మత్తయి సువార్త 7:15-27

మత్తయి సువార్త 7:15-27 TSA

“అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రెతోలు కప్పుకుని మీ దగ్గరకు వస్తారు; లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలంతో మీరు వారిని గుర్తించగలరు. ముళ్ళపొదల్లో ద్రాక్షపండ్లను, పల్లేరులాంటి ముళ్ళ మొక్కల్లో అంజూర పండ్లను ప్రజలు కోస్తారా? ప్రతి మంచి చెట్టు మంచి పండ్లు కాస్తుంది. చెడ్డ చెట్టు చెడ్డపండ్లు కాస్తుంది. మంచి చెట్టు చెడ్డపండ్లు కాయదు, చెడ్డ చెట్టు మంచి పండ్లు కాయదు. మంచి పండ్లు కాయని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడుతుంది. అలాగే వారి ఫలాన్నిబట్టి మీరు వారిని గుర్తించగలరు. “ ‘ప్రభువా, ప్రభువా’ అని పిలిచే ప్రతి ఒక్కరు పరలోకరాజ్యంలో ప్రవేశించరు. కాని పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్తప్రకారం చేసేవారే ప్రవేశిస్తారు. ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభువా, ప్రభువా, మేము నీ పేరట ప్రవచించలేదా? నీ పేరట దయ్యాలను వెళ్లగొట్టలేదా? నీ పేరట అనేక అద్భుతాలను చేయలేదా?’ అని అంటారు. అప్పుడు నేను వారితో, ‘మీరెవరో నాకు తెలియదు. దుష్ట కార్యాలు చేసేవారలారా, నా దగ్గర నుండి వెళ్లిపొండి!’ అని చెప్తాను. “కాబట్టి నేను చెప్పిన ఈ మాటలు విని, వాటి ప్రకారం చేసేవారు బండ మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగలవారిని పోలినవారు. వాన కురిసి వరదలు వచ్చి గాలులు వీచి ఆ ఇంటిని తాకినా ఆ ఇల్లు కూలిపోలేదు, ఎందుకంటే దాని పునాది బండ మీద వేయబడింది. అయితే నా మాటలు విని వాటి ప్రకారం చేయనివారు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న తెలివిలేనివారిని పోలినవారు. వాన కురిసి వరదలు వచ్చి గాలులు వీచి ఆ ఇంటిని తాకాయి. అప్పుడు పెద్ద శబ్దంతో అది కూలిపోయింది.”