ఆదికాండము 19:15-22
ఆదికాండము 19:15-22 TERV
మర్నాడు సూర్యోదయాన దేవదూతలు లోతును తొందరపెట్టి ఈలాగన్నారు. “చూడు, ఈ పట్టణం శిక్షించబడుతుంది. కనుక ఇంక నీతో ఉన్న నీ భార్యను, నీ యిద్దరు కుమార్తెలను తోడుకొని ఈ స్థలం విడిచిపెట్టు. అప్పుడు ఈ పట్టణంతోబాటు నీవు నాశనంగాకుండా ఉంటావు.” కాని, లోతు కలవరపడి, వెళ్లిపోయేందుకు త్వరపడలేదు. కనుక ఆ ఇద్దరు మనుష్యులు (దేవదూతలు) లోతు, అతని భార్య, అతని యిద్దరు కుమార్తెల చేతులు పట్టుకొన్నారు. లోతును అతని కుటుంబాన్ని ఆ ఇద్దరు మనుష్యులు ఆ పట్టణంలోనుంచి క్షేమంగా బయటకు నడిపించారు. లోతు, అతని కుటుంబం యెడల యెహోవా దయ చూపాడు. అందుచేత లోతును అతని కుటుంబాన్ని ఆ ఇద్దరు మనుష్యులు ఆ పట్టణంలోనుండి బయటకు తీసుకొని వచ్చారు. వారు బయటకు వచ్చాక, ఆ మనుష్యులలో ఒకరు ఇలా అన్నారు: “ఇప్పుడు మీ ప్రాణం కాపాడుకోవటానికి పారిపొండి. మళ్లీ వెనక్కు తిరిగి పట్టణం వైపు చూడకండి. లోయలో ఎక్కడా ఆగకండి. పర్వతాలు చేరేంత వరకు పరుగెత్తండి. అలా చేయకపోతే, పట్టణంతో పాటు మీరూ నాశనం అయిపోతారు.” అయితే ఆ ఇద్దరు మనుష్యులతో లోతు ఇలా చెప్పాడు: “అయ్యలారా, అంత దూరం పరుగెత్తమని నన్ను బలవంతం చేయవద్దు. మీ సేవకుడనైన నా మీద మీరు చాలా దయ చూపించారు. నన్ను రక్షించటం మీరు చూపించిన మహా గొప్ప దయ. కానీ, నేను పర్వతాల వరకు పరుగెత్తలేను. నేను మరీ నిదానమైతే, ఆ నగరానికి సంభవించవలసిన శిక్ష నాకు తగిలి నేను మరణిస్తాను. అయితే చూడండి, ఇక్కడికి సమీపంలో ఒక చిన్న ఊరుంది. నన్ను ఆ ఊరికి పారిపోనివ్వండి, అక్కడ నా ప్రాణం రక్షించబడుతుంది.” దేవదూత లోతుతో, “సరే మంచిది, అలాగే కానివ్వు. నీవు వెళ్తున్న ఆ ఊరిని నేను నాశనం చేయను. అయితే అక్కడికి వేగంగా పరుగెత్తు. నీవు క్షేమంగా ఆ ఊరు చేరేంతవరకు, సొదొమను నేను నాశనం చేయను” అన్నాడు. (ఆ ఊరు చిన్నది గనుక అది సోయరు అని పిలువబడింది.)

