దానియేలు 9:1-10

దానియేలు 9:1-10 TSA

మాదీయుడును అహష్వేరోషు కుమారుడునైన దర్యావేషు బబులోను రాజ్యం మీద రాజుగా నియమించబడిన మొదటి సంవత్సరంలో అతని పరిపాలన మొదటి సంవత్సరంలో, దానియేలు అనే నేను పవిత్ర గ్రంథంలోని లేఖనాల ద్వారా గ్రహించింది, యిర్మీయా ప్రవక్తకు యెహోవా పంపిన వాక్కు ప్రకారం, యెరూషలేము యొక్క నిర్జన స్థితి డెబ్బై సంవత్సరాల వరకు కొనసాగుతుంది. కాబట్టి నేను ప్రభువైన దేవుని వైపు తిరిగి ప్రార్థన, విన్నపం ద్వారా ఆయనను ప్రాధేయపడ్డాను, ఉపవాసముండి, గోనెపట్ట చుట్టుకొని, బూడిద మీద పోసుకున్నాను. నా దేవుడైన యెహోవాకు ఇలా ప్రార్థన చేస్తూ ఒప్పుకున్నాను: “ప్రభువా! మిమ్మల్ని ప్రేమించి, మీ ఆజ్ఞలను పాటించేవారిపట్ల ప్రేమ నిబంధనను నిలిపే మహా భీకరుడవైన దేవా, మేము పాపం చేశాము, తప్పు చేశాము. మేము దుష్టులమై తిరుగుబాటు చేశాం; మీ ఆజ్ఞలు, న్యాయవిధుల నుండి తప్పిపోయాము. మీ నామంలో, మా రాజులతో, అధిపతులతో, పూర్వికులతో, దేశ ప్రజలందరితో మాట్లాడిన మీ దాసులైన ప్రవక్తల మాటలు మేము వినలేదు. “ప్రభువా! మీరు నీతిమంతులు, కాని ఈ రోజు మేమైతే అనగా మీ పట్ల మేము చూపిన నమ్మకద్రోహాన్ని బట్టి ఆయా దేశాలకు చెదరగొట్టబడిన యూదా ప్రజలం, యెరూషలేము నివాసులం, ఇశ్రాయేలీయులం, దగ్గరగా దూరంగా ఉన్నవారమందరం అవమానంతో నిండిపోయాము. యెహోవా, మేము మీకు వ్యతిరేకంగా పాపం చేశాం కాబట్టి మేము, మా రాజులు, అధిపతులు, పూర్వికులు అవమానంతో కప్పబడ్డాము. మా ప్రభువైన దేవుడు, మేము తిరుగుబాటు చేసిన కూడా, కరుణ, క్షమాపణ గలవారు; దేవుడైన యెహోవాకు మేము లోబడలేదు, ఆయన తన దాసులైన ప్రవక్తల ద్వారా మాకిచ్చిన న్యాయవిధులను మేము పాటించలేదు.