మత్తయి సువార్త 18:10-20
మత్తయి సువార్త 18:10-20 TSA
“ఈ చిన్నపిల్లల్లో ఒకరిని కూడా తక్కువగా చూడకండి, ఎందుకంటే పరలోకంలో ఉన్న వీరి దూతలు ఎల్లప్పుడు పరలోకంలోని నా తండ్రి ముఖాన్ని చూస్తూ ఉంటారని మీతో చెప్తున్నాను. ఎట్లనగా, ‘తప్పిపోయిన దానిని వెదకి రక్షించడానికే మనుష్యకుమారుడు వచ్చాడు.’ “ఒక వ్యక్తికి వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోతే అతడు ఏమి చేస్తాడని మీకు అనిపిస్తుంది? తొంభై తొమ్మిది గొర్రెలను కొండలమీద వదిలిపెట్టి, తప్పిపోయిన ఆ ఒక గొర్రెను వెదకడానికి వెళ్లడా? ఒకవేళ అతనికి అది దొరికితే, తొంభై తొమ్మిది గొర్రెల కంటే తప్పిపోయి దొరికిన ఆ గొర్రె గురించి ఎక్కువగా సంతోషిస్తాడని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగే ఈ చిన్నవారిలో ఒకరైనా నశించడం పరలోకంలో ఉన్న మీ తండ్రికి ఇష్టం లేదు. “ఒకవేళ నీ సహోదరుడు లేదా సహోదరి పాపం చేస్తే నీవు వెళ్లి వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పు గురించి వారిని గద్దించు. ఒకవేళ వారు నీ మాట వింటే నీవు వారిని సంపాదించుకున్నట్లే. వారు వినకపోతే, ‘ఇద్దరు లేదా ముగ్గురు సాక్ష్యాల మీద ప్రతి విషయం స్థిరపరచబడునట్లు’ నీతో పాటు ఒకరిని లేదా ఇద్దరిని వెంటబెట్టుకొని వెళ్లు. వారు ఇంకా మాట వినకపోతే, ఆ సంగతిని సంఘానికి తెలియజేయండి. వారు సంఘం మాట కూడా వినకపోతే వారిని ప్రక్కన పెట్టి ఒక దేవుని ఎరుగనివారిగా లేదా పన్ను వసూలుచేసేవారిగా పరిగణించండి. “మీరు భూమి మీద వేటిని బంధిస్తారో అవి పరలోకంలో బంధింపబడతాయి, అలాగే భూమి మీద వేటిని విప్పుతారో అవి పరలోకంలో విప్పబడతాయని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. “ఇంకొక విషయం, ఒకవేళ మీలో ఇద్దరు దేన్ని గురించియైన భూమి మీద ఏకీభవించి అడిగితే అది పరలోకంలో నా తండ్రి వారి పట్ల దానిని జరిగిస్తాడని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరట కూడుకుని ఉంటారో అక్కడ నేను వారి మధ్య ఉంటాను” అని చెప్పారు.

