ఆది 4:1-15

ఆది 4:1-15 TSA

అటు తర్వాత ఆదాము హవ్వను లైంగికంగా కలుసుకున్నప్పుడు ఆమె గర్భవతియై కయీనుకు జన్మనిచ్చింది. “యెహోవా సహాయంతో నేను కుమారున్ని సంపాదించుకున్నాను” అని ఆమె అన్నది. తర్వాత అతని సహోదరుడైన హేబెలుకు జన్మనిచ్చింది. హేబెలు గొర్రెల కాపరి, కయీను వ్యవసాయకుడు. కోత సమయం వచ్చినప్పుడు కయీను పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబెలు కూడా తన గొర్రెలలో మొదటి సంతానంగా పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని అర్పణగా తెచ్చాడు. యెహోవా హేబెలును అతని అర్పణను అంగీకరించారు. కానీ కయీనును అతని అర్పణను ఆయన అంగీకరించలేదు. అందుకు కయీనుకు చాలా కోపం వచ్చి ముఖం మాడ్చుకున్నాడు. అప్పుడు యెహోవా కయీనుతో ఇలా అన్నారు, “నీవెందుకు కోపంతో ఉన్నావు? నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకొన్నావు? నీవు చేసేది మంచిదైతే నీవు అంగీకరించబడవా? నీవు సరియైనది చేయకపోతే, పాపం నీ వాకిట్లో పొంచుకొని ఉంది; అది నిన్ను పొందుకోవాలని వాంఛతో ఉంది, కానీ నీవు దానిని జయించాలి.” ఒక రోజు కయీను తన తమ్మున్ని పిలిచి, “మనం పొలానికి వెళ్దాం” అని అన్నాడు. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను హేబెలు మీద దాడి చేసి అతన్ని చంపేశాడు. అప్పుడు యెహోవా కయీనును, “నీ తమ్ముడు హేబెలు ఎక్కడున్నాడు?” అని అడిగారు. అందుకు అతడు, “ఏమో నాకు తెలియదు, నేనేమైన నా తమ్మునికి కావలివాడినా?” అని అన్నాడు. అందుకు యెహోవా, “నీవేం చేశావు? విను, నీ తమ్ముని రక్తం నేల నుండి నాకు మొరపెడుతుంది. ఇప్పుడు నీవు శపించబడ్డావు, నీ చేతి నుండి వచ్చిన నీ తమ్ముని రక్తాన్ని పీల్చుకున్న నేల నుండి నీవు తరిమివేయబడ్డావు. నీవు భూమిలో ఎంత కృషి చేసినా, అది ఇకమీదట నీకు మంచి పంటను ఇవ్వదు. నీవు భూమిపై విశ్రాంతి లేని దేశదిమ్మరిగా ఉంటావు” అని చెప్పారు. కయీను యెహోవాతో, “ఈ శిక్ష నేను భరించలేనంత కఠినమైనది. ఈ రోజు నన్ను ఈ ప్రాంతం నుండి వెళ్లగొట్టారు, మీ సన్నిధిలో నుండి దూరం చేశారు; నేను విశ్రాంతి లేని దేశదిమ్మరిని అవుతాను, నేను కంటపడితే నన్ను చంపేస్తారు” అని అన్నాడు. అయితే యెహోవా అతనితో, “అలా జరగదు; ఎవరైనా కయీనును చంపితే, వారు ఏడు రెట్లు ఎక్కువ శిక్ష అనుభవిస్తారు” అని అన్నారు. అప్పుడు యెహోవా కయీనును ఎవరూ చంపకుండ ఉండేలా కయీను మీద ఒక గుర్తు వేశారు.

చదువండి ఆది 4

ఆది 4:1-15 కోసం వీడియో