రూతు 1:10-19

రూతు 1:10-19 TERV

ఆ కోడళ్లు, “మేమూ నీతోనే వచ్చేస్తాము. నీ కుటుంబంలోనే ఉంటాము” అన్నారు. కాని నయోమి ఇలా అన్నది: “నా కుమార్తెలారా! మీ పుట్టిళ్లకు వెళ్లిపొండి. మీరు నాతో రావడం దేనికి? మిమ్మల్ని పెళ్లిచేసుకునేందుకు నా దగ్గర ఇంకెవరూ కుమారులు లేరు. ఇంటికి వెళ్లిపోండి. ఇంకో భర్తను కట్టుకునేందుకు నేను మరీ ముసలిదానను, ఒకవేళ నాకు మళ్లీ పెళ్లవుతుందని నేను అనుకున్నా లాభం లేదు. ఎందుచేతనంటే ఒకవేళ నేను ఈ రాత్రికి రాత్రే గర్భవతినై నాకు ఇద్దరు కుమారులు పుట్టినా మీరు వారిని పెండ్లాడాలంటే వాళ్లు పెద్ద వాళ్లయ్యేంతవరకు మీరు వాళ్లకోసం వేచి ఉండాలి. అన్నాళ్లూ మీరు పెళ్లి చేసుకోకుండా ఆపుజేయడం నాకు మరీ విచారం. ఎందుకంటే, యెహోవా హస్తము నాకు విరోధముగా ఎన్నో పనులు చేసింది.” అప్పుడు ఆ స్త్రీలు మరింతగా ఏడ్చేశారు. ఓర్పా నయోమిని ముద్దు పెట్టుకుని వెళ్లిపోయింది. కాని రూతు ఆమెను హత్తుకుని ఉండిపోయింది. నయోమి అన్నది: “చూడమ్మా! నీ తోడికోడలు తన సొంతవారి దగ్గరకు, వారి దేవుళ్ల దగ్గరకు తిరిగి వెళ్లిపోయినది. నీవు కూడా అలానే చేయి.” కానీ రూతు, “నిన్ను విడిచి నా స్వంతవాళ్ల దగ్గరకు వెళ్లి పొమ్మని నన్ను బలవంతం చేయవద్దు. నేను నీతోనే వస్తాను. నీవు ఎక్కడికి వెళ్తే, నేనూ అక్కడికి వెళ్తాను. నీవు ఎక్కడవుంటే, నేనూ అక్కడే ఉంటాను. నీవారే నావారు, నీ దేవుడే నా దేవుడు. నీవు ఎక్కడ చస్తే నేనూ అక్కడే చస్తాను. అక్కడే సమాధి చేయబడతాను. నేను ఈ మాట నిలబెట్టు కోలేకపోతే, దేవుడే నన్ను శిక్షిస్తాడు. చావుతప్ప ఇంకేది మనలను విడదీయ లేదు.” రూతు తనతోనే రావాలనే పట్టుదలతో ఉన్నట్టు గ్రహించి, నయోమి ఆమెతో వాదించడం మానివేసింది. నయోమి, రూతు కలసి బేత్లెహేము పురము వరకు ప్రయాణము చేశారు. వారిద్దరూ బేత్లెహేము చేరగానే ఆ ఊరివారంతా సంబరపడిపోయి. “ఈమె నయోమి కదూ?” అని చెప్పుకున్నారు.

చదువండి రూతు 1