గలతీ పత్రిక 3:15-29

గలతీ పత్రిక 3:15-29 TSA

సహోదరీ సహోదరులారా, అనుదిన జీవితం నుండి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. మనుష్యులు చేసిన ఒడంబడికే అయినా దాన్ని స్థిరపరచిన తర్వాత దాన్ని ఎవరూ కొట్టివేయలేరు దానికి ఏమి కలపలేరు. ఇది కూడా అంతే. అబ్రాహాముకు అతని సంతానానికి వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. లేఖనంలో అనేకులను ఉద్దేశించి “సంతానాలకు” అని చెప్పడం లేదు, గాని ఒక్క వ్యక్తిని ఉద్దేశించి, “నీ సంతానానికి” అని చెప్పారు, ఆ సంతానం క్రీస్తు. నేను చెప్పేదేంటంటే, 430 సంవత్సరాల తర్వాత ఇవ్వబడిన ధర్మశాస్త్రం దేవునిచే ముందుగానే స్థిరపరచబడిన ఒడంబడికను ప్రక్కన పెట్టదు అలాగే దేవుని వాగ్దానాన్ని నిరర్ధకం చేయదు. ఎందుకంటే ఒకవేళ ఆ వారసత్వం ధర్మశాస్త్రం మీద ఆధారపడి ఉంటే, ఇక వాగ్దానం మీద ఆధారపడదు, అయితే దేవుడు అబ్రాహాముకు ఆ వారసత్వాన్ని తన కృపలో వాగ్దానం ద్వారా ఇచ్చారు. అలాంటప్పుడు, ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? వాగ్దానం ఎవరికి వర్తిస్తుందో ఆ సంతానం వచ్చేవరకు అతిక్రమాలను చూపడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రం దూతల ద్వారా ఇవ్వబడి మధ్యవర్తికి అప్పగించబడింది. అయినప్పటికీ మధ్యవర్తి ఒక్కరికే కాదు, కానీ దేవుడు ఒక్కడే. అలాగైతే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు వ్యతిరేకమా? ఎన్నటికి కాదు! ఇవ్వబడిన ధర్మశాస్త్రం మనకు జీవాన్ని ఇచ్చి ఉంటే, తప్పకుండా ధర్మశాస్త్రం వల్లనే నీతి కలిగి ఉండేది. అయితే యేసు క్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా కలిగిన వాగ్దానం ఆయనను నమ్మేవారికి ఇవ్వబడాలని, లేఖనం సమస్తాన్ని అందరిని పాపంలో బంధించింది. ఈ విశ్వాసం గురించి తెలియక ముందు, విశ్వాసం బయలుపరచబడే వరకు మనం బంధింపబడి ధర్మశాస్త్రం అదుపులో ఉంచబడ్డాము. అందువల్ల మనం విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడేలా క్రీస్తు వచ్చేవరకు ధర్మశాస్త్రం మనకు ఒక సంరక్షకునిగా ఉండింది. అయితే ఇప్పుడు ఈ విశ్వాసం మనకు బయలుపరచబడింది కాబట్టి మనం సంరక్షకుని ఆధీనంలో ఉండే అవసరం లేదు. కాబట్టి మీరందరు యేసు క్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులో బాప్తిస్మం పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదులని గ్రీసు దేశస్థులని, దాసులని స్వతంత్రులని, పురుషుడని స్త్రీ అని ఏ భేదం లేదు, క్రీస్తు యేసులో అందరు ఒక్కటే. మీరు క్రీస్తుకు చెందినవారైతే, మీరు అబ్రాహాము సంతానంగా ఉండి వాగ్దాన ప్రకారం వారసులు.