అపొస్తలుల కార్యములు 27:26-44

అపొస్తలుల కార్యములు 27:26-44 TSA

అయినప్పటికీ, మన ఓడ ఏదైనా ఒక ద్వీపం తగులుకోవాలి” అని చెప్పాడు. పద్నాలుగవ రోజు రాత్రి మేము ఇంకా అద్రియా సముద్రంలో కొట్టుకొనిపోతుండగా, ఇంచుమించు అర్థరాత్రి సమయంలో ఓడను నడిపేవారు ఒడ్డును సమీపిస్తున్నాం అని గ్రహించారు. వారు ఇనుప గుండు కట్టిన తాడు సముద్రంలో వేసి చూసి దానితో అక్కడ సుమారు నూట ఇరవై అడుగుల లోతుందని తెలుసుకున్నారు. మరికొద్ది సేపటికి సముద్రపు లోతును కనుగొనే దానిని మరలా వేసి తొంభై అడుగుల లోతుందని తెలుసుకొన్నారు. మేము రాతి దిబ్బలకు గుద్దుకొంటామేమో అనే భయంతో వారు నాలుగు లంగరులను ఓడ మూలలో నుండి క్రిందకు వేసి, పగటి వెలుగు కోసం ప్రార్థించాము. ఓడ నడిపేవారు ఓడలో నుండి పారిపోవాలని, తాము ఓడ ముందు భాగం నుండి కొన్ని లంగరులను పడవేయడానికి వెళ్తున్నట్లు నటిస్తూ రక్షక పడవను సముద్రంలోకి దింపారు. అప్పుడు పౌలు శతాధిపతితో, సైనికులతో, “ఈ మనుష్యులు ఓడలో ఉంటేనే తప్ప తమ ప్రాణాలను రక్షించుకోలేరు” అని చెప్పాడు. వెంటనే సైనికులు రక్షకపడవ దూరంగా కొట్టుకొని పోవడానికి దాని త్రాళ్లను కోసివేశారు. తెల్లవారుతునప్పుడు పౌలు వారందరిని ఆహారం తినమని వేడుకున్నాడు. “గత పద్నాలుగు రోజులనుండి ఏమి జరుగుతుందో అని మీరు ఏమి తినలేదు. మీరు బలహీనం కాకుండా దయచేసి భోజనం చేయండి, మీలో ఎవరి తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు” అని వారిని బ్రతిమాలాడు. అతడు ఈ మాటలను చెప్పిన తర్వాత, రొట్టెను తీసుకుని వారందరి ముందు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి తినడం ప్రారంభించాడు. అప్పుడు వారందరు ధైర్యం తెచ్చుకుని కొంత ఆహారం తిన్నారు. ఓడలో మొత్తం 276 మంది వ్యక్తులం ఉన్నాము. వారు తమకు కావలసినంత ఆహారం తిన్న తర్వాత, ఓడను తేలిక చేయడానికి ధాన్యాన్ని సముద్రంలో పడవేశారు. పగటి వెలుగు వచ్చినప్పుడు, వారు ఆ ప్రాంతాన్ని గుర్తించలేదు, కాని ఇసుకతీరం ఉన్న సముద్రపు పాయను చూసి, సాధ్యమైతే దానిలోనికి ఓడను నడిపించాలి అనుకున్నారు. త్రాళ్లను కోసి లంగరులను సముద్రంలో విడిచిపెట్టారు అదే సమయంలో చుక్కానులకు కట్టిన త్రాళ్లను విప్పేసారు. తర్వాత తెరచాపలను గాలికి ఎత్తి తీరం వైపునకు నడిపించారు. కాని రెండు ప్రవాహాలు కలిసిన చోట ఇసుకలో ఓడ ముందు భాగం కూరుకొనిపోయి కదల్లేదు. అలల తాకిడికి ఓడ వెనుక భాగం ముక్కలుగా విరిగి పోసాగింది. ఖైదీలు ఈదుకుని పారిపోకుండా వారిని చంపేయాలని సైనికులు అనుకున్నారు. కానీ శతాధిపతి పౌలు ప్రాణాన్ని కాపాడాలనుకొని సైనికులను తాము అనుకున్న దానిని చేయకుండా ఆపివేసి, ఈత వచ్చినవారు మొదట సముద్రంలోకి దూకి ఒడ్డుకు చేరుకోవాలని, మిగిలిన వారు చెక్కపలకల మీద లేదా ఓడ చెక్కల మీద ఒడ్డుకు చేరుకోవాలని ఆదేశించాడు. ఆ విధంగా వారందరు క్షేమంగా ఒడ్డుకు చేరుకొన్నారు.

అపొస్తలుల కార్యములు 27:26-44 కోసం వీడియో