మత్తయిత 12:22-28
మత్తయిత 12:22-28 TERV
ఆ తర్వాత కొందరు, దయ్యంపట్టి గ్రుడ్డివానిగా, మూగవానిగా అయిపోయిన ఒకతణ్ణి యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. యేసు అతనికి నయం చేసాడు. దానితో ఆ మూగ వానికి మాట, దృష్టి రెండూ వచ్చాయి. ప్రజలందరికి ఆశ్చర్యమేసి, “ఈయన బహుశా దావీదు కుమారుడేమో!” అని అన్నారు. పరిసయ్యులు ఇది విని, “దయ్యాల రాజైన బయెల్జెబూలు సహాయంతో యితడు దయ్యాలను వదిలిస్తున్నాడు. అంతే!” అని అన్నారు. వాళ్ళ ఆలోచనలను యేసు తెలుసుకొన్నాడు. వాళ్ళతో, “విభాగాలైన ప్రతి రాజ్యం నశించి పోతుంది. విభాగాలైన ప్రతి పట్టణమూ, ప్రతి యిల్లు కూలిపోతుంది. సైతాను సైతాన్ని పారద్రోలితే వాడు విడిపోతాడు. అప్పుడు వాని రాజ్యం ఏవిధంగా నిలుస్తుంది? నేను బయెల్జెబూలు ద్వారా దయ్యాన్ని పారద్రోలుతున్నట్లైతే మీ కుమారులు ఎవరి ద్వారా పారద్రోలుతున్నారు? మీరంటున్నది తప్పని మీ వాళ్ళే ఋజువు చేస్తున్నారు. ఒకవేళ నేను దేవుని ఆత్మ ద్వారా దయ్యాల్ని పారద్రోలుతున్నట్లైతే దేవుని రాజ్యం మీకు వచ్చినట్లేగదా!

