మత్తయి సువార్త 2:7-15
మత్తయి సువార్త 2:7-15 TSA
అప్పుడు హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనిపించిన ఖచ్చితమైన సమయమేదో వారిని అడిగి తెలుసుకున్నాడు. తర్వాత ఆయన వారితో, “మీరు వెళ్లి ఆ శిశువు కోసం జాగ్రత్తగా వెదకి మీరు అతన్ని కనుగొనగానే నాకు చెప్పండి. అప్పుడు నేను కూడా వచ్చి ఆయనను ఆరాధిస్తాను” అని చెప్పి బేత్లెహేముకు పంపించాడు. వారు రాజు మాటలు విని బయలుదేరి వెళ్తున్నప్పుడు, తూర్పు దిక్కున వారు చూసిన నక్షత్రం వారి ముందు వెళ్తూ ఆ శిశువు ఉన్న స్థలం మీదికి వచ్చి ఆగింది. వారు ఆ నక్షత్రాన్ని చూసి చాలా ఆనందించారు. వారు ఆ ఇంట్లోకి వెళ్లి ఆ శిశువును తల్లియైన మరియను చూసి, వంగి నమస్కరించి ఆయనను ఆరాధించారు. తర్వాత వారు తమ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి బోళమును ఆయనకు కానుకలుగా సమర్పించారు. హేరోదు రాజు దగ్గరకు తిరిగి వెళ్లకూడదని కలలో వారు హెచ్చరించబడి వేరే దారిలో తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు. వారు వెళ్లిన తర్వాత ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి, “ఈ శిశువును చంపాలని హేరోదు రాజు వెదుకుతున్నాడు కాబట్టి నీవు శిశువును తల్లిని తీసుకుని ఈజిప్టుకు పారిపోయి నేను నీతో చెప్పే వరకు అక్కడే ఉండు” అని చెప్పాడు. కాబట్టి యోసేపు లేచి ఆ రాత్రి సమయంలోనే శిశువును తల్లియైన మరియను తీసుకుని ఈజిప్టుకు బయలుదేరి వెళ్లి, హేరోదు మరణించే వరకు అక్కడే ఉన్నాడు. “ఈజిప్టులో నుండి నేను నా కుమారుని పిలిచాను” అని ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాటలు ఇలా నెరవేరాయి.




