సామెతలు 30:1-17
సామెతలు 30:1-17 TERV
యాకె కుమారుడు ఆగూరు చెప్పిన జ్ఞాన సూక్తులు ఇవి: అతడు ఈతీయేలుకు, ఉక్కాలుకు ఇచ్చిన సందేశం: భూమి మీద నేను అతి దౌర్భాగ్యుడను. నేను గ్రహించాల్సిన విధంగా గ్రహించటంలేదు. జ్ఞానము కలిగి ఉండటం నేను నేర్చుకోలేదు. మరియు దేవుని గురించి నాకు ఏమీ తెలియదు. ఏ మనిషీ ఎన్నడూ పరలోకంలోని సంగతులను గూర్చి నేర్చుకోలేదు. ఏ మనిషీ ఎన్నడూ గాలిని తన చేతిలో పట్టుకోలేదు. ఏ మనిషీ ఎన్నడూ నీటిని ఒక గుడ్డ ముక్కలో పట్టుకోలేడు. ఏ మనిషీ ఎన్నడూ భూమి హద్దులను నిజంగా తెలిసికోలేడు. ఈ సంగతులను తెలిసికో గలిగిన మనిషి ఎవరైనా ఉంటే ఆ మనిషి ఎవరు? అతని కుటుంబం ఎక్కడ ఉంది? దేవుడు చెప్పే ప్రతి మాటా పరిపూర్ణం. దేవుని దగ్గరకు వెళ్లే మనుష్యులకు ఆయన ఒక క్షేమస్థానం కనుక దేవుడు చెప్పే విషయాలను మార్చేందుకు ప్రయత్నించకు. నీవు అలా చేస్తే ఆయన నిన్ను శిక్షించి, నీవు అబద్ధాలు చెబుతున్నట్టు రుజువు చేస్తాడు. యెహోవా, నేను చనిపోక ముందు నా కోసం రెండు పనులు చేయుమని నేను నిన్ను అడుగుతున్నాను. అబద్ధాలు చెప్పకుండా ఉండేందుకు నాకు సహాయం చేయి. నన్ను మరీ ధనికునిగా లేక మరీ దరిద్రునిగా చేయవద్దు. ప్రతిరోజూ నాకు అవసరమైన వాటిని మాత్రమే అనుగ్రహించు. నాకు అవసరమైన దానికంటే నాకు ఎక్కువగా ఉంటే, అప్పుడు నీతో నాకు అవసరం లేదని నేను తలస్తాను. కాని నేను దరిద్రుడనైతే ఒకవేళ నేను దొంగతనం చేస్తానేమో. అప్పుడు నేను యెహోవా నామానికి అవమానం తెస్తాను. ఒక సేవకునికి విరోధంగా అతని యజమానితో చెడ్డ మాటలు ఎన్నడూ చెప్పవద్దు. నీవు అలా చేస్తే ఆ యజమాని నిన్ను నమ్మడు. నీవు దోషివని అతడు తలస్తాడు. కొందరు మనుష్యులు వారి తండ్రులకు విరోధంగా మాట్లాడతారు. మరియు వారి తల్లులను గౌరవించరు. కొందరు చాలా మంచివాళ్లం అనుకొంటారుగాని వారు చాలా చెడ్డవాళ్లు. కొంతమంది చాలా మంచివాళ్లం అనుకొంటారు. వారు యితరులకంటే చాలా మంచివాళ్లు అనుకొంటారు. ఖడ్గాల్లాంటి పళ్లు ఉన్నవారు కొందరు ఉంటారు. వారి దవడలు కత్తుల్లా ఉంటాయి. వారు పేద ప్రజలనుండి సమస్తం దోచుకోవటానికి వారి సమయం అంతా ఉపయోగిస్తారు. కొంతమంది వారికి చేతనైనంత మట్టుకు అంతా తీసికోవాలి అనుకొంటారు. “నాకివ్వు, నాకివ్వు, నాకివ్వు” అనటం మాత్రమే వారు చెప్పేది అంతాను. ఎన్నటికీ తృప్తిపడనివి మూడు ఉన్నాయి వాస్తవానికీ సరిపడినంతగా ఎన్నడూ లేనివి నాలుగు ఉన్నాయి. చావు స్థలం, పిల్లలు లేని స్త్రీ, వర్షం కావాల్సిన బీడుభూమి, వారించజాలని వేడి నిప్పు. తన తండ్రిని ఎగతాళి చేసే మనిషీ, తన తల్లికి లోబడని మనిషీ ఎవరైనా సరే శి క్షిచబడుతారు. అది అతని కళ్లు రాబందులు, లేక కృ-రపక్షులు తినివేసినట్టు ఉంటుంది.

