మత్తయి సువార్త 13:1-12

మత్తయి సువార్త 13:1-12 TSA

అదే రోజు యేసు ఇంటి నుండి వెళ్లి సముద్రం ఒడ్డున కూర్చున్నారు. గొప్ప జనసమూహాలు తన చుట్టూ గుమిగూడుతున్నారని యేసు ఒక పడవను ఎక్కి కూర్చున్నారు, ప్రజలంతా ఒడ్డున నిలబడి ఉన్నారు. అప్పుడు ఆయన ఉపమానాలతో వారికి చాలా సంగతులను ఈ విధంగా చెప్పారు: “ఒక రైతు విత్తనాలను చల్లడానికి వెళ్లాడు. విత్తనాలు చల్లేటప్పుడు, కొన్ని దారి ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేశాయి. మరికొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలలో పడ్డాయి. మట్టి లోతు లేకపోయినా అవి త్వరగానే మొలకెత్తాయి. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు, ఆ మొలకలు వాడిపోయి వాటికి వేరు లేదా అవి ఎండిపోయాయి. మరికొన్ని విత్తనాలు ముళ్ళపొదల్లో పడ్డాయి. ఆ ముళ్ళపొదలు పెరిగి వాటిని అణచి వేశాయి. మరికొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి, అక్కడ అవి విత్తబడినవాటి కన్న వందరెట్లు, అరవైరెట్లు, ముప్పైరెట్లు అధికంగా పంటనిచ్చాయి. వినడానికి చెవులుగలవారు విందురు గాక!” అని అన్నారు. ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “నీవు ప్రజలతో ఉపమానరీతిగా ఎందుకు మాట్లాడుతున్నావు?” అని అడిగారు. అందుకు యేసు వారితో, “ఎందుకంటే పరలోక రాజ్యం గురించిన రహస్యాలకు సంబంధించిన జ్ఞానం మీకు ఇవ్వబడింది గాని వారికి ఇవ్వబడలేదు. కలిగినవానికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది, అతడు సమృద్ధిగా కలిగి ఉంటాడు. లేనివాని నుండి, వానికి కలిగి ఉన్నది కూడా తీసివేయబడుతుంది.