యెహోషువ 7:1-9

యెహోషువ 7:1-9 TSA

శపించబడిన వాటి విషయంలో ఇశ్రాయేలీయులు నమ్మకద్రోహులుగా ఉన్నారు. యూదా గోత్రపు వాడైన జెరహు కుమారుడు జబ్ది, జబ్ది కుమారుడు కర్మీ, కర్మీ కుమారుడైన ఆకాను వాటిలో కొన్నిటిని తీసుకున్నాడు. కాబట్టి యెహోవా కోపం ఇశ్రాయేలీయులపై రగులుకుంది. తర్వాత యెహోషువ యెరికో నుండి బేతేలుకు తూర్పున బేత్-ఆవెను సమీపంలో ఉన్న హాయికి మనుష్యులను పంపుతూ, “మీరు వెళ్లి ఆ ప్రదేశాన్ని వేగుచూసి రండి” అని చెప్పాడు. కాబట్టి వారు వెళ్లి హాయిని వేగు చూశారు. వారు యెహోషువ దగ్గరకు తిరిగివచ్చి, “హాయి మీదికి సైన్యమంతా వెళ్లాల్సిన అవసరం లేదు. దాన్ని స్వాధీనపరచుకోడానికి రెండు లేదా మూడువేలమందిని పంపండి చాలు, సైన్యమంతా అలసిపోనవసరం లేదు, ఎందుకంటే అక్కడ కొంతమంది మాత్రమే నివసిస్తున్నారు.” కాబట్టి ప్రజల్లో సుమారు మూడువేలమంది యోధులు వెళ్లారు; కానీ వారు హాయి ప్రజల ఎదుట నిలబడలేక పారిపోయారు, హాయి ప్రజలు వారిలో ముప్పై ఆరుగురిని చంపారు. వారు ఇశ్రాయేలీయులను పట్టణ ద్వారం నుండి రాతి గనుల వరకు కొండ దిగువన వారిని చంపారు. దీంతో ప్రజల గుండెలు భయంతో నీరుగారిపోయాయి. అప్పుడు యెహోషువ, తన బట్టలు చింపుకొని యెహోవా మందసం ముందు నేలమీద పడి, సాయంకాలం వరకు అక్కడే ఉన్నాడు. ఇశ్రాయేలు పెద్దలు కూడా అలాగే చేసి తమ తలలపై దుమ్ము చల్లుకున్నారు. యెహోషువ, “అయ్యో! ప్రభువైన యెహోవా! ఈ ప్రజలను యొర్దాను నదిని ఎందుకు దాటించావు? మమ్మల్ని నాశనం చేయమని అమోరీయుల చేతికి అప్పగించడానికా? మేము యొర్దాను అవతలి ఒడ్డున ఆగిపోవడానికి నిర్ణయించుకొని ఉంటే ఎంత బాగుండేది! ప్రభువా, మీ సేవకుని క్షమించు. ఇప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు తమ శత్రువును ఎదుర్కోలేక పారిపోయారు, నేను ఏమి చెప్పగలను? కనాను ప్రజలు, ఈ దేశంలో ఉన్న ఇతర ప్రజలు ఈ సంగతిని విని మమ్మల్ని చుట్టుముట్టి భూమి మీద మా పేరును తుడిచివేస్తారు. అప్పుడు మీ గొప్ప పేరుకు ఉన్న ఘనత కోసం ఏమి చేస్తావు?” అని ప్రార్థించాడు.