మత్తయిత 13:19-30

మత్తయిత 13:19-30 TERV

“కొందరు దేవుని రాజ్యాన్ని గురించి వింటారు. కాని అర్థం చేసుకోరు. అలాంటి హృదయాల్లో నాటబడిన దైవ సందేశాన్ని సైతాను తీసుకు వెళ్తాడు. వీళ్ళను రహదారి ప్రక్కనపడిన విత్తనాలతో పోల్చవచ్చు. “దైవ సందేశాన్ని విని వెంటనే ఆనందంగా అంగీకరించే వాళ్ళను రాతి నేలపైబడ్డ విత్తనాలతో పోల్చవచ్చు. అలాంటి విత్తనాలకు వేర్లు ఉండవు. కనుక అవి చాలాకాలం బ్రతుకవు. సందేశం వలన కష్టాలుకాని హింసలు కాని సంభవించినప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని వదలి వేస్తారు. “దైవ సందేశాన్ని విని జీవితంలోని కష్టాలకు, ధనంవలన కలిగే మోసానికి ఉక్కిరి బిక్కిరై, నిష్పలులై పోయే వాళ్ళను ముళ్ళ మొక్కల్లో పడిన విత్తనాలతో పోల్చవచ్చు. “దైవ సందేశాన్ని విని దాన్ని అర్ధం చేసుకొనే వాళ్ళను సారవంతమైన భూమిలో పడ్డ విత్తనాలతో పోల్చవచ్చు. వాటిలో కొన్ని నూరురెట్లు పంటను, కొన్ని అరవై రెట్లు పంటను, కొన్ని ముప్పైరెట్లు పంటను యిస్తాయి.” యేసు వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు: “దేవుని రాజ్యాన్ని మంచి విత్తనాల్ని తన పొలంలో నాటిన మనిషితో పోల్చవచ్చు. అందరూ నిద్రపోతుండగా అతని శత్రువు వచ్చి గోధుమ విత్తనాల మధ్య కలుపు విత్తనాలను చల్లిపోయాడు. గోధుమ మొలకెత్తి విత్తనం వేసింది. వాటితో సహా కలుపుమొక్కలు కూడ కనిపించాయి. పని వాళ్ళు, తమ యజమాని దగ్గరకు వచ్చి ‘అయ్యా! మీరు మీ పొలంలో మంచి విత్తనాలను నాటలేదా? మరి కలపు మొక్కలు ఎట్లా మొలిచాయి?’ అని అడిగారు. “‘ఇది శత్రువు చేసిన పని’ అని ఆ యజమాని సమాధానం చెప్పాడు. “పని వాళ్ళు, ‘మమ్మల్ని వెళ్ళి కలుపు తీయమంటారా?’ అని అడిగారు. “అతడు, ‘వద్దు! మీరిప్పుడు కలుపు తీస్తే గోధుమ మొక్కల్ని కూడా పెరికి వేసే అవకాశం ఉంది. కోతకొచ్చేవరకు రెండింటినీ పెరగనివ్వండి. అప్పుడు నేను కోత కోసే వాళ్ళతో, మొదట కలుపు మొక్కలు కోసి, కాల్చివేయటానికి వాటిని మోపులుగా కట్టి కాల్చివేయండి. ఆ తర్వాత గోధుమ గింజల్ని ప్రోగు చేసి నా ధాన్యపు కొట్టులోకి తీసుకు వెళ్ళమంటాను’ అని అంటాడు.”