మత్తయి సువార్త 10:5-16

మత్తయి సువార్త 10:5-16 TSA

యేసు ఆ పన్నెండు మందికి ఈ సూచనలు ఇచ్చి పంపారు: “యూదేతరుల ప్రాంతాల్లోనికి గాని సమరయ పట్టణాలకు గాని వెళ్లకండి. ఇశ్రాయేలీయులలో తప్పిపోయిన గొర్రెల దగ్గరకు వెళ్లండి. మీరు వెళ్తూ, ‘పరలోక రాజ్యం సమీపించింది’ అనే సందేశాన్ని ప్రకటించండి. రోగులను స్వస్థపరచండి, చనిపోయినవారిని లేపండి, కుష్ఠురోగులను శుద్ధులుగా చేయండి, దయ్యాలను వెళ్లగొట్టండి. మీరు ఉచితంగా పొందుకున్నారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి. “మీ నడికట్టులో బంగారం గాని వెండి గాని రాగి గాని పెట్టుకోకండి. ప్రయాణం కోసం సంచి గాని రెండవ చొక్కా గాని చెప్పులు గాని చేతికర్ర గాని తీసుకెళ్లకండి, ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు. మీరు ఏ పట్టణంలో గాని గ్రామంలో గాని ప్రవేశించినప్పుడు అక్కడ యోగ్యులెవరో అడిగి తెలుసుకొని అక్కడినుండి వెళ్లేవరకు ఆ ఇంట్లోనే బసచేయండి. ఒక గృహంలో ప్రవేశించినప్పుడు ఆ ఇంటివారికి శుభమని చెప్పండి. ఆ ఇంటికి ఆ యోగ్యత ఉంటే మీ శాంతి ఆ ఇంటి మీద నిలుస్తుంది. ఆ యోగ్యత ఆ ఇంటికి లేకపోతే మీ శాంతి మీకే తిరిగి వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే లేదా మీ మాటలు వినకపోతే, ఆ ఇంటిని లేదా ఆ గ్రామాన్ని విడిచి వెళ్లేటప్పుడు మీ పాదాల దుమ్మును దులిపి వెళ్లండి. తీర్పు దినాన ఆ గ్రామానికి పట్టిన గతికంటే సొదొమ, గొమొర్రాల గతి భరించ గలదిగా ఉంటుందని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. “చూడండి, నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు పంపుతున్నాను. కాబట్టి మీరు పాముల్లా వివేకంగాను పావురాల్లా కపటం లేనివారిగాను ఉండండి.

సంబంధిత వీడియోలు