్నారు? ఇదిలా కొనసాగదు! యెహోవా మీతో లేడు కాబట్టి మీరు వెళ్లకండి. మీరు శత్రువుల చేతిలో ఓడిపోతారు, ఎందుకంటే అమాలేకీయులు, కనానీయులు అక్కడ మీ మీదికి వస్తారు, మీరు వారి ఖడ్గం చేత చస్తారు. ఎందుకంటే మీరు యెహోవా మీద తిరుగుబాటు చేశారు కాబట్టి ఆయన మీతో ఉండరు” అని చెప్పాడు. అయినాసరే, వారు అహంకారంతో మోషే గాని, యెహోవా నిబంధన మందసం గాని శిబిరం నుండి కదలక పోయినా, కొండసీమ ప్రాంతానికి ఎక్కి వెళ్లారు. అప్పుడు కొండ సీమలో నివసిస్తున్న అమాలేకీయులు కనానీయులు దిగి వచ్చి, ఇశ్రాయేలీయులపై దాడి చేసి, హోర్మా వరకు తరిమికొట్టారు.