రోమీయులకు వ్రాసిన లేఖ 2:17-29

రోమీయులకు వ్రాసిన లేఖ 2:17-29 TERV

నీవు యూదుడవని చెప్పుకొంటావు. ధర్మశాస్త్రాన్ని నమ్ముకొన్నావు. దేవునితో నీకు ఉన్న సంబంధాన్ని గురించి గర్వంగా చెప్పుకుంటావు. నీవు ధర్మశాస్త్రం ప్రకారము శిక్షణ పొందావు. దేవుని ఉద్దేశ్యం తెలుసుకొన్నావు. మంచిని గుర్తించ గలుగుతున్నావు. అంధులకు మార్గదర్శివని, చీకట్లో ఉన్నవాళ్ళకు వెలుగువంటివాడవని నీవనుకొంటున్నావు. మీ ధర్మశాస్త్రంలో జ్ఞానం, సత్యం ఉన్నాయి కనుక నీవు మూర్ఖులను సరిదిద్దగలననుకొంటున్నావు. అజ్ఞానులకు బోధించగలననుకొంటున్నావు. ఇతర్లకు బోధించే నీవు స్వయంగా నీకు నీవే ఎందుకు బోధించుకోవటం లేదు? దొంగతనము చేయరాదని బోధించే నీవు దొంగతనము చేయవచ్చా? వ్యభిచారం చేయరాదని బోధించే నీవు వ్యభిచారం చేయవచ్చా? విగ్రహారాధనను అసహ్యించుకునే నీవు మందిరాలు దోచుకోవచ్చా? ధర్మశాస్త్రాన్ని గురించి గర్వంగా చెప్పుకొనే నీవు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి దేవుణ్ణి అగౌరవపరచవచ్చా? ఈ విషయంపై, “నీ కారణంగా దేవుని పేరు యూదులుకానివాళ్ళ మధ్య దూషింపబడింది” అని వ్రాయబడి ఉంది. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే సున్నతికి విలువ ఉంది. కాని నీవు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే, నీ సున్నతికి విలువలేదు. కనుక సున్నతి చేయించుకోనివాళ్ళు ధర్మశాస్త్ర నియమాల్ని పాటిస్తే వాళ్ళు సున్నతి చేయించుకొన్నవాళ్ళతో సమానము కదా? యూదులైన మీ దగ్గర ధర్మశాస్త్రం వ్రాత మూలంగా ఉంది. మీరు సున్నతి చేయించుకుంటారు. అయినా, మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు కనుక, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వ్యక్తి, అతడు సున్నతి పొందని వాడైనా మీరు తప్పు చేస్తున్నారని రుజువు చేస్తున్నాడు. నిజమైన సున్నతి బాహ్యమైనది, శారీరకమైనది కాదు. అదేవిధంగా యూదునివలే బాహ్యంగా కనబడినంత మాత్రాన యూదుడు కాలేడు. అంతరంగంలో యూదునిగా ఉన్నవాడే నిజమైన యూదుడు. హృదయపు సున్నతి అంటే పరిశుద్ధాత్మ ద్వారా సున్నతి పొందటం అన్నమాట. ధర్మశాస్త్ర నియమంతో కాదు. ఇలాంటివాణ్ణి దేవుడు మెచ్చుకొంటాడు. మానవులు కాదు.

రోమీయులకు వ్రాసిన లేఖ 2:17-29 కోసం వీడియో