మత్తయి సువార్త 24:23-51

మత్తయి సువార్త 24:23-51 TSA

ఆ కాలంలో ఎవరైనా, ‘ఇదిగో, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు!’ లేదా, ‘ఆయన అక్కడ ఉన్నాడు!’ అని చెప్పితే, నమ్మకండి. ఎందుకంటే అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి దేవుడు ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేయడానికి గొప్ప సూచకక్రియలను, అద్భుతాలను చేస్తారు. చూడండి, ఈ విషయాలను నేను మీకు ముందుగానే చెప్పాను. “కాబట్టి ఎవరైనా, ‘ఇదిగో, ఆయన అరణ్యంలో ఉన్నాడు’ అని మీతో చెబితే, వెళ్లకండి; లేదా ‘ఇదిగో ఆయన ఇక్కడ, లోపలి గదిలో ఉన్నాడు’ అని చెప్పితే నమ్మకండి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనబడుతుందో, అలాగే మనుష్యకుమారుని రాకడ ఉంటుంది. ఎక్కడ పీనుగు ఉంటే అక్కడ గద్దలు పోగవుతాయి. “ఆ శ్రమకాలం ముగిసిన వెంటనే, “ ‘సూర్యుడు నల్లగా మారుతాడు, చంద్రుడు తన కాంతిని కోల్పోతాడు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి, ఆకాశ సంబంధమైనవి చెదిరిపోతాయి.’ “అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది. భూప్రజలందరు మనుష్యకుమారుడు తన ప్రభావంతో, గొప్ప మహిమతో ఆకాశ మేఘాల మీద రావడం చూసి ప్రజలు రొమ్ము కొట్టుకొంటూ రోదిస్తారు. గొప్ప బూర శబ్దంతో పిలుపుతో ఆయన తన దూతలను పంపుతారు, వారు నలుదిక్కుల నుండి, ఆకాశాల ఒక చివర నుండి మరొక చివర వరకు ఆయనచేత ఎన్నుకోబడిన వారిని పోగుచేస్తారు. “అంజూర చెట్టును చూసి ఒక పాఠం నేర్చుకోండి: అంజూర కొమ్మలు లేతవై చిగురిస్తున్నప్పుడు వేసవికాలం సమీపంగా ఉందని మీకు తెలుస్తుంది. ఆ ప్రకారంగానే, ఈ సంగతులన్ని జరుగుతున్నాయని మీరు చూసినప్పుడు, ఆయన రాకడ దగ్గరలో, ద్వారం దగ్గరే ఉందని మీరు తెలుసుకోండి. ఇవన్నీ జరిగే వరకు, ఈ తరం గతించదని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను. ఆకాశం భూమి గతించిపోతాయి గాని నా మాటలు ఏమాత్రం గతించవు. “అయితే ఆ దినం గురించి ఆ సమయం గురించి ఎవరికి తెలియదు, కనీసం పరలోకంలోని దూతలకు గాని, తన కుమారునికి గాని తెలియదు. కేవలం తండ్రికి మాత్రమే తెలుసు, నోవహు దినాల్లో ఎలా ఉన్నదో, మనుష్యకుమారుని రాకడలో కూడా అలాగే ఉంటుంది. జలప్రళయానికి ముందు దినాల్లో, నోవహు ఓడలోనికి వెళ్లిన రోజు వరకు, ప్రజలు తింటూ, త్రాగుతూ, పెండ్లి చేసుకొంటూ, పెండ్లికిస్తూ ఉన్నారు. ఆ జలప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పోయే వరకు వారికి తెలియలేదు. మనుష్యకుమారుని రాకడ కూడా అలాగే ఉంటుంది. ఆ సమయంలో ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు కొనిపోబడతారు ఇంకొకరు విడవబడతారు. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతుంటారు, ఒక స్త్రీ కొనిపోబడుతుంది ఇంకొక స్త్రీ విడవబడుతుంది. “కాబట్టి ఏ దినం మీ ప్రభువు వస్తాడో మీకు తెలియదు, కాబట్టి మెలకువగా ఉండండి. ఈ విషయం అర్థం చేసుకోండి: దొంగ రాత్రి ఏ జామున వస్తాడో ఒకవేళ ఇంటి యజమానికి తెలిస్తే, అతడు తన ఇంటికి కన్నం వేయకుండా మెలకువగా ఉంటాడు. కాబట్టి మనుష్యకుమారుడు మీరు ఎదురు చూడని సమయంలో వస్తారు, కాబట్టి మీరు సిద్ధపడి ఉండండి. “యజమాని తన ఇంట్లోని పనివారికి తగిన సమయాల్లో భోజనం పెట్టి, వారిని పర్యవేక్షించడానికి వారిపై పర్యవేక్షకునిగా నియమించడానికి, నమ్మకమైన, జ్ఞానం కలిగిన సేవకుడు ఎవడు? యజమాని తిరిగి వచ్చినప్పుడు ఆ సేవకుడు అలా చేస్తూ కనిపించడం మంచిది. ఆ యజమాని తన యావదాస్తి మీద అతన్ని అధికారిగా ఉంచుతాడని, నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కాని ఒకవేళ ఆ సేవకుడు చెడ్డవాడైతే, ‘నా యజమాని తిరిగి రావడం ఆలస్యం చేస్తున్నాడు’ అని తన మనస్సులో అనుకుని, తన తోటి సేవకులను కొట్టడం మొదలుపెట్టి త్రాగుబోతులతో కలిసి తిని త్రాగుతూ ఉంటాడు. అతడు ఊహించని రోజున ఊహించని సమయంలో ఆ సేవకుని యజమాని వస్తాడు. అతడు వాన్ని ముక్కలుగా నరికి వేషధారులతో అతనికి చోటు ఇస్తాడు, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.