వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వీరు విద్యలేని సామాన్య మనుష్యులని తెలుసుకొని ఆశ్చర్యపడి, వీరు యేసుతో పాటు ఉన్నవారని గుర్తించారు. కానీ ఆ స్వస్థపడినవాడు వీరితో కూడా నిలబడి ఉండడం చూసి మరి ఏమి చెప్పలేకపోయారు. కాబట్టి వారు వీరిని న్యాయసభ నుండి బయటకు వెళ్లమని ఆదేశించి, తమలో తాము చర్చించుకొంటూ, “ఈ మనుష్యులను మనం ఏమి చేద్దాం? యెరూషలేములో నివసించే వారందరికి వీరు ఈ గొప్ప సూచకక్రియను చేశారని తెలుసు, కాబట్టి అది జరగలేదని చెప్పలేము. అయినా ఈ సంగతిని ప్రజల్లో మరింతగా వ్యాపించకుండా ఆపడానికి, ఈ పేరట మరి ఎవరితో మాట్లాడకుండా వారిని మనం బెదిరిద్దాం” అని అనుకున్నారు. మరల ఆ అపొస్తలులను లోపలికి పిలిచి యేసు పేరట ఎంత మాత్రం మాట్లాడకూడదు బోధించకూడదు అని ఆదేశించారు. అందుకు పేతురు యోహానులు, “దేవుని దృష్టిలో మీ మాట వినడం న్యాయమా లేదా దేవుని మాట వినడం న్యాయమా? మీరే న్యాయం చెప్పండి. మా మట్టుకైతే, మేము చూసినవాటిని విన్నవాటిని గురించి మేము మాట్లాడకుండా ఉండలేము” అని బదులిచ్చారు. ప్రజలందరు జరిగినదాని గురించి దేవుని స్తుతిస్తున్నారు, అందుకని వీరిని ఎలా శిక్షించాలో నిర్ణయించలేకపోయారు. కాబట్టి వారిని మరింత బెదిరించి విడిచిపెట్టారు. అద్భుతంగా స్వస్థపడినవాని వయస్సు నలభై సంవత్సరాలు. పేతురు యోహానులు విడుదల పొందిన తర్వాత, వారి సహవిశ్వాసుల దగ్గరకు వెళ్లి ముఖ్య యాజకులు యూదా పెద్దలు తమతో చెప్పిన వాటన్నింటి గురించి వారికి చెప్పారు. అది విన్న వెంటనే, వారందరు ఏకమనస్సుతో బిగ్గరగా దేవునికి ఈ విధంగా ప్రార్థించారు, “సర్వాధికారియైన ప్రభువా, మీరు ఆకాశాలను, భూమిని సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించారు. చాలా కాలం ముందే మీ సేవకుడు, మా పితరుడైన దావీదు ద్వారా పరిశుద్ధాత్మ పలికించిన మాటలు: “ ‘దేశాలు ఎందుకు కోపంతో ఉన్నాయి ప్రజలు ఎందుకు వ్యర్థంగా పన్నాగం వేస్తున్నారు? ప్రభువుకు ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా భూరాజులు లేచారు అధికారులు ఏకమయ్యారు.’ నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధంగా, యూదేతరులతో ఇశ్రాయేలు ప్రజలతో కలిసి హేరోదు పొంతి పిలాతు ఈ పట్టణంలో కుట్ర చేశారు. ఏమి జరగాలని నీ శక్తి నీ చిత్తం ముందుగానే నిర్ణయించిందో అలాగే వారు చేశారు. ప్రభువా, ఇప్పుడు, వీరి బెదిరింపుల మధ్య మీ సేవకులకు మీ మాటలను చెప్పడానికి గొప్ప ధైర్యం ఇవ్వండి. మీ పరిశుద్ధ సేవకుడైన యేసు పేరట స్వస్థపరచడానికి, సూచకక్రియలు, అద్భుతాలు చేయడానికి మీ హస్తాన్ని చాపండి.” వారు ప్రార్థించిన తర్వాత, వారు ఉన్న స్ధలం కంపించింది. వారందరు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు.
చదువండి అపొస్తలుల కార్యములు 4
వినండి అపొస్తలుల కార్యములు 4
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: అపొస్తలుల కార్యములు 4:13-31
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు