యిర్మీయా 31:1-22

యిర్మీయా 31:1-22 TSA

యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ఆ సమయంలో నేను ఇశ్రాయేలు కుటుంబాలన్నిటికీ దేవుడనై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు.” యెహోవా చెప్పేదేమిటంటే: “ఖడ్గం నుండి తప్పించుకున్న ప్రజలు అరణ్యంలో దయ పొందుతారు; ఇశ్రాయేలీయులకు విశ్రాంతి ఇవ్వడానికి నేను వస్తాను.” గతంలో యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలా అన్నారు: “నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను; నేను మారని ప్రేమతో నిన్ను నా వైపు ఆకర్షించాను. నేను నిన్ను మళ్ళీ నిర్మిస్తాను, ఇశ్రాయేలు కన్యా, నీవు తిరిగి కట్టబడతావు. మళ్ళీ నీవు నీ తంబురలు తీసుకుని ఆనందించే వారితో కలిసి నాట్యం చేస్తావు. మళ్ళీ సమరయ కొండలపై నీవు ద్రాక్షతోటలు నాటుతావు. రైతులు వాటిని నాటుతారు నీవు వాటి ఫలాలను తింటూ ఆనందిస్తావు. ఎఫ్రాయిం కొండలమీద కావలివారు, ‘రండి, మనం సీయోనుకు, మన దేవుడైన యెహోవా దగ్గరికి వెళ్దాం’ అని కేకలు వేసే రోజు వస్తుంది.” యెహోవా ఇలా అంటున్నారు: “యాకోబు కోసం ఆనందంగా పాడండి; దేశాల్లో గొప్పదాని కోసం కేకవేయండి. స్తుతులు చెల్లిస్తూ, ‘యెహోవా, ఇశ్రాయేలీయులలో మిగిలిన, నీ ప్రజలను రక్షించండి’ అని అనండి. చూడు, నేను వారిని ఉత్తర దేశం నుండి రప్పించి, భూమి మూలల నుండి వారిని పోగుచేస్తాను. వారిలో గ్రుడ్డివారు, కుంటివారు, తల్లి కాబోతున్నవారు పురిటినొప్పులు పడుతున్న స్త్రీలు ఉంటారు; గొప్ప గుంపు తరలివస్తుంది. వారు ఏడుస్తూ వస్తారు; నేను వారిని వెనుకకు తీసుకువస్తున్నప్పుడు వారు ప్రార్థన చేస్తారు. నేను వారిని నీటి ప్రవాహాల ప్రక్కన వారు తడబడని తిన్నని దారిలో నడిపిస్తాను ఎందుకంటే నేను ఇశ్రాయేలీయుల తండ్రిగా ఉంటాను, ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారునిగా ఉంటాడు. “జనులారా, యెహోవా మాట వినండి; సుదూర తీరప్రాంతాలలో ఇలా ప్రకటించండి: ‘ఇశ్రాయేలును చెదరగొట్టినవారే వారిని సమకూర్చి, కాపరిలా తన మందను కాపాడతాడు.’ ఎందుకంటే యెహోవా యాకోబును, వారికంటే బలవంతుల చేతిలో నుండి వారిని విడిపిస్తారు. వారు వచ్చి సీయోను కొండలమీద ఆనందంతో కేకలు వేస్తారు. వారు యెహోవా ఇచ్చిన సమృద్ధిని బట్టి ధాన్యం, క్రొత్త ద్రాక్షారసం ఒలీవ నూనెలను బట్టి, గొర్రెలకు పశువులకు పుట్టే పిల్లలను బట్టి సంతోషిస్తారు వారు బాగా నీరు పెట్టిన తోటలా ఉంటారు, వారు ఇకపై విచారించరు. అప్పుడు యువతులు యువకులు, వృద్ధులు సంతోషంతో నాట్యం చేస్తారు. నేను వారి దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను; నేను వారికి విచారానికి బదులుగా ఆదరణను, ఆనందాన్ని ఇస్తాను. నేను యాజకులను సమృద్ధితో తృప్తిపరుస్తాను, నా ప్రజలు నా సమృద్ధితో నింపబడతారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. యెహోవా చెప్పే మాట ఇదే: “రామాలో రోదన, గొప్ప ఏడ్పు వినబడుతుంది, రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఇక వారు లేరని, ఓదార్పు పొందడానికి నిరాకరిస్తుంది.” యెహోవా ఇలా చెప్తున్నారు: “ఏడవకుండా నీ స్వరాన్ని, కన్నీరు పెట్టుకోకుండా నీ కళ్లను అడ్డుకో, ఎందుకంటే నీ పనికి ప్రతిఫలం లభిస్తుంది, వారు శత్రువుల దేశం నుండి తిరిగి వస్తారు, అని యెహోవా ప్రకటిస్తున్నారు. కాబట్టి నీ సంతానానికి నిరీక్షణ ఉంది,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “మీ పిల్లలు తమ సొంత దేశానికి తిరిగి వస్తారు. “ఎఫ్రాయిం మూలుగులు నేను ఖచ్చితంగా విన్నాను: ‘శిక్షణ పొందని దూడలా ఉన్న నన్ను మీరు క్రమశిక్షణలో పెట్టారు, నేను క్రమశిక్షణ పొందాను. నన్ను బాగుచేయండి, నేను తిరిగి వస్తాను, ఎందుకంటే మీరే నా దేవుడైన యెహోవావు. నేను దారితప్పిన తర్వాత, పశ్చాత్తాపపడ్డాను; నేను అర్థం చేసుకున్న తర్వాత, నా రొమ్ము కొట్టుకున్నాను. నా యవ్వనంలో కలిగిన అవమానాన్ని భరిస్తూ, నేను సిగ్గుపడ్డాను అవమానపాలయ్యాను.’ ఎఫ్రాయిం నా ప్రియ కుమారుడు, నేను ఇష్టపడే బిడ్డ కాదా? నేను తరచుగా అతనికి వ్యతిరేకంగా మాట్లాడినా, నేను ఇప్పటికీ అతన్ని జ్ఞాపకముంచుకుంటాను. కాబట్టి నా హృదయం అతని కోసం ఆశపడుతుంది; అతని మీద నాకు చాలా కనికరం ఉంది,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “రహదారి గుర్తులను ఏర్పాటు చేయి; దారి చూపే స్తంభాలు పెట్టించు. నీవు వెళ్లే మార్గాన్ని, ఆ రహదారిని గమనించు. ఇశ్రాయేలు కన్యా, నీ పట్టణాలకు తిరిగి రా. విశ్వాసఘాతకురాలవైన కుమార్తె, ఇశ్రాయేలూ, నీవు ఎంతకాలం తిరుగుతావు? యెహోవా భూమిపై ఒక క్రొత్తదాన్ని సృష్టిస్తారు, స్త్రీ పురుషుని దగ్గరకు తిరిగి వస్తుంది.”